Ramba Oorvasi Menaka Trailer: భూలోకం బాయ్స్.. కరువు ప్రాంత జీవులే.. వదలరు
ABN, Publish Date - Aug 24 , 2026 | 05:54 PM
కామెడీ కింగ్ గా ఒకప్పుడు పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సీరియస్ కథాంశాలతో అలరిస్తూ వస్తున్నాడు. సినిమాలు చేస్తున్నాడు కానీ, ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు.
కామెడీ కింగ్ గా ఒకప్పుడు పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ (Allari Naresh).. గత కొన్నేళ్లుగా సీరియస్ కథాంశాలతో అలరిస్తూ వస్తున్నాడు. సినిమాలు చేస్తున్నాడు కానీ, ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక ఈ సారి మాత్రం మంచి హిట్ కొట్టాలని కామెడీ కింగ్ అల్లరి నరేష్ మళ్లీ తన సొంత జోనర్ అయిన అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఫాంటసీ వైపు అడుగులు వేశాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 65వ చిత్రం రంభ ఊర్వశి మేనక. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చంద్రమోహన్ చింతడ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా రంభ ఊర్వశి మేనక ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
చిన్నతనం నుంచి సూరి(అల్లరి నరేష్) దేవలోకం నుండి రంభ, ఊర్వశి, మేనక అనే ముగ్గురు అప్సరసలు భూమిపైకి వచ్చి తన కోరికలు తీరుస్తాడని నమ్ముతూ ఉంటాడు. ఇక రంభ, ఊర్వశి, మేనక.. దేవేంద్రుడికి తెలియకుండా సూరి కోసం దిగివస్తారు. ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు.. వారి ముగ్గురు శక్తులను కోల్పోయేలాగా చేస్తాడు. దీంతో సూరి ఆశలు ఆవిరైపోతాయి. అసలు సూరి కోసం రంభ, ఊర్వశి, మేనక ఎందుకు దిగి వచ్చారు.. ? వారు వచ్చాక ఎదురయ్యే విచిత్రమైన, హాస్యభరితమైన పరిస్థితులు ఏంటి.. ? సూరిపై దేవేంద్రుడికి ఉన్న కోపం ఏంటి.. ? అసలు సూరి కోరికలు ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుస్కోవాల్సిందే.
ట్రైలర్‌లో అల్లరి నరేష్ తన మార్క్ టైమింగ్, పంచ్ డైలాగులు, అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను సిగ్నేచర్ హావభావాలను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివర్లో.. ఓజీ సినిమాలోని వాషీ .. ఓ వాషీ డైలాగ్ ని నరేష్ తనదైన రీతిలో ఇమిటేట్ చేసి నవ్వులు పూయించాడు. పదేళ్లుగా నరేష్ కామెడీని మిస్సయిన అభిమానులకు ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తుందని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది . విజువల్ ఎఫెక్ట్స్, చైతన్ భరద్వాజ్ సంగీతం ఫాంటసీ మూడ్‌కి తగ్గట్లుగా కుదిరాయి. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.