మూడోసారి ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో బాలయ్య - నాగ్ ఢీ !

ABN , Publish Date - Sep 15 , 2026 | 10:53 AM

ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ - నాగార్జున బాక్సాఫీస్ బరిలో ఒకేరోజున ఢీకొంటున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ ఇటు నందమూరి అభిమానులు- అటు అక్కినేని ఫ్యాన్స్ తమకు తెలిసిన లెక్కలు వేసుకుంటున్నారు.

Balakrishna Vs Nagarjuna

తెలుగు చిత్రసీమలో బాక్సాఫీస్ వార్ కు ఓ స్పెషల్ క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్ కే దక్కుతుంది. తరువాతి తరం స్టార్స్ ఆ బాటలోనే సాగుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. అందువల్ల యన్టీఆర్- ఏయన్నార్ వారసుల మధ్య బాక్సాఫీస్ వార్ మరింత ఆసక్తి కలిగిస్తోంది. యన్టీఆర్- ఏయన్నార్ తమ కెరీర్ లో ఒకే రోజున పోటీపడ్డ సందర్భాలు రెండే రెండు సార్లు చోటు చేసుకున్నాయి. అదీ 1967లోనే జరగడం విశేషం. అయితే నటరత్న- నటసమ్రాట్ వారసులు ఇప్పటికే రెండు సార్లు బాక్సాఫీస్ వార్ లో ఢీ కొన్నారు. 1987లో ఓ సారి, రెండో సారి 1996లో బాలయ్య- నాగ్ మధ్య బాక్సాఫీస్ వార్ ఒకే రోజున సాగింది. ఆ రెండు సార్లూ పొంగల్ బరిలోనే పోటీ జరగడం విశేషం. 1987లో పొంగల్‌ కు నాగార్జున 'మజ్ను' విడుదల కాగా అదే రోజున బాలకృష్ణ 'భార్గవ రాముడు' వచ్చింది. అందులో 'మజ్ను'ది పై చేయిగా నిలిచింది. 1996లో నాగార్జున 'వజ్రం', బాలకృష్ణ 'వంశానికొక్కడు' వచ్చాయి. అందులో 'వజ్రం' ఫ్లాప్‌ కాగా, 'వంశానికొక్కడు' సూపర్ హిట్‌ అయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ క్రిస్మస్ బరిలో పోటీకి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 24వ తేదీనే బాలకృష్ణ 'దాదా', నాగార్జున 'కింగ్ 100' సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. దాంతో ఈ పోటీపై ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి చోటు చేసుకుంది.


బాలకృష్ణ 1984లో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1986లో నాగార్జున హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత నుంచీ వీరిద్దరి చిత్రాలు బాక్సాఫీస్ బరిలో పలుమార్లు పోటీపడ్డా, ఒకే రోజున ఢీ కొన్నది రెండు సార్లే. అయితే ఇప్పుడు వారి టైటిల్స్ విషయంలోనూ ఆసక్తి కలిగించే అంశాలు తెలుస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా కెమెరా ముందుకు వచ్చిన తొలి చిత్రం 'డిస్కో కింగ్'. అయితే ఈ మూవీ ఆయన రెండో సినిమాగా రిలీజైంది. ఇక నాగార్జున హీరోగా సాగుతున్న తొలి రోజుల్లో 'కిరాయిదాదా', 'విక్కీదాదా'గా నటించారు. ఇప్పుడు వారిద్దరి టైటిల్స్ లోని చివరి పదాలు ఇటు అటుగా మారడం విశేషం. బాలకృష్ణ 111వ చిత్రంగా 'దాదా' వస్తోంది. నాగార్జున 100వ సినిమాగా 'కింగ్ 100' రానుంది. అందువల్లే ఫ్యాన్స్ లో ఆసక్తి అధికమయిందని చెప్పొచ్చు. అప్పట్లో 'డిస్కో కింగ్' ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయితే నాగార్జున 'కిరాయిదాదా', 'విక్కీదాదా' అభిమానులకు ఆనందం పంచాయి. బాలయ్య 'డిస్కో కింగ్'లోని 'కింగ్' ఇప్పుడు నాగ్ 100వ సినిమా టైటిల్ అయింది. నాగ్ 'కిరాయి దాదా, విక్కీ దాదా' చిత్రాల్లోని చివరి పదం బాలయ్య 111వ సినిమా టైటిల్ గా మారింది. అదే ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తోన్న అంశం. ఇప్పటికే నాగ్ 'కింగ్' అనే చిత్రంలో నటించి సందడి చేశారు. ఇప్పుడు ఆ పదాన్నే నాగ్ పేరు ముందు కూడా అభిమానులు జోడిస్తున్నారు.


నాగార్జున 'కింగ్ 100' సినిమాకు క్రేజ్ రావడానికి కారణం ఇది ఆయన వందో చిత్రం కావడమే. ఇక బాలయ్య 'దాదా'కు బజ్ పెరగడానికి కారణమేమిటంటే ఈ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పటికే బాలకృష్ణతో 'వీరసింహారెడ్డి' లాంటి బంపర్ హిట్ చూశారు. ఇలా బాలయ్య 'దాదా', నాగార్జున 'కింగ్ 100' రెండు సినిమాలకు క్రేజ్ ఉంది. 'అఖండ' నుంచి వరుసగా ఐదు చిత్రాలతో బాలయ్య వంద కోట్లకు పైగా వసూళ్ళు చూస్తూ సాగారు. అందువల్ల ప్రస్తుతం ఆయన అభిమానుల దృష్టి రెండు వందల కోట్లపై ఉంది. ఇప్పటి దాకా నాగార్జున హీరోగా రూపొందిన ఏ చిత్రమూ వంద కోట్లు పోగేయలేకపోయింది. దాంతో ఆయన ఫ్యాన్స్ 'కింగ్ 100'తో వంద కోట్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఇలా 'దాదా', 'కింగ్ 100' కూడా ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. పైగా బాలకృష్ణ, నాగార్జున మధ్య మునుపటి సఖ్యత లేదనీ తెలుస్తోంది. దీంతో రెండు చిత్రాల మధ్య పోటీ పెరిగే అవకాశమూ ఉంది. మరి అభిమానుల అభిలాషను బాలయ్య 'దాదా', నాగార్జున 'కింగ్ 100' నెరవేరుస్తాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి!

చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్

పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!

Updated Date - Sep 15 , 2026 | 11:27 AM