35: చిన్న కథ కాదు స్క్రీన్ ప్లే బుక్ విడుదల!
ABN , Publish Date - Jul 24 , 2026 | 03:45 PM
రెండు జాతీయ అవార్డులకు ఎంపికైన '35: చిన్న కథ కాదు' సినిమా స్క్రీన్ ప్లే పుస్తక రూపంలో వచ్చింది. దర్శకుడు నందకిశోర్ ఈమాని దీనిని రాశారు.
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రలు పోషించిన '35: చిన్న కథ కాదు' చిత్రానికి ఇటీవల జాతీయ సినీ అవార్డులలో రెండు పురస్కారాలు లభించాయి. ఈ చిత్రం 'ఉత్తమ బాలల చిత్రం'గా ఎంపిక కాగా, ఇందులో ప్రధాన పాత్ర పోషించిన అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడిగా ఎంపికయ్యాడు. నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. దర్శకుడు నందకిశోర్ ఈమాని ఈ సినిమా స్క్రీన్ ప్లే ను పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ప్రచురణ కర్తలు ఈ పుస్తకం గురించి వివరిస్తూ, 'కథ అంటే కేవలం కల్పన కాదు. మన కళ్ళ ముందు జరిగే జీవితమే అని నిరూపించిన స్క్రీన్ ప్లే '35 - చిన్న కథ కాదు'. రెండు జాతీయ అవార్డులు పొందిన ఈ స్క్రీన్ ప్లేను తెలుగులో ఒక ఆణిముత్యంలా ఎప్పటికీ పదిలంగా దాచుకోవాలి. ఇందులో అనవసరమైన ఆర్భాటాలు ఉండవు; ఎంతో సహజంగా, మన పక్కింట్లో జరిగే కథలా అనిపిస్తుంది. చదువుల పేరుతో ప్రతి ఇంట్లో పిల్లల మీద పడే ఒత్తిడిని, కొడుకు గెలుపు కోసం ఒక తల్లి పడే ఆరాటాన్ని ఇందులో ఎంతో అందంగా రాశారు నందకిశోర్ ఈమని. కేవలం '35' పాస్ మార్కుల చుట్టూ ఇంతటి సున్నితమైన కథను అల్లడం రచయిత గొప్పతనం. మార్కుల కన్నా పిల్లల మనసు, వారి ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యమని మనసుకు హత్తుకునేలా చెప్పిన ఈ స్వచ్ఛమైన రచన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఎటువంటి హంగులు లేకుండా హృదయాలను గెలుచుకునే ఇలాంటి కథ, రాబోయే రోజుల్లో కొత్తగా కథలు రాసే వాళ్లకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. తెలుగు సినిమా భవిష్యత్తు కోసం ఇలాంటి కథను భద్రపరుచుకోవడం ఎంతైనా అవసరం' అని తెలిపారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు, రచయిత నందకిశోర్ మాట్లాడుతూ, '2018లో '35 - చిన్న కథ కాదు' ఒక ఆలోచనతో మొదలైంది. 2026కి ఇక్కడివరకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పడిన కష్టం, దాన్ని దాటుకుని వచ్చిన అనుభవం... కాలం గడిచే కొద్దీ మధుర జ్ఞాపకంగా మారుతుంది. ఇక్కడివరకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేషనల్ అవార్డ్ జ్యూరీకి, భారత ప్రభుత్వానికి సవినయంగా నమస్కరిస్తున్నాను. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను పుస్తకంగా ప్రచురించడం కూడా చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.
హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ, 'రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నారు అంటే, '35 - చిన్న కథ కాదు' చేసిన మ్యాజిక్ అది. నందకిశోర్ ఆలోచనతో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు ఢిల్లీ వరకు వెళ్లింది. అది నిజంగా చిన్న కథ కాదు. సినిమాలో ప్రసాద్ పాత్రలో నేను చెప్పిన 'చిన్న కథ కాదు' అనే ఊతపదం ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగుతుండటం కూడా చిన్న విషయం కాదు. సృజన, సిద్ధార్థ్ చాలా వైవిధ్యమైన నిర్మాతలు. ఇలాంటి సినిమాను ముందుగా నమ్మాలంటే చాలా ధైర్యం కావాలి. దర్శకుడిని, నన్ను ప్రసాద్ పాత్రలో నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. ఇన్ని ప్రశంసలు అందుకోవడం నిజంగా చిన్న కథ కాదు. ప్రేక్షకులు చూపించిన ప్రేమే ఈరోజు మాకు జాతీయ అవార్డు రూపంలో వచ్చింది. నటుడిగా ఈ సినిమా నాకు ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చింది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సజీవ్, విద్యాధర్, శశాంక్, అనురాగ్, మల్లిక్ రామ్, వినోద్‌తో పాటు ఉత్తమ బాలనటుడు అవార్డుకు ఎంపికైన అరుణ్ దేవ్ కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
రాజమౌళికి దక్కింది.. మరి సందీప్ వంగాకి ఎప్పుడు?
‘రా ఎన్టీఆర్’ క్లోజ్ చేస్తున్నాం.. అందరి అనుమానాలివే
Jana Nayakudu: విజయ్ జన నాయకుడు రివ్యూ