గద్దర్ స్పెషల్ అవార్డ్స్.. జ్యూరీ నుండి తప్పుకున్న రాఘవేంద్రరావు
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:28 PM
తెలంగాణ గద్దర్ స్పెషల్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ పదవి నుండి కె. రాఘవేంద్రరావు తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజను ప్రభుత్వం నియమించింది. మార్చి 19న తెలంగాణ ప్రభుత్వం 2025 సినీ అవార్డులను ప్రదానం చేయనుంది.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ ఛైర్మన్లలో చిన్నపాటి మార్పు చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో ఇస్తున్న సినిమా అవార్డులలోని వివిధ విభాగాలకు వివిధ జ్యూరీలను నియమించింది. అందులో 2025 సినిమా అవార్డుల ఎంపిక కోసం వేసిన కమిటీకి జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ (Manisharma) ను నియమించింది. గత రెండు వారాలుగా ఆయన నేతృత్వంలో కమిటీ సభ్యులు సినిమాలను చూస్తున్నారు. ఉత్తమ సినీ విమర్శకుడు, ఉత్తమ సినిమా గ్రంథం అవార్డుల కమిటీకి తనికెళ్ళ భరణి (Thanikella Bharani) ని జ్యూరీ ఛైర్మన్‌గా నియమించింది. ఇక బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయ్ (Kanakamedala Vijay) జ్యూరీ ఛైర్మన్‌గా ఉన్నారు.
ఇదిలా ఉంటే స్పెషల్ అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా శతాధిక చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు (K. Raghavendrarao) ను ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన ఇప్పుడు ఈ కమిటీ నుండి తప్పుకున్నారు. దాంతో ఆయన స్థానంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) ను ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ అవార్డ్స్ కమిటీలో ఛైర్మన్ కాకుండా నలుగురు సభ్యులు ఉన్నారు. వీరు ఎన్టీఆర్ జాతీయ అవార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డ్, బిఎన్ రెడ్డి అవార్డ్, బి. నాగిరెడ్డి - చక్రపాణి అవార్డ్, పైడి జయరాజ్ అవార్డ్, టి.ఎల్. కాంతారావు అవార్డ్, అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్, సి. నారాయణ రెడ్డి అవార్డులకు సినీ ప్రముఖులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.