MS Raju: 'అగధ' ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు...

ABN , Publish Date - Jul 28 , 2026 | 02:00 PM

ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో 'అగధ' చిత్రాన్ని కాశి విశాలాక్షి నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

MS Raju Agadha Movie

అజయ్ కేఆర్ సమర్పణలో కాశి విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, సిజ్జు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఆల్రెడీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. తాజాగా ‘ది ఆరిజిన్ ఆఫ్ అగధ’ అంటూ చిత్రం గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ, ‘ఇప్పటికి నేను ఎన్ని సినిమాలు నిర్మించినా, దర్శకుడిగా చేసినా సాలిడ్‌గా సిమెంట్ ఫ్లోర్ మీద నిల్చున్నట్టు ఉండదు. ప్రతీ ఫిల్మ్ ఒక కొత్త అనుభవం. ప్రతీదీ ఒక ఛాలెంజ్. నా కెరీర్‌లో ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలన్నీ కథగా, స్క్రీన్ ప్లే పరంగా నాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ ‘అగధ’కి అలాంటి ఛాలెంజ్‌లే ఎదురయ్యాయి. ఈ కథను అనుకున్నప్పుడే ఇలాంటి ఛాలెంజ్‌లు, ఇలాంటి యుద్ధం ఉంటుందని అనుకున్నాను. ఆడియెన్స్ ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో రాష్ట్రాలు తిరిగాను. ఈ మూఢ నమ్మకాలు, అలాంటి గ్రామాలు, ప్రజల్ని సందర్శించాను. ఒక ఇంటికి వెళ్లాను. అక్కడ ఒకామె దెయ్యాల్ని వదిలిస్తూ కనిపించారు. ఆ పాత్రని నేను తీసుకున్నాను. ఆ కారెక్టర్‌కి మహాదేవి అని పేరు పెట్టాను. ఈ కారెక్టర్‌కి ధీటుగానే సింహ పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాను. శ్రవణ్ రెడ్డిలో నాకు సింహ కనిపించాడు. ఇలాంటి ఓ మూవీని చేయాలంటే మంచి ప్రొడక్షన్ కావాలి. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్, కాశి విశాలాక్షి గారు నాకెంతో సపోర్ట్ చేశారు. వారి సహకారం వల్లే నేను పూర్తిగా సినిమా మీద ఫోకస్ పెట్టగలిగాను. ఉల్కా అనే పాత్రను ముంబై నుంచి వచ్చిన నటి చేశారు. జోవిక, షిజు అద్భుతంగా నటించారు. నాని కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. కథకి, స్క్రీన్ ప్లే కోసం చాలా రీసెర్చ్ చేశాం. సినిమాని ఓన్ చేసుకుని నటించే ఆర్టిస్టులు కావాలని అనుకున్నాను. నాకు అద్భుతమైన ఆర్టిస్టులు దొరికారు. చైతన్య స్క్రిప్ట్ వర్క్‌లో, అడిషనల్ స్క్రీన్ ప్లేలో సహాయం చేశాడు. నాకు వచ్చిన డ్రీమ్ ఏంటో.. ఆగస్ట్ 14న ప్రేక్షకులందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.


WhatsApp Image 2026-07-28 at 1.31.39 PM.jpeg

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ, ‘ఎంఎస్ రాజు గారు తెలుగు సినిమాకి ఓ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆయనలాంటి గొప్ప ఫిల్మ్ మేకర్‌తో పని చేస్తునాన్నని తెలియడంతో ఎంతో సంతోషించాను. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘అగధ’ జర్నీ నాకెంతో నచ్చింది. నేను కూడా ఎంతో రీసెర్చ్ చేశా. ఇలాంటి పీపుల్స్ ఎలా ఉంటారు? వారి దినచర్య ఏంటి? అన్నది కూడా తెలుసుకున్నాను. ప్రతీ సీన్ యూనిక్‌గా ఉంటుంది. గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి’ అని అన్నారు. శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, ‘రాజు గారితో నేను చేసిన ‘డర్టీ హరి’తో పోల్చితే ఇదొక కొత్త అనుభవం. ఇందులో నా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎన్నో లేయర్స్ ఉంటాయి. డిఫరెంట్ లొకేషన్లలో షూట్ చేశాం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చిత్రీకరణ చేశాం. ఇదొక ఆఫ్ బీట్ సినిమా’ అని అన్నారు. నిర్మాత కాశి విశాలాక్షి బలుసు మాట్లాడుతూ, 'రాజు గారిలా గొప్ప చిత్రాల్ని నిర్మించాలని అనుకున్నాం. ఆయన మాకు కథ చెప్పినప్పటి కంటే.. ఫస్ట్ కాపీ చూసినప్పుడు పదింతలు ఆశ్చర్యపోయాను. సినిమా అద్భుతంగా వచ్చింది. విజయం అనేది కేవలం అదృష్టం వల్లే వరించదు. కష్టపడే తత్వం, సహనం వల్లే విజయాలు చేకూరుతాయి. ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు అని రాజు గారితో చెబుతూనే ఉండేవాళ్లం’ అని అన్నారు.

WhatsApp Image 2026-07-28 at 1.31.38 PM.jpeg

ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, కెమెరామెన్ నాని చమిడిశెట్టి, ఎడిటర్ జునైద్ సిద్దిఖీ, చైతన్య వేగి, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ తదితరులు ఈ సినిమా విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

బాక్సాఫీస్ బరిలో.. రెండు కుటుంబాలు.. నలుగురు హీరోలు! విజ‌యం.. ఎవ‌రికి ద‌క్కేనో

ఎన్టీఆర్ భుజానికి గాయం... ఎనిమిది వారాల విశ్రాంతి!

Updated Date - Jul 28 , 2026 | 02:06 PM