Niharika Konidela: బంగారు బోనమెత్తిన నిహారిక.. కోరిక తీరిందంటూ..
ABN, Publish Date - Aug 08 , 2026 | 08:53 AM
హైదరాబాద్‌లో బోనాల సందడి అంబరాన్ని తాకుతోంది. నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న వేళ సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో బోనాల సందడి అంబరాన్ని తాకుతోంది. నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నవేళ సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీలోని మీరాలం మండిలో ఉన్న శ్రీ మహంకాళేశ్వర దేవాలయానికి వెళ్లిన ఆమె.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిహారిక ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకున్న నిహారిక ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య.. శ్రీ మహంకాళేశ్వర ఆలయ చరిత్ర, విశిష్టతతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల సంప్రదాయాలు, ప్రత్యేకతలను నిహారికకు వివరించారు. గత ఏడాది ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి రెండు విభాగాల్లో జాతీయ పురస్కారం దక్కినందుకు ఆమె మొక్కు చెల్లించినట్లు అభిమానులు భావిస్తున్నారు.
ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు
నిహారిక మాట్లాడుతూ 'ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయాను, అందుకే అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేకంగా వచ్చాను. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి బోనాల సమయంలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు నన్ను ఎంతగానో ఆకట్టుకునేవి. కొద్ది రోజుల క్రితమే.. నన్ను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుండేది అని సరదాగా అనుకున్నాను. ఇంత త్వరగా ఆ కోరిక నెరవేరడం అమ్మవారి అనుగ్రహంగానే భావిస్తున్నాను. అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత. తల్లి దర్శనం ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. అమ్మవారి విగ్రహం దివ్య కాంతులతో అలరించింది. మరోసారి కూడా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను’ అని నిహారిక పేర్కొన్నారు.
పోటీపడ్డ భక్తులు..
నిహారిక కొణిదెల ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపారు. పలువురు అభిమానులు, భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో ఆలయ పరిసరాలు కొద్దిసేపు సందడిగా మారాయి.
ALSO READ:
Yash: యశ్ హీరోగా.. నిర్మాతగా.. ఇప్పుడు ఇంకోలా..
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’.. క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అయినట్టేనా?