తెలుగు సినిమాల్లో పెరుగుతున్న బాలీవుడ్ నటులు
ABN, Publish Date - Aug 10 , 2026 | 02:25 PM
ఒకప్పటి కంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ కనిపించడం ఎక్కువయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకూ తెలుగులో నటించని బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నారట. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ మూవీస్ లో నటించిన బాలీవుడ్ నటులపై సినీ ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు.
అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లోనే హిందీ హీరో షాహిద్ కపూర్ ఓ కీలక పాత్ర ధరించనున్నారని వినికిడి. ఈ చిత్రాన్ని పౌరాణిక గాథతో తెరకెక్కిస్తారనీ సమాచారం. ఇలా పలు విశేషాలను ఇప్పటి నుంచే అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందే ప్రాజెక్ట్ అందిపుచ్చుకుంటోంది. అదే అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. షాహిద్ కపూర్ ఇప్పటి దాకా తెలుగు చిత్రాల్లో నటించలేదు. అయితే తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్దేశకత్వంలో షాహిద్ నటించిన 'కబీర్ సింగ్' బిగ్ హిట్ గా నిలచింది. అలాగే తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన 'జెర్సీ' సినిమాలోనూ షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.అయితే 'జెర్సీ' బాక్సాఫీస్ బాంబ్ గా మిగిలింది.
తెలుగు చిత్రసీమకు, బాలీవుడ్ హీరోస్ కు అనుబంధం ఏ నాటి నుంచో ఉంది. ఆ మాటకొస్తే తెలుగు భాషలో హిందీ సినిమాలను డబ్బింగ్ చేసి సక్సెస్ సాధించిన వారూ ఉన్నారు. నాటి మేటి నటుడు రాజ్ కపూర్ తన 'ఆహ్' చిత్రాన్ని 1953లోనే తెలుగులో 'ప్రేమలేఖలు'గా డబ్ చేసి విజయం సాధించారు. ఆ పై విజయా ప్రొడక్షన్స్, సురేశ్ ప్రొడక్షన్స్, పద్మాలయా, ప్రసాద్ ప్రొడక్షన్స్ వంటి సంస్థలు పలు హిందీ చిత్రాలు నిర్మించి ఉత్తరాదిన జయకేతనం ఎగురవేశాయి. అంతకు ముందు తెలుగు నిర్మాతలు నిర్మించిన హిందీ చిత్రాల్లో పలువురు హిందీ హీరోలు నటించి ఆకట్టుకున్నారు. అయితే అందరికన్నా మిన్నగా జితేంద్ర తెలుగు నిర్మాతల చిత్రాల్లో నటించారు. అప్పట్లో జితేంద్రను 'తెలుగువారి హిందీ హీరో' అనేవారు. తెలుగు నిర్మాతలు ఏ సినిమాను రీమేక్ చేసినా అందులో జితేంద్రనే హీరోగా ఎంచుకొనేవారు.
హిందీ చిత్రసీమలో సూపర్ స్టార్స్ గా సాగిన రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ కూడా తెలుగువారి హిందీ సినిమాల్లో నటించి విజయాలు సాధించారు. అయితే జితేంద్ర ఎక్కువగా తెలుగువారి హిందీ రీమేక్స్ లో నటించి అలరించారు. తరువాతి రోజుల్లో తెలుగు సినిమాల్లో హిందీ నటులు నటించడం ఆరంభించారు. కానీ, వారందరూ కేరెక్టర్ రోల్స్, విలన్ వేషాలు వేసిన వారే కావడం గమనార్హం. కొన్ని తెలుగు సినిమాల్లో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ వంటివారు కేమియో అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ మధ్యనే బాలీవుడ్ ప్రముఖ నటులు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు ధరించడం ఆరంభించారు. రామ్ పోతినేని హీరోగా రూపొందిన 'డబుల్ ఇస్మార్ట్'లో సంజయ్ దత్ ప్రతినాయకునిగా నటించి ఆకట్టుకున్నారు.
గతంతో పోలిస్తే ఈ మధ్య ఉత్తరాదిన ఒకప్పుడు స్టార్స్ గా సాగినవారు తెలుగు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ - చిరంజీవి తో కలసి 'గాడ్ ఫాదర్'లో నటించారు. రాజమౌళి 'ట్రిపుల్ ఆర్'లో అజయ్ దేవగన్ కీలక పాత్ర ధరించారు. బాలకృష్ణ 'డాకు మహరాజ్', పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాల్లో బాబీ డియోల్ బ్యాడ్ మేన్ గా నటించి ఆకట్టుకున్నారు. జూనియర్ యన్టీఆర్ 'దేవర'లో సైఫ్ అలీఖాన్, వెంకటేశ్ 'సైంధవ్'లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లోనే కనిపించారు. ఇలా తెలుగు చిత్రాల్లో బాలీవుడ్ నటుల సందడి సాగుతోంది.
అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కే చిత్రంలో షాహిద్ కపూర్ పాజిటివ్ రోల్ లోనే కనిపిస్తారని టాక్. అల్లు అర్జున్ - షాహిద్ కపూర్ ఇద్దరూ మంచి డాన్సర్స్. కాబట్టి వారిద్దరిపై ఓ స్పెషల్ సాంగ్ రూపొందినా ఆశ్చర్య పోనక్కరలేదని పరిశీలకులు భావిస్తున్నారు. మన టాలీవుడ్ హీరోస్ కొందరు హిందీ చిత్రాల్లోనూ హీరోలుగా నటించి అలరించారు. ఇప్పుడు బాలీవుడ్ నటులు మన తెలుగు సినిమాల్లో నటించడం ఓ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతోంది. షాహిద్ కపూర్ తరువాత ఇంకెందరు హిందీ హీరోలు టాలీవుడ్ బాట పడతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
మత్తు ఇచ్చి నటిపై అత్యాచారం.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్
ఫ్యాన్స్ ప్రెషర్‌ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..
రోహిత్ నారా ‘కపాలి’లో.. హన్సిక ఇంటెన్స్ ఫస్ట్ లుక్