సి. కళ్యాణ్‌ను ఢీ కొట్టబోతున్న బండ్ల గణేశ్
ABN, Publish Date - Aug 22 , 2026 | 06:16 PM
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు వేడెక్కబోతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున ఈసారి అధ్యక్షుడిగా బండ్ల గణేశ్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
తెలుగు నిర్మాతల మండలిలో ఎన్నికల శంఖారావం మ్రోగింది. గత కొంతకాలంగా ఈ అసోసియేషన్ ఎన్నికలు జరపాలని పలువురు నిర్మాతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరబోతోంది. సెప్టెంబర్ 6న ఎన్నికలను నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజేతలను ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఆగస్ట్ 17 నుంచి నిర్మాతల మండలి ఎన్నికలకు నామినేషన్స్ ను స్వీకరిస్తున్నారు. ఇది 24వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజులు విత్ డ్రాస్ కోసం గడువు ఇచ్చి, 28న తుది జాబితాను ప్రకటిస్తారు. వీరందరికీ సెప్టెంబర్ 6న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగుతాయి. ఇదే రోజు సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తారు.
తెలుగు నిర్మాతల మండలికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు చిన్న నిర్మాతలకు మధ్య హోరాహోరీ పోరు సాగుతూ ఉంటుంది. తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి ఈసారి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ పడుతున్నారు. సి. కళ్యాణ్ ప్యానల్ నుంచి కార్యదర్శులుగా తుమ్మలపల్లి ప్రసన్న కుమార్, వైవియస్ చౌదరి పోటీ చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీస్ గా అమ్మిరాజు, రామసత్యనారాయణ బరిలో నిలుస్తున్నారు. ట్రెజరర్‌గా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు పోటీ చేస్తున్నారు. కాగా... యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు చెందిన బండ్ల గణేశ్ ప్యానల్ నుంచి ఏ పదవికి ఎవరెవరు పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా కలసి బండ్ల గణేశ్‌ను ఈసారి అధ్యక్ష పదవికి బరిలో దించడం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
నెక్ట్స్ బోయపాటితో.. అయ్యగారి న్యూలుక్ చూశారా
మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ.. బన్నీ పోస్ట్ వైరల్