విద్యార్థుల ఆందోళన.. సీఎం విజయ్‌కు కనిపించడం లేదా?: దర్శకులు

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:16 PM

నీట్‌ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఢిల్లీ వేదికగా విద్యార్థులు, కాక్రోచ్‌ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకు తమిళ దర్శకులు పలువురు తమ సంఘీభావం ప్రకటించారు.

CM Vijay

నీట్‌ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీమానా చేయాలంటూ ఢిల్లీ వేదికగా విద్యార్థులు, కాక్రోచ్‌ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకు తమిళ దర్శకులు పలువురు తమ సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు సాగించిన దమనకాండకు సంబంధించిన వీడియోలను ముఖ్యమంత్రి విజయ్‌ (Tamil Nadu CM Vijay) చూడటం లేదా అని వారు ప్రశ్నించారు.


న్యాయబద్ధమైన సమస్య కోసం విద్యార్థులు ఆందోళనకు దిగారని, దీనికి పరిష్కారం చూపించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ (Vetrimaaran) విమర్శించారు. ఈ పోరాటంలో విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నట్టుగా మరో దర్శకుడు మారి సెల్వరాజ్‌ (Mari Selvaraj) ప్రకటించారు. మరోవైపు నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలని, ప్లస్‌టూలో వచ్చిన మార్కుల ఆధారంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని దర్శకులు పా.రంజిత్‌ (Pa. Ranjith), అమీర్‌ వంటి వారు డిమాండ్‌ చేశారు.


‘ఇది కొంతమంది విద్యార్థుల సమస్య కాదు. మన భవిష్యత్తు తరాలకు సంబంధించిన విద్యా హక్కు. వారి జీవనాధారం. న్యాయం కోసం వీధుల్లో పోరాటం చేసే యువత గొంతుకకు అండగా నిలుద్దాం. ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ విద్యార్థులకు అండగా ఉందాం’ అని పా.రంజిత్‌ పిలుపునిచ్చారు. వీరే కాదు.. కోలీవుడ్ చెందిన పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ వేశారు. ప్రస్తుతం వారి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై సీఎం విజయ్ వెంటనే స్పందించి, తన స్టాండ్ తెలియజేయాలంటూ వారు డిమాండ్ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి:

బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే

రామా ఏంటిది.. ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లా?

బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభం

Updated Date - Jul 25 , 2026 | 02:16 PM