దర్శకుడిగా చదలవాడ శ్రీనివాసరావు మూడో సినిమా.. వాస్తవ ఘటనలతో ‘రక్తధార’!
ABN, Publish Date - Nov 15 , 2026 | 05:46 PM
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తన దర్శకత్వంలో మూడో సినిమాగా ‘రక్తధార’ను తెరకెక్కించనున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్నారు. హంతకుడి తల్లి పాత్రలో సురేఖ వాణి నటించనున్నారు.
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పుట్టిన రోజు నవంబర్ 15. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొల్లూరులోని ఏసియన్ టింబర్ ఎస్టేట్‌లో చదలవాడ శ్రీనివాసరావు సినీ పాత్రికేయుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన స్వీయ దర్శకత్వంలో రాబోతున్న మూడో చిత్రం వివరాలను తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో చిత్రాలను నిర్మించి, ఘన విజయాలను సొంతం చేసుకున్న శ్రీనివాసరావు ప్రస్తుతం తెలుగు నిర్మాతల మండలి కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాను దర్శకుడిగా మారిన వైనాన్ని ఆయన మీడియాకు వివరిస్తూ, 'ఆర్. నారాయణమూర్తి మంచి నటుడు. నాకు చక్కని స్నేహితుడు. సమాజంలో మార్పుకోసం ఆయన ఎన్నో సినిమాలను స్వీయదర్శకత్వంలో నిర్మించారు. అయితే అందులో అత్యధిక శాతం సినిమాలు నక్సలిజాన్ని బలపరిచేవి. కొన్ని సినిమాల్లో ఆయన పోలీసు డిపార్ట్ మెంట్‌ను, పోలీసులను తక్కువ చేసి తీసిన సన్నివేశాలూ ఉన్నాయి. అయితే నాకు తెలిసిన పోలీసు అధికారులు కొందరు నారాయణమూర్తి గారితో పోలీసు వేషం వేయించి, పోలీసుల కష్టనష్టాలను ఆయన ద్వారా తెలియచేస్తే బాగుంటుందని కోరారు. వారి కోరిక మేరకు నేను నారాయణమూర్తితో మాట్లాడి ఓ సినిమా చేయడానికి అంగీకరింప చేశారు. నా మీద గౌరవంతో ఆయన అందులో నటించడానికి ఒప్పుకున్నారు. పోలీసులు ఎదుర్కొన్నే సమస్యలకు ప్రాధాన్యమిస్తూ, సమాజానికి ఉపయోగపడే సినిమా తీశాను. అదే 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'. ఇందులో ఆర్. నారాయణమూర్తి టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా 2017 జనవరి 14న విడుదలైంది. నా పోలీసు మిత్రులకోసం తీసిన ఈ సినిమా మేకర్ గా నాకు ఎంతో తృప్తిని కలిగించింది' అని అన్నారు.
తన దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా గురించి చెబుతూ, 'ఇద్దరు యువకులు ప్రధాన పాత్రధారులుగా 'రికార్డ్ బ్రేక్' అనే మూవీని స్వీయ దర్శకత్వంలో 2024లో తీశాను. ఈ స్పోర్ట్స్ డ్రామా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చెన్నయ్ వెళ్ళినప్పుడు మిత్రుడు, నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ కారణంగా ఎన్టీరామారావు గారి మద్రాసు ఇంటిని కొనుగోలు చేసే గొప్ప అవకాశం నాకు లభించింది. ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి ఎంతోమంది వచ్చినా... ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ప్రస్నన్న కుమార్ సహకారంతో నేను దానిని కొనగలిగాను. చెన్నై ప్రధాన కూడలిలో ఉన్న ఆ స్థలాన్ని వాణిజ్యం కోసం ఉపయోగించకుండా, పెద్దాయన ఎన్టీఆర్ ఇంటిగానే ఉంచాలని భావించాను. ఆ ఇంటిని అలానే ఉంచి, మరమత్తులు చేయించాను. అతి త్వరలో ఆ ప్రాంగణంలో రామారావుగారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రజల సందర్శనార్ధం ఏర్పాటు చేయబోతున్నాను. అలా నా రెండో సినిమా 'రికార్డ్ బ్రేక్' ఓ ఊహించని గొప్ప కార్యం నేను తలపెట్టేలా చేసింది' అని అన్నారు.
తాను దర్శకత్వం వహించబోతున్న మూడో సినిమా గురించి వివరిస్తూ, 'ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తీయబోతున్న సినిమా. కొద్ది నెలల క్రితం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఓ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు బానిస అయిన ఓ వ్యక్తి ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను క్రూరంగా చంపేశాడు. అంతేకాదు. ఓ మైనర్ బాలికను ఆమె కుటుంబ సభ్యులను సైతం హత్య చేశాడు. ఈ విషయంలో కొందరు పోలీసులను కూడా తప్పు పట్టారు. అయితే నిజానికి అక్కడ జరిగింది అతని పెంపక లోపం. తల్లిదండ్రులు చిన్నప్పుడు అతన్ని సక్రమమార్గంలో పెట్టి ఉంటే... ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. ఇవాళ ఓ వ్యక్తి తప్పటడుగు వేశాడంటే దానికి కారణం కేవలం సమాజం మాత్రమే కాదు... అందులో ప్రధాన పాత్ర తల్లిదండ్రులది ఉంటుంది. ఈ ఘోరకలి నేపథ్యంలో తీయబోతున్న సినిమాకు 'రక్తధార' అనే పేరు పెట్టాం. టైటిల్ రిజిస్ట్రేషన్ అయ్యింది. మరో నెల రోజుల్లో నటీనటులందరినీ ఎంపిక చేసి పూర్తి వివరాలు ప్రకటిస్తాం' అని అన్నారు.
కీలకపాత్రలో సురేఖావాణి!
ఈ సినిమా కథను తయారు చేసే విషయంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, దర్శకనిర్మాత పి. సునీల్ కుమార్ రెడ్డి ఎంతో సహకారం అందించారని శ్రీనివాసరావు తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి, అక్కడ వ్యక్తులను కలిసి, వాస్తవ వివరాలను సేకరించి, ఈ కథను రూపొందించారని చెప్పారు. ' రక్తధార' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించబోతున్నారని, ఇందులో హంతకుడి తల్లి పాత్రను సురేఖ వాణి పోషిస్తున్నారని అన్నారు.
ఇటీవల దర్శకుల సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణస్వీకారం సమయంలో చదలవాడ శ్రీనివాసరావు కొత్త, యువ దర్శకులను ప్రోత్సహించే నిమిత్తం 30 కోట్లతో పది చిత్రాలను దర్శకుల సంఘం నేతృత్వంలో తాను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోందని, నవీన్ మేడారం దర్శకత్వంలో ఆ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలయ్యాయని చెప్పారు. తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా తాను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, అదే విధంగా చిత్రపురి కాలనీ కమిటీకి తాను ఆర్థిక సాయం చేశానని ఆయన వివరించారు.
ప్రముఖ దర్శకుడు అజయ్ కుమార్, అల్లాణి శ్రీధర్, అళహరి, చిత్రపురి కాలనీ మాజీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు చదలవాడ శ్రీనివాసరావును స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Varanasi: ‘వారణాసి’ ప్రీ-గ్లింప్స్‌కు ఏడాది.. జక్కన్న కొత్త సర్ప్రైజ్ ఎప్పుడు?
Kajal: టాలీవుడ్ రుణం తీర్చుకున్న కాజల్.. బాలీవుడ్ భామలకు స్ట్రాంగ్ కౌంటర్
Ramyakrishnan: అవును.. నా భర్త, నేను వేరు వేరుగా ఉంటున్నాం