హిమాచల్ గవర్నర్‌తో మంచు మనోజ్ భేటీ.. ఢిల్లీలో సంచలనం
ABN, Publish Date - Sep 11 , 2026 | 10:04 PM
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj), ఆయన సతీమణి మౌనిక భూమా మంచు వ్యాపార రంగంలో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj), ఆయన సతీమణి మౌనిక భూమా మంచు వ్యాపార రంగంలో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టనున్నారు. తమ వ్యాపార పరిధిని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూఢిల్లీలోని హిమాచల్ సదన్‌లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కవిందర్ గుప్తాను వీరు మర్యాదపూర్వకంగా కలిశారు. వినోద రంగంతో పాటు ఇతర కీలక రంగాల్లో వ్యాపారావకాశాలను అన్వేషించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
ఈ ప్రత్యేక భేటీలో ప్రధానంగా చలనచిత్ర రంగానికి సంబంధించిన అంశాలతో పాటు స్పోర్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై గవర్నర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికే పరిమితం కాకుండా క్రీడా విభాగానికి సంబంధించిన మౌలిక సౌకర్యాల కల్పన, భారీ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఈ జంట ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భేటీకి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
మరోవైపు, నటుడిగా మంచు మనోజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకునే మనోజ్.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో కలిసి దాదా సినిమాలో నటిస్తూనే, డేవిడ్ రెడ్డి, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షక్ సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇవే కాకుండా ఈమధ్యనే 'వడ్డీకాసులవాడ' వంటి క్రేజీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.
ఒకే సమయంలో నటుడిగా క్రేజీ చిత్రాలలో బిజీగా ఉంటూనే, మరోవైపు మౌనికతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, ఇన్‌ఫ్రా రంగాల్లోకి ప్రవేశించేలా ప్రణాళికలు రచిస్తుండటంతో మంచు మనోజ్ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.