బోయ‌పాటి దృష్టంతా.. ఆ హీరోపైనే

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:35 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన 'సరైనోడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కలయికలో వచ్చిన 'సరైనోడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బన్నీని సరికొత్త మాస్ యాంగిల్‌లో చూపించి అటు ఫ్యాన్స్‌‌ను అలరించడంతో పాటు, ఇటు కలెక్షన్ల వర్షం కురిపించారు బోయపాటి. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది.

సరైనోడు తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతోందని, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ దీనికి సన్నాహాలు చేస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. మధ్యలో బోయపాటి తెరకెక్కించిన 'అఖండ 2' ఫలితం చూశాక ఈ కాంబో ఉండకపోవచ్చని ఊహాగానాలు వచ్చినప్పటికీ, ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. కథా చర్చలు కూడా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయని, త్వరలోనే గీతా ఆర్ట్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం... ప్రస్తుతం అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా లేదట. వీళ్లిద్దరి ప్రాజెక్ట్‌‌పై వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'రాకా' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, కొన్ని కారణాల వల్ల మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రద్దు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాసిల్ జోసెఫ్‌‌తోనూ సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బన్నీ లైనప్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో.. బోయపాటి ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.

మరోవైపు బోయపాటి శ్రీను ఫోకస్ అంతా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను ఒక కీలక ప్రకటన చేశారు. బాలయ్యతో 'అఖండ 3' ఖచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే దానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ మాస్ కాంబినేషన్ కు అఖండ-2 చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు 'అఖండ 3' రాబోతోందని తెలియడంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

అంటే.. అల్లు అర్జున్‌తో సినిమా కంటే ముందే బోయపాటి, బాలయ్యతోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా.. బోయపాటి శ్రీను స్టైల్ మాస్ ఎలివేషన్లకు అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద బొమ్మ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే అంటున్నారు ఫ్యాన్స్. కానీ, అభిమానులు ఆశించిన ఈ కాంబో ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో.. బోయపాటి శ్రీను తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరితో ప్రకటిస్తారో వేచి చూడాలి.

Updated Date - Oct 07 , 2026 | 10:35 AM