మేకర్స్ మేల్కోవాలి... లేకుంటే తిప్పలు తప్పవు!
ABN, Publish Date - Jul 25 , 2026 | 05:20 PM
సెన్సార్ అధికారులు ఈ మధ్య కాలంలో సినిమా టైటిల్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ యేడాది ఇప్పటికే నాలుగైదు సినిమాల టైటిల్స్ మార్చిన వారు... తాజాగా 'కామాఖ్య' టైటిల్ విషయంలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు.
సినిమాకు టైటిల్ అనేది ఎంతో ప్రధానమైంది. పాపులారిటీ కోసం సెన్సిబుల్ టైటిల్ పెట్టేసి, ప్రచార పరంగా పబ్బం గడిపేసుకోవచ్చు కానీ విడుదల సమయంలో మాత్రం హర్డిల్స్ తప్పవని ఇటీవల కొన్ని సినిమాల విషయంలో రుజువైంది. కథకు సూట్ కాని టైటిల్, వివాదాలకు దారి తీసే పేర్లు పెడితే సెన్సార్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించే రోజులు పోయాయి. గతంలో కంటే ఇప్పుడు సెన్సార్ వాళ్ళు టైటిల్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
జబర్దస్త్ కార్యక్రమంలో చక్కని గుర్తింపు తెచ్చుకున్న 'అదిరే' అభి గత యేడాది 'చిరంజీవా' అనే సినిమాతో దర్శకుడయ్యాడు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాపులర్ ఆర్టిస్టులతో డివోషనల్ అండ్ థిల్లర్ జానర్ లో 'కామాఖ్య' అనే సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడా సినిమా టైటిల్ పై సెన్సార్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ యేడాదిలో ఇప్పటికే నాలుగైదు సినిమాల టైటిల్స్ మార్చితే తప్పితే సర్టిఫికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని సెన్సార్ వాళ్ళు తేల్చి చెప్పారు. దాంతో సినిమాను విడుదల చేయడానికి కొద్ది రోజుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో టైటిల్ మార్చుకున్నారు కొందరు నిర్మాతలు. అలా 'వానర' టైటిల్ మార్చాల్సిందే అని చెప్పడంతో 'వనవీర'గా మార్చుకున్నారు. 'వానర' అంటే ఠక్కున గుర్తొచ్చేది హనుమంతుడే. అయితే రిజ్వర్వేషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆ పేరు పెట్టడం, అందులో కొన్ని సన్నివేశాలను వీ.ఎఫ్.ఎక్స్.లో చేయడంతో సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో నిర్మాతలు మనసు మార్చుకుని టైటిల్ మార్చారు. అలానే 'చాయ్ వాలా' అనగానే అందరి మనసులో మెదిలే వ్యక్తి దేశ ప్రధాని నరేంద్రమోది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ నటించిన సినిమాకు 'చాయ్ వాలా' అనే పేరు పెట్టారు. సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ పేరును 'నవాబ్ కేఫ్'గా మార్చారు. 'చిదంబరం గారు' సినిమా పేరుకూ ముందు 'శ్రీ' జత చేయమని సెన్సార్ వారు కోరారు. ఎందుకంటే ఈ మూవీ మేకర్స్ 'కళ్ళు' చిదంబరంను దృష్టిలో పెట్టుకుని ఈ పేరు పెట్టినా... అదే పేరుతో ఓ మాజీ కేంద్రమంత్రి ఉండటంతో కాస్తంత గౌరవం ఇవ్వమన్నారు. నిజానికి జర్నలిజంలో గారు అనేది ఉంటే శ్రీ అవసరం లేదు. కానీ సెన్సార్ వారి కోరిక మేరకు చిదంబరం గారు అనే పేరుకు మరింత గౌరవాన్ని మేకర్స్ ఇవ్వాల్సి వచ్చింది. సుహాస్ నటించిన 'హే భగవంత్' సినిమా పేరునూ 'హే బల్వంత్' అని మార్చితే కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేశారు. ఇక 'కపుల్స్ ఫ్రెండ్లీ' మూవీ టైటిల్ మార్చితే యు/ఎ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వారు చెప్పినా... నిర్మాతలు ససేమిరా అనడంతో 'ఎ' సర్టిఫికెట్ తోనే ఆ సినిమా రిలీజ్ అయ్యింది.
ఇప్పుడు జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి సినిమా 'కామాఖ్య' పేరును మార్చాల్సిందే అని సెన్సార్ వారు చెప్పడంతో 'కర్మాఖ్య' అని మార్చారు. మారిన పేరు జనాల్లోకి వెంటనే చేరుతుందో లేదో అనే భయంతో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కొత్త టైటిల్ లోగోను రిలీజ్ చేయిస్తే... ట్రైలర్ లాంచ్ కు ఏకంగా విజయశాంతిని తీసుకొచ్చారు. దాంతో 'కర్మాఖ్య' పేరు కొందరికైనా రీచ్ అయ్యింది. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది.
సహజంగా సినిమా విడుదలకు వారం, పదిరోజుల ముందు నిర్మాతలు సెన్సార్ చేయిస్తుంటారు. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే... వెంటనే ఎడిటర్ తో చేయించి, ఫైనల్ కాపీ సిద్థం చేసుకుని సర్టిఫికెట్ పొందుతారు. కానీ ఇలా టైటిలే మార్చాల్సి వస్తే... కేవలం వారం రోజుల్లో కొత్త టైటిల్ జనంలోకి వెళ్ళడం అనేది అయ్యే పనికాదు. దాంతో సెన్సార్ వాళ్ళు టైటిల్ మార్చి, తమని ఇబ్బంది పెట్టారని సదరు నిర్మాతలు వాపోతుంటారు. నిజానికి సినిమాకు టైటిల్ పెట్టినప్పుడే దానిపై ఏమైనా అభ్యంతరం వ్యక్తం అవుతుందేమో అనే ఆలోచన మేకర్స్ చేయాలి. తమ కథకు సంబంధం లేని టైటిల్ పెట్టినా... ప్రజల మనోభావాలను దెబ్బ తీసే పేర్లు పెట్టినా... ఖచ్చితంగా సెన్సార్ అధికారులు అడ్డుకుంటారు. ముందే మేల్కొని, జాగ్రత్త వహించి వివాదాస్పద పేర్లు పెట్టకుండా ఉంటే మంచిది. లేదంటే చివరి నిమిషంలో టైటిల్ మారడం వల్ల నష్టపోయేది నిర్మాతే. ఆ విషయాన్ని సినిమాకు టైటిల్ పెట్టే ముందు గుర్తు పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు!
ఇవి కూడా చదవండి:
విద్యార్థుల ఆందోళన.. సీఎం విజయ్‌కు కనిపించడం లేదా?: దర్శకులు
బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే
రామా ఏంటిది.. ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లా?