సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

VFX Fail: 'వారణాసి'.. 'రామాయణ' వీఎఫ్ఎక్స్ అంతంత మాత్రమే.. లోకల్ టాలెంట్ భళా..

ABN, Publish Date - Jun 28 , 2026 | 10:54 AM

'పేరు గొప్ప - ఊరు దిబ్బ' అనిపించేలా బిగ్ మూవీస్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయట... ఆ ముచ్చటేదో ముందుగా చూద్దాం...

VFX Weak for Big Movies

హిట్టు కొట్టాలంటే గ్రాఫిక్స్ తో ఓ పట్టు పట్టాలి అంటూ సినీజనం పరుగులు తీస్తున్నారు. వీఎఫ్ఎక్స్ కోసం వందల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా పేరు గొప్ప- ఊరు దిబ్బ అన్నట్టు కొన్ని సినిమాలు వస్తున్నాయి. అదే సమయంలో ఉన్నంతలోనే ఆకట్టుకుంటూ మరికొన్ని మురిపిస్తున్నాయి. ఆ వైనమేంటో చూద్దాం...

అంత చేసి లాభమేంటి?

ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా సినీ ఫ్యాన్స్ రెండు సినిమాల గురించి భలేగా ముచ్చటించుకుంటున్నారు. వాటిలో ఒకటి రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా తెరకెక్కుతోన్న 'వారణాసి'. రెండోది ఈ యేడాదే దీపావళికి వెలుగు చూడనున్న పౌరాణిక చిత్రం 'రామాయణ- 1'. ఈ రెండు సినిమాల్లోనూ గ్రాఫిక్స్ కు అత్యంత ప్రాధాన్యత ఉంది... స్టార్ కాస్ట్ రెమ్యూనరేషన్స్, జనరల్ షూటింగ్ ఖర్చు కంటే 'వీఎఫ్ఎక్స్' కోసం వెచ్చిస్తున్న మొత్తాలే ఈ రెండు సినిమాల మూవీ బడ్జెట్ ను అమాంతం పెంచేశాయని టాక్... అయితే ఈ రెండు చిత్రాల ట్రైలర్, గ్లింప్స్ జనం ముందుకు రాగానే నిరుత్సాహం కలిగించాయి. 'వారణాసి'లో హీరో మహేశ్ ఎద్దుపై వచ్చే సీన్ రాజమౌళి స్టాండర్డ్ కి తగ్గట్లు లేదని సినీ ఫ్యాన్స్ అంటున్నారు.

అక్కడా అనుమానమే...!?

ఇక 'రామాయణ' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న నమిత్ మల్హోత్రాకే ప్రసిద్ధి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఉంది... నమిత్ కు చెందిన 'ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్' కంపెనీ రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్ కు ఆస్కార్ అవార్డ్స్ కూడా లభించాయి. ఈ సంస్థ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కిన 'ఇన్ సెప్షన్', 'ఇంటర్ స్టెల్లార్', 'ఎక్స్ మెషీనా', 'బ్లేడ్ రన్నర్ 2049', 'ఫస్ట్ మేన్', 'టెనెట్', 'డ్యూన్', 'డ్యూన్-2' చిత్రాలు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనే అకాడమీ అవార్డులు సంపాదించాయి. అలాంటి సంస్థ సొంతగా తెరకెక్కిస్తోన్న 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్ చూడగానే జనం పెదవి విరిచారు. ఇండియాలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 'దంగల్' తెరకెక్కించిన నితేశ్ తివారీ డైరెక్షన్ లో 'రామాయణ' రూపొందుతోంది. నితేశ్ లాంటి డైరెక్టర్, వీఎఫ్ఎక్స్ పై పట్టున్న నమిత్ లాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ 'రామాయణ' గ్లింప్స్ అనుకున్న స్థాయిలో అకట్టుకోలేక పోయింది.

లోకల్ టాలెంట్... భళా !

'రామాయణ', 'వారణాసి' సినిమాల పరిస్థితి ఇలా సినీ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తే, లోకల్ టాలెంట్ తో తెరకెక్కిన 'నాగబంధం' సినిమా గ్రాఫిక్స్ అందరినీ మాయ చేస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు అభిషేక్ నామాకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఉంది. దాంతో తన 'నాగబంధం' చిత్రానికి ఏ సీన్ లో ఎలాంటి ఎఫెక్ట్ కావాలో అభిషేక్ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే గ్రాఫిక్స్ డిజైన్ చక్కగా కుదిరింది. 'నాగబంధం' ట్రైలర్ చూసిన జెన్ జీ సైతం విజువల్ వండర్ అంటే ఇలా ఉండాలి అంటున్నారు. మరి స్థానికంగా విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన 'నాగబంధం' ఇలా ఉంటే,  ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న డిజైనర్స్ తో వర్క్ చేయిస్తోన్న 'రామాయణ', 'వారణాసి' గ్లింప్స్, ట్రైలర్ ఎందుకలా ఉన్నాయనే చర్చ ఇప్పుడు సినీ ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది.

తలవంపులు... పెరిగిన భారం...

'రామాయణ' చిత్రం రెండు భాగాలుగా జనం ముందుకు రానుంది. ఒకటి ఈ యేడాది దీపావళి కానుకగా వస్తే, రెండో భాగం వచ్చే సంవత్సరం దీపావళికి రిలీజ్ కానుంది. అయితే 'రామాయణ' వీఎఫ్ఎక్స్ వర్క్ చూసి, ఈ సినిమాకు ఇన్వెస్ట్ చేస్తోన్న హాలీవుడ్ ప్రముఖులు సైతం నిరుత్సాహపడ్డారు. దాంతో 'రామాయణ' నిర్మాత నమిత్ మల్హోత్రాను నిలదీశారు. వాస్తవానికి తమ వర్క్ తో పలు చిత్రాల ద్వారా ఆస్కార్స్ సంపాదించిన సంస్థ అధినేత అయిన మల్హోత్రా హాలీవుడ్ వారి ముందు తలదించుకోవలసి వచ్చింది... మొదట్లో వెయ్యి కోట్ల రూపాయలతోనే 'రామాయణ' రెండు భాగాలను పూర్తి చేయాలని ఆశించారు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ కోసం బడ్జెట్ ను 500 మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో దాదాపు నాలుగున్నర వేల కోట్ల రూపాయలు పెంచవలసి వచ్చిందట.

ఫ్యాన్ మేడ్... బెటర్...


హాలీవుడ్ లో ఓ సినిమా సెట్స్ కు వెళ్ళక ముందే అందులోని ప్రతి సీన్ ను, అందులోని ప్రతి నటుడు, నటి నటనను బేరీజు వేసుకొని 'స్టోరీ బోర్డ్స్' రూపొందిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తో కావలసిన ఎఫెక్ట్స్ ను కూడా ముందుగానే ప్లాన్ చేసుకొనే వీలు కలుగుతోంది. అలాంటి వర్క్ 'రామాయణ'కు జరగలేదేమో అని అనుమానిస్తున్నారు. ఒరిజినల్ 'రామాయణ' గ్లింప్స్ కంటే ఫ్యాన్ మేడ్ విజువల్స్ బాగున్నాయనీ బాలీవుడ్ బాబులే చెబుతున్నారు.

ఇంతకు ముందు కూడా...

'రామాయణ', 'వారణాసి' చిత్రాల బడ్జెట్ ను బేరీజు వేస్తూ 'నాగబంధం' విజువల్ ఎఫెక్ట్స్ కే సినీ ఫ్యాన్స్ లో సింహభాగం జై కొడుతోంది... జూలై 3వ తేదీన 'నాగబంధం' ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి విజువల్ కన్నుల పండుగ గా ఉండి ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూద్దామా అనే ఆసక్తి మూవీ లవర్స్ లో క్రియేట్ అయింది. ఇప్పుడంటే 'నాగబంధం' గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ మూవీ కంటే ముందుగా వచ్చి బంపర్ హిట్స్ గా నిలచిన 'హనుమాన్', 'మిరాయ్' చిత్రాలకు సైతం లోకల్ టాలెంట్ తోనే 'వీఎఫ్ఎక్స్' రూపొందాయి. సదరు చిత్రాల్లోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ రెండు సినిమాల ఘనవిజయానికి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన కారణమని చెప్పక తప్పదు. అంత అనుభవం, ఎంతో పేరు, తగిన సొమ్ము ఉన్నప్పటికీ 'రామాయణ', 'వారణాసి' చిత్రాల్లో జరగని మ్యాజిక్ లోకల్ టాలెంట్ తో రూపొందిన ఈ చిన్న సినిమాలు ఎలా సాధించాయి అన్న చర్చ విశేషంగా సాగుతోంది.


అద్భుతాలు జరుగుతాయా...!?

చిన్న, పెద్ద అన్న భేదాలు ప్రధానం కాదు. మనం ఎంచుకున్న కథకు తెరపై కనిపించవలసిన ఎఫెక్ట్స్ ఎలా ఉండాలో ముందుగానే విజువలైజ్ చేసుకోవాలి. ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న రాజమౌళి, నితేశ్ తివారీ వంటివారు అలా చేసుకోరని చెప్పలేం. కానీ, వారిద్దరూ తమ చిత్రాలతో వండర్స్ క్రియేట్ చేసినవారే. అలాంటి వారి భారీ సినిమాల నుంచీ జనం ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ వారి సినిమాల గ్లింప్స్ తో ప్రేక్షకులు నిరుత్సాహ పడ్డారు. ఆ నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చుకోవలసిన బాధ్యత వారిపైనే కాదు, సినిమా నిర్మాతలపైనా, విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్ మీద, క్రూ మొత్తం మీద ఉంటుంది. మరి ఈ రెండు సినిమాలు జనం ముందు నిలిచే సమయానికి వండర్స్ క్రియేట్ చేస్తాయా!? లేక వాటికంటే ముందే రాబోతున్న ‘నాగబంధం’ ఎఫెక్ట్ వాటిపై పడుతుందా అన్నది చూడాల్సి ఉంది.

Updated Date - Jun 28 , 2026 | 12:12 PM