30 ఏళ్ల సినీ ప్రయాణం.. పవర్ స్టార్‌కు అల్లు అరవింద్ అభినందనలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:24 PM

టాలీవుడ్‌లో ఒక నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. కోట్ల మంది హృదయాల్లో ‘పవర్ స్టార్’గా సుస్థిర స్థానం సంపాదించుకుని, నేడు ప్రజాసేవలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా ఆయనకు నిర్మాత అల్లు అరవింద్ అభినందనలు తెలిపారు.

Pawan Kalyan and Allu Aravind

తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)లో ఒక నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. కోట్ల మంది హృదయాల్లో ‘పవర్ స్టార్’ (Power Star)గా సుస్థిర స్థానం సంపాదించుకుని, నేడు ప్రజాసేవలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (AP Deputy CM)గా తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఆయన వెండితెరకు పరిచయమై మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా అగ్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ (Allu Aravind) మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్‌‌పై ఓ ప్రత్యేక లేఖను విడుదల చేశారు. తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి మొదలైన ఆ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఎంత అద్భుతమైన ప్రయాణం!

ఈ మైలురాయి సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అల్లు అరవింద్ రాసుకొచ్చిన నోట్‌లో.. ‘‘డియర్ శ్రీ పవన్ కళ్యాణ్.. మనం కలిసి చేసిన మొదటి సినిమా వచ్చి అప్పుడే 30 ఏళ్లు పూర్తయిందంటే నాకు ఆశ్చర్యంగా, కాస్త షాకింగ్‌గా కూడా ఉంది. ఈ ఇండస్ట్రీలో నీది ఎంతటి అద్భుతమైన, చిరస్మరణీయమైన ప్రయాణం! చిత్ర పరిశ్రమలో 30 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు’’ అని పేర్కొన్నారు.

సినిమాను మించిన సమాజ సేవ..

కేవలం సినీ విజయాలకే పరిమితం కాకుండా, సమాజం పట్ల పవన్ చూపుతున్న నిబద్ధతను అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘‘నువ్వు ఎంచుకునే ఏ మార్గంలోనైనా మరెన్నో ఏళ్లపాటు విజయాలు, సంపూర్ణ సంతృప్తి నీకు దక్కాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అన్నింటికంటే మిన్నగా.. సమాజం పట్ల నీకున్న విశాలమైన దృక్పథం, వెండితెరకు ఆవల సమాజ హితం కోసం నువ్వు చేస్తున్న సేవలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్ డియర్ కల్యాణ్.. నా ప్రేమాశీస్సులు, శుభాకాంక్షలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి’’ అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.


గీతా ఆర్ట్స్ వేదికగా మొదలైన పవర్ ప్రస్థానం!

1996లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతోనే పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మార్షల్ ఆర్ట్స్ ఫీట్లతో తొలి చిత్రంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్.. ఆ తర్వాత తన విలక్షణమైన మేనరిజమ్స్, స్టైల్, వ్యక్తిత్వంతో యూత్‌లో తిరుగులేని కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. మూడు దశాబ్దాల పాటు సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే, సమాజ హితం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి తిరుగులేని ప్రజానేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో పవన్ సినీ కెరీర్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

మూడు ప్రాజెక్ట్‌లతో మెగా హీరో షాకివ్వబోతున్నాడా..

అన్న కంటే భిన్నంగా.. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం

‘రామాయణ’ న్యూ పోస్టర్ అదిరింది.. అడ్వాన్స్ బుకింగ్స్ అప్డేట్

Updated Date - Oct 12 , 2026 | 05:24 PM