Vishwaksen: ఆ ఇద్దరికీ లిట్మస్ టెస్టేనా...

ABN , Publish Date - Jan 27 , 2026 | 05:30 PM

విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న 'ఫంకీ' మూవీ ఫిబ్రవరి 13న వస్తోంది. అదే రోజు రావాల్సిన 'స్వయంభూ' సినిమా వాయిదా పడటం 'ఫంకీ'కి కలిసొస్తుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

Funky Movie

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కామెడీ చిత్రాల దర్శకుడు అనుదీప్ ఇద్దరి కెరీర్ ఇప్పుడు డౌన్ ఫాల్ లో ఉంది. విశ్వక్ సేన్ ఈ మధ్య కాలంలో నటించిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. పైగా అతనికి యాటిట్యూడ్ అనే ముద్ర కూడా పడిపోయింది. నిజానికి విశ్వక్ సేన్ డౌన్ టు ఎర్త్ ఉండే నటుడు. కానీ కొన్ని వేదికలపై మనసులోని మాటను ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా బయటకు చెప్పేస్తుంటాడు. అది అతన్ని సమస్యల్లోకి నెట్టేస్తుంటుంది. గత యేడాది అతను నటించిన 'లైలా' మూవీ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఖంగుతిన్న విశ్వక్ ఇకపై ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండే మూవీస్ తాను చేయనని, ఈ సినిమా చేసి చాలా తప్పు చేశానని అంగీకరించాడు. ఆ తర్వాత అతను నటిస్తున్న సినిమా 'ఫంకీ'నే కావడంతో అందరూ దీనిపై దృష్టి పెట్టారు.

అనుదీప్ కె.వి. 'పిట్టగోడ'తో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత అతను తెరకెక్కించిన 'జాతిరత్నాలు' మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కానీ దాని తర్వాత శివ కార్తికేయన్ తో తీసిన 'ప్రిన్స్' మూవీ పరాజయం పాలైంది. దాంతో ఇప్పుడు 'ఫంకీ' సినిమా అనుదీప్ కు లిట్మస్ టెస్ట్ గా మారిపోయింది. ఈ మూవీ ఫలితంపై అతని కెరీర్ ఆధారపడినట్టు అయ్యింది. చాలా ముందుగానే 'ఫంకీ' సినిమాను ఫిబ్రవరి 13న విడుదల చేస్తున్నట్టు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.


నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ' సైతం ఫిబ్రవరి 13న విడుదల అవుతున్నట్టు దాని దర్శక నిర్మాతలు గతంలోనే ప్రకటించారు. కానీ ఇటీవల ఈ సినిమాను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేస్తున్నామని వారు తెలిపారు. సో... ఇప్పుడు వాలెంటైన్స్ డే బరి నుండి 'స్వయంభూ' తప్పుకున్నట్టు అయ్యింది. ఫిబ్రవరి 13వ తేదీ 'నిలవే' మూవీతో పాటు, విజయ్ ఆంటోని నిర్మిస్తున్న 'బూకీ' తెలుగులో రాబోతోంది. అలానే 14వ తేదీ అర్జున్ సర్జా డైరెక్ట్ చేసిన 'సీతాపయనం'తో పాటు సంతోష్‌ శోభన్ హీరోగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' విడుదల కాబోతోంది. ఇక వాలెంటైన్స్ డే కానుకగా వస్తున్న వాటిల్లో క్రేజీ ప్రాజెక్ట్ అంటే విశ్వక్ సేన్, అనుదీప్ చేస్తున్న 'ఫంకీ' నే! మరి ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Updated Date - Jan 27 , 2026 | 05:30 PM