బాలయ్య గళంలో మరో మాస్ సాంగ్
ABN, Publish Date - Nov 11 , 2026 | 05:52 PM
నటసింహ నందమూరి బాలకృష్ణ మరోమారు సింగర్ అవతారమెత్తారు. తన అప్ కమింగ్ మూవీ 'దాదా' కోసం ఆయన మరోసారి గళం విప్పారు. దాంతో అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకట్ సతీశ్ కిలారు నిర్మిస్తోన్న 'దాదా' సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ లోనే బాలయ్య ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయన రెస్ట్ తీసుకోవడంతో చిత్రీకరణలో జాప్యం అనివార్యమయింది. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లో వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో 'దాదా'కు మరింత క్రేజ్ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇందులో బాలయ్య గళంలో జాలువారిన 'దాదా ధమాకా' అంటూ సాగే పాట రూపొందింది. తమన్ బాణీల్లో ఈ పాట భలేగా వచ్చిందని 'దాదా' యూనిట్ మాట. డాన్స్ నంబర్ గా ఈ పాటను చిత్రీకరించారట. 'దాదా' నుండి ఫస్ట్ సింగిల్ గా ఈ పాటను నవంబర్ 13న రిలీజ్ చేయనున్నారు.
బాలకృష్ణ గాయకునిగా మారడం ఇదే మొదటిసారి కాదు. తొమ్మిదేళ్ళ క్రితం బాలయ్య హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'పైసా వసూల్' చిత్రంలో 'మామా ఏక్ పెగ్ లా...' అనే పాటను అనూప్ రూబెన్స్ బాణీల్లో ఆలపించి ఆకట్టుకున్నారు. 'మామా ఏక్ పెగ్ లా...' సాంగ్ అప్పట్లో మందుబాబుల్లో జోష్ నింపింది. ఇప్పటికీ టీవీ షోస్ లో ఈ పాటను విశేషంగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మందుతాగినట్టు నటించే సన్నివేశం ఉంటే 'మామా ఏక్ పెగ్ లా...' సాంగ్ ను వినియోగించుకుంటున్నారు. అలా తొలిసారే గాయకునిగా అలరించిన బాలయ్య ఈ సారి 'దాదా'లో మరోమారు సందడి చేస్తారనీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు...
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'వీరసింహారెడ్డి' 2023 సంక్రాంతి సందడిలో బంపర్ హిట్ గా నిలచింది. ఈ మూవీ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న 'దాదా'పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందువల్ల డిసెంబర్ మొదటివారానికి షూటింగ్ పూర్తి చేసి తరువాత పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రచారహోరు కూడా పెంచాలని ఆశిస్తున్నారు. అందులో భాగంగానే 'దాదా' ఫస్ట్ సింగిల్ గా ఐటమ్ నంబర్ ను ముందుగా రిలీజ్ చేయనున్నారు. ఈ పాటతో 'దాదా'కు మరింత బజ్ పెరుగుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. బాలయ్య గళంలో జాలువారిన సాంగ్ రిలీజైన తరువాత 'దాదా'పై ఇంకెన్ని అంచనాలు పెరుగుతాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Renudesai: తమిళనాట వార్తల్లో నిలిచిన రేణు దేశాయ్
విడుదలకు ఒక్కరోజు ముందు ‘అ’ వాయిదా!
Siddu 10: సిద్దు.. నయన్.. ఓ రొమాంటిక్ డ్రామా