Tollywood: జనం ముందుకు పది సినిమాలు
ABN, Publish Date - May 07 , 2026 | 01:47 PM
ఈ శుక్రవారం పది సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. సతీ లీలావతి, హరుడు, రేజర్, గోదారి గట్టుపైన, ఎం4ఎం అందులో చెప్పుకోదగ్గవి.
గత వారం మూడు స్ట్రయిట్, ఒక డబ్బింగ్ సినిమా విడుదల కాగా ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతున్న సినిమాల సంఖ్య పదికి చేరింది. ఈ శుక్రవారం చిన్నా చితక సినిమాలతో పాటు నాలుగు అనువాద చిత్రాలు వస్తున్నాయి. అయితే కథానుగుణంగా చూసినప్పుడు అవన్నీ విభిన్నమైన చిత్రాలే కావడం విశేషం. లావణ్య త్రిపాఠి కథానాయికగా తెరకెక్కిన 'సతీ లీలావతి' (Sathi Leelavathi) పలుమార్లు వాయిదా పడి మే 8న రిలీజ్ అవుతోంది. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దేవ్ మోహన్ (Dev Mohan) హీరోగా నటిస్తున్నాడు. సప్తగిరి ఓ కీలక పాత్ర పోషించాడు. 'మేమ్ ఫేమస్' చిత్రంతో హీరోగా పరిచయం అయిన సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) ఇప్పుడు రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' (Godari Gattu Paina) తో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. నిధి ప్రదీప్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. సుభాష్ చంద్ర దీనికి దర్శకత్వం వహించారు.
ఇక మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'ఎం4ఎం' (M4M). అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ఇందులో కీలక పాత్రను పోషించి, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ చిత్రం తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. సంబీత్ ఆచార్య ఇందులో హీరోగా నటించాడు. ప్రముఖ నట, దర్శకుడు రవిబాబు (Ravibabu) తెరకెక్కించిన చిత్రం 'రేజర్'. సురేశ్ బాబుతో కలిసి రవిబాబు ఈ సినిమాను నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా 'రేజర్' రూపుదిద్దుకుంది. ఇందులో రవిబాబు ఓ కీలక పాత్రను పోషించాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకట్ (Venkat) ఇప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అయితే అవకాశం వచ్చినప్పుడు హీరోగా నటించడానికీ వెనుకాడటం లేదు. అలా అతను హీరోగా నటించిన 'హరుడు' సినిమా ఈ శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. అలానే మరో చిన్న సినిమా 'విధి గీసిన విచిత్రం' కూడా మే 8న విడుదల అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ వీకెండ్‌లో రిషబ్ శెట్టి కన్నడ డబ్బింగ్ మూవీ 'ఏ ఫిల్మ్ బై గిరి', హిందీ అనువాద చిత్రం 'శ్రీకృష్ణావతారం -1' జనం ముందుకు వస్తున్నాయి. ఇక ఆంగ్లం నుండి 'మోర్టల్ కంబట్ 2', 'సూపర్ హీరోస్' సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అవుతున్నాయి. ఇవి కాకుండా ఈ శుక్రవారం ఏకంగా మూడు పాత సినిమాలు రీ-రిలీజ్ కాబోతున్నాయి. రవితేజ నటించిన 'కృష్ణ', నాని సినిమా 'నిన్ను కోరి', తమిళ హీరో శింబు నటించిన 'వల్లభ' చిత్రాలు శుక్రవారం జనాన్ని అలరించబోతున్నాయి. మరి వీటిలో ఏ యే సినిమాలను జనాలను ఆదరిస్తారో చూడాలి.