Kshemanga Velli Labhamga Randi: ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి’ కి 25 ఏళ్ళు

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:01 PM

'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' 2000 ఫిబ్రవరి 4న విడుదలైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్. రాజా వన్నెంరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎడిటర్ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది.

రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి’ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, రుక్మిణి, కోవై సరళ మూడు ప్రధాన జంటలుగా నటించగా, ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ మరో జంటగా నటించారు. అప్పట్లో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారం అయితే... ఇంటిల్లిపాది కూర్చుని చూసి ఆనందిస్తుంటారు.

WhatsApp Image 2026-02-04 at 1.16.11 PM.jpeg


కథ విషయానికి వస్తే... ఒకే కంపెనీలు పనిచేస్తున్న ముగ్గురు మిత్రులు సృష్టించిన కామెడీ వండరే ఈ చిత్రం. రవి, రాంబాబు, జంబులింగం పక్క పక్క ఇళ్ళలో ఉంటూ ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తుంటారు. వీళ్ళకు వచ్చిన జీతంలో సగానికి పైగా జల్సాలకు ఖర్చు చేస్తూ, కుటుంబ ఖర్చుల గురించి పెద్దగా పట్టించుకోరు. వారి భార్యలు గీత, జానకి, సుబ్బలక్ష్మి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ, కుటుంబ అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో వారి పక్కింట్లో దిగిన జంట ఎంతో అనోన్యంగా ఆదర్శంగా జీవిస్తుంటారు. భార్య భర్త ఇద్దరు సమానమే అన్నట్లు గా జీవించడంతో పాటు ఆడవారు అవసరం అయితే ఉద్యోగం చేయాలని చెబుతారు. పక్క పక్క పోర్షన్స్ లో జరిగే ఎమోనల్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ఓ వైపు ఎమోషన్, మరోవైపు కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టించాయి. వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి మరింత దోహదపడింది.

WhatsApp Image 2026-02-04 at 1.16.10 PM (3).jpeg


ఇదిలా ఉంటే 'బావ-బావమరిది','శుభమస్తు', 'ఏమండీ... పెళ్లి చేసుకోండి', 'హిట్లర్', 'మనసిచ్చిచూడు' సినిమాలకు తన సంస్థలో దర్శకత్వ శాఖలో పనిచేసిన రాజా వన్నెంరెడ్డిని ఈ మూవీతో దర్శకుడిగా చేశారు నిర్మాత ఎడిటర్ మోహన్. ఈ సినిమా పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ఎడిటర్ మోహన్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేశారు. తన మొదటి గురువు అనిల్ కుమార్... సీనియర్ దర్శకుడు శరత్ కు తనను పరిచయం చేస్తే, ఆయన 'బావ-బావమరిది' సినిమాకు కో-డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఇచ్చార'ని రాజా వన్నెంరెడ్డి గుర్తు చేసుకున్నారు. అలా నిర్మాత ఎడిటర్ మోహన్ కు దగ్గరైన తనకు 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' మూవీకి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కిందని అన్నారు. ఈ సినిమా విజయంలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు రాజా వన్నెంరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా తర్వాత రాజా వన్నెంరెడ్డి 'అక్కా బావెక్కడ?', 'మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు?', 'ఆదివారం ఆడవాళ్ళకు సెలవు', 'మా ఆయన చంటిపిల్లాడు', 'టామీ' వంటి చిత్రాలను రూపొందించారు.

WhatsApp Image 2026-02-04 at 1.16.10 PM (2).jpeg

Read Also: Rajamouli: ఆయనతో నన్ను పోల్చకండి.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్

Read Also: Lavanya Konidela: మెగాస్టార్ పై విమర్శలు.. ఇచ్చిపడేసిన మెగా కోడలు

Updated Date - Feb 04 , 2026 | 06:50 PM