Nandamuri Mokshagnya: ఆ సెంటిమెంట్‌ను మోక్షజ్ఞ బ్రేక్‌ చేస్తాడా!?

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:07 PM

నందమూరి స్టార్ హీరోలెవరికీ మొదటి సినిమా సూపర్ హిట్‌ కాలేదు. కానీ మోక్షజ్ఞ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడని నందమూరి అభిమానులు నమ్ముతున్నారు.

Nandamuri Mokshagnya

నందమూరి హీరోస్ అందరికంటే భిన్నంగా బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్. పలు ఫాంటసీ ఎలిమెంట్స్ తో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కనుందని వినిపిస్తోంది. అదే సమయంలో నందమూరి హీరోలకు ఉన్న ఓ సెంటిమెంట్‌ను మోక్షజ్ఞ బ్రేక్‌ చేస్తాడని అభిమానులు నమ్ముతున్నారు.

బాలకృష్ణ నటవారసునిగా మోక్షజ్ఞను తెరపై చూడాలని అభిమానులు కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. అదుగో ఇదుగో అంటూనే కాలం కరిగిపోయింది. మొత్తానికి మోక్షజ్ఙ సినిమా ఈ యేడాది సెట్స్ కు వెళ్తుందని వినిపిస్తోంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించి, నిర్మించిన 'బింబిసార' ద్వారా దర్శకునిగా పరిచయమైన వశిష్ఠ దర్శకత్వంలోనే మోక్షజ్ఙ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నందమూరి హీరోల ఎంట్రీ సమయంలో పెద్దగా హంగామా ఏమీ ఉండదు. వారి సినిమాలు సాదాసీదాగానే ఆరంభమవుతాయి. తరువాతే థియేటర్లలో సందడి చేస్తాయని ఇప్పటికే ప్రూవ్ అయింది. ఒకే ఒక్క నందమూరి తారకరత్న విషయంలోనే అందుకు భిన్నంగా సాగింది. ఒకే రోజున తారకరత్న నటించిన తొమ్మిది చిత్రాలు ప్రారంభమయ్యాయి. అయితే బాలయ్య తనయుడు మోక్షజ్ఙ విషయంలో అంతటి హంగామా ఏమీ లేకుండా సినిమా మొదలవుతుందని వినిపిస్తోంది.


నందమూరి నటవంశానికి మూలపురుషుడైన నటరత్న యన్.టి.రామారావు సాంఘిక చిత్రం 'మనదేశం'తో తెరకు పరిచయమయ్యారు. అలాగే ఆయన నటవారసుడు బాలకృష్ణ కూడా 'తాతమ్మకల' అనే సోషల్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. యన్టీఆర్ మరో నటవారసుడు హరికృష్ణ తన తండ్రి నటించిన 'శ్రీకృష్ణావతారం'లో బాలకృష్ణుని పాత్రతో తెరంగేట్రం చేశారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ యన్టీఆర్ కూడా తండ్రిలాగే బాలనటులుగా తెరపై ముందుగా కనిపించారు. తరువాత హీరోలుగా రాణించారు. అయితే వీరెవ్వరి మొదటి సినిమా పరిచయాలు ఘనంగా సాగలేదు. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ సోలో హీరోగా 'డిస్కోకింగ్' కోసం కెమెరా ముందుకు వచ్చారు. అయినా ఏ లాంటి హంగామా చోటు చేసుకోలేదు. కేవలం అభిమానుల సందడి మాత్రమే సాగింది. అదే తీరున జూనియర్ యన్టీఆర్, కళ్యాణ్ రామ్ పరిచయాలు కూడా జరిగాయి. ఆ పంథాలోనే బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కూడా సాదాసీదాగానే జరగనుందని తెలుస్తోంది.


సూపర్ హిట్‌ను ఇవ్వని ఫస్ట్ మూవీ!

దర్శకుడు వశిష్ఠ తొలి సినిమా 'బింబిసార'తోనే తానేమిటో నిరూపించుకున్నారు. 'బింబిసార'ను సోషియో ఫాంటసీగా తెరకెక్కించి రక్తి కట్టించారు వశిష్ఠ. ఆయన రెండో సినిమా చిరంజీవి హీరోగా రూపొందిన 'విశ్వంభర' కూడా సోషియో ఫాంటసీనే. ఈ సినిమా రిలీజ్ కావలసి ఉంది. ఇప్పుడు మోక్షజ్ఙతో రూపొందించబోయే సినిమా సైతం ఫాంటసీగానే తెరకెక్కబోవడం విశేషంగా మారింది. నందమూరి హీరోల్లో ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకుంటూ తెరకు పరిచయమయ్యారు. ఇప్పుడు మోక్షజ్ఞను సైతం ఓ స్పెషల్ జానర్ తో పరిచయం చేయించాలని బాలయ్య ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇప్పటి దాకా నందమూరి నటవంశంలో స్టార్స్ గా వెలిగిన వారందరి మొదటి సినిమాలు పెద్దగా అలరించలేదు. నటరత్న యన్టీఆర్ కు రెండో సినిమా, బాలయ్యకు నాల్గవ చిత్రం, జూనియర్ కు సెకండ్ మూవీ, కళ్యాణ్ రామ్ కు మూడో చిత్రం విజయాలు అందించాయి. మోక్షు మొదటి సినిమాతోనే హిట్ పట్టేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఏమవుతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి:

70 ఏళ్ల వయసొచ్చినా.. నచ్చితే రెండో పెళ్లి చేసుకుంటా: ప్రేమ

‘వారణాసి’ కీలక అప్‌డేట్.. ఇంత స్పీడ్ ఏంటి జక్కన్నా?

TFTDDA: జానీ మాస్టర్ వైఫ్ సుమలత స్కెచ్ అదిరిందిగా.. కోర్టు సంచలన తీర్పు

Updated Date - Sep 12 , 2026 | 05:08 PM