ఇక ఆపండయ్యా.. నా వళ్ల కావడం లేదు
ABN, Publish Date - Feb 19 , 2026 | 06:37 PM
తన కొత్త సినిమా ప్రకటన కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సింది దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాను కోరుతున్నారు. ఈ లోగా ఊహాగానాలు చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొత్త సినిమా ఎవరితో ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారిపోయింది. వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి కూడా ఓ సినిమాను రెడీ చేస్తారని, పొంగల్ స్పెషల్ గా రాబోయే సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తాడని, అందులో నాగచైతన్య కూడా కీలక పాత్ర పోషిస్తాడని ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అలా కాకుండా వెంకటేశ్‌తోనే అనిల్ రావిపూడి మరో సినిమా చేస్తాడనీ వార్తలు వచ్చాయి. బాలకృష్ణతో కూడా సినిమా ఉండే ఆస్కారం ఉందని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి జర్నలిస్టుల మీద సెటైర్ వేశారు. తాను ఏ సినిమా చేయబోతున్నాడో తనకంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కొందరు ఫిల్మ్ జర్నలిస్టులకు బాగా తెలుసని, వారి దగ్గర తాను చేయబోతున్న సినిమా కథ కూడా ఉందని అన్నారు. అయితే... ఇప్పటికీ అనిల్ రావిపూడి కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన రాని నేపథ్యంలో పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఆయన ఈ ఊహాగానాలను నమ్మవద్దని కోరారు.
తన కొత్త సినిమాకు సంబంధించిన ఏ సమాచారం అయినా తను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటిస్తానని, మీడియా మిత్రులు ఈలోగా ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని ఆయన చెప్పారు. తాను ధృవీకరించని వివరాలతో కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం తగదని హితవు పలికారు. మీడియా వారికి తన కొత్త ప్రాజెక్ట్ పై ఉన్న ఆసక్తికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని, వారి మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అనిల్ రావిపూడి చెబుతూ.. ఇక ఆపండయ్యా.. నా వళ్ల కావడం లేదు. అధికారిక ప్రకటన కోసం కొద్దిరోజులు వేచి ఉండాలని.. రిక్వెస్ట్ చేశారు.
Read Also: గద్దర్ స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ నుండి.. తప్పుకున్న రాఘవేంద్రరావు
Read Also: మా దొడ్డ బాలయ్య.. రోడ్ సైడ్ స్టాల్‌లో టీ తాగిన బాలయ్య