Nagasourya: ప్రభాస్‌కు లభించిన అదృష్టం శ్రీదేవితో నాకూ రావాలి!
ABN , Publish Date - Apr 14 , 2026 | 10:29 AM
ఏప్రిల్ 17న రాబోతున్న 'బ్యాడ్ బోయ్ కార్తిక్' ప్రీరిలీజ్ ఈవెంట్ చిత్రబృందం సమక్షంలో జరిగింది. ఈ సినిమా విజయం పట్ల అందరూ ధీమా వ్యక్తం చేశారు.
నాగ శౌర్య (Nagasourya) హీరోగా, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik). ఈ చిత్రంలో నాగశౌర్య మాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించి ఈ సినిమా ఇదే నెల 17న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఇందులో హీరో నాగశౌర్య మాట్లాడుతూ, 'సినిమాటోగ్రాఫర్ రసూల్ గారు ఈ సినిమాలో నన్ను చాలా బాగా చూపించారు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన వయసులో ఉన్నప్పుడు హీరోగా ట్రై చేసి ఉంటే బాగుండేది. ఆయన వల్ల ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. మా హీరోయిన్ విధికి ఇది తెలుగులో ఫస్ట్ సినిమా. ఆమెకు ఇది మంచి లాంచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీదేవిగారితో పనిచేయడం చాలా మంచి అనుభవం. ఆమె ప్రభాస్‌గారి మొదటి సినిమాలో చేశారు, నాకు కూడా అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నాను. సాయికుమార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, సముద్రఖని... ఇలా చాలా పెద్ద తారాగణం ఈ సినిమాలో ఉంది. డైరెక్టర్ రమేష్ చాలా కష్టపడి చేశారు. మా నిర్మాతలు చాలా కష్టపడి సినిమా తీశారు. వారికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని నమ్ముతున్నాను' అని అన్నారు.
శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ, 'ఎన్ని కష్టాలు వచ్చినా నిర్మాత శ్రీనివాస్ గారు ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ మూవీతో ఆయనకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలి. రసూల్ గారు లేకపోతే ఈ జర్నీ ఇలా పూర్తి అయ్యేది కాదు. ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నేనూ థియేటర్‌లో ఈ సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నాను. నాగశౌర్యతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక కొత్త కథలో మేమిద్దరం కలిసి పనిచేయడం చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. శౌర్య గారు చాలా మంచి యాక్టర్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. విధికి తెలుగులో మంచి సక్సెస్‌ఫుల్ కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
నిర్మాత శ్రీనివాస్ చింతలపూడి మాట్లాడుతూ, 'ఇది మా ఫస్ట్ సినిమా. మా ఫస్ట్ హీరో నాగశౌర్య గారికి థాంక్యూ వెరీ మచ్. ఎంతో కష్టపడి, ఇష్టంతో చేసిన సినిమా ఇది. రసూల్ గారు మాకు ఎంతో సహాయం చేశారు. సినిమా విజువల్‌గా చాలా బాగుంటుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. శ్రీదేవి గారు, సముద్ర ఖని గారు, సాయికుమార్ గారు అందరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో శౌర్య గారిని ఒక డిఫరెంట్ స్టైల్‌లో చూస్తారు. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బాగుంటాయి. చిన్న గారు మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సినిమాలో చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, వాటిని ఎదుర్కొంటేనే సక్సెస్ వస్తుంది. ఇది మా ఫస్ట్ సినిమా. మరిన్ని సినిమాలు చేయబోతున్నాం. జూన్ లో మరో సినిమా మొదలుపెట్టబోతున్నాం' అని చెప్పారు. మరో నిర్మాత అశోక్ మాట్లాడుతూ, 'ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లిన మా పెద్దన్నయ్యకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. ఇది తన తొలి తెలుగు చిత్రమని హీరోయిన్ విధి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఓపీ రసూల్, నటి ప్రియా, జీ స్టూడియోస్ ప్రతినిధి గిరీశ్ తదితరులు పాల్గొన్నారు.