Veerabhadrudu: తమ్ముడి సినిమా నష్టాన్ని భర్తీ చేసిన సూర్య!
ABN, Publish Date - May 18 , 2026 | 02:34 PM
గతంలో కార్తీ 'సర్దార్'ను తెలుగులో పంపిణీ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తాజాగా సూర్య 'వీరభద్రుడు' మూవీని విడుదల చేసింది. 'సర్దార్'కు వచ్చిన నష్టాలను 'వీరభద్రుడు' తీర్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సైతం కొంతకాలంగా సినిమాలను పంపిణీ చేస్తోంది. ఏషియన్ సునీల్, దిల్ రాజు, గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ స్థాయిలో కాకుండా పంపిణీ రంగంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఎదురు దెబ్బలు తగలడం సహజమే. అన్నపూర్ణ కూడా అందుకు మినహాయింపు కాదు.
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా 2022 దీపావళి కానుకగా విడుదలైంది. భారీ ప్రచారంతో వచ్చిన ఈ సినిమాలో కార్తీ ద్విపాత్రాభినయం చేశాడు. చిత్రం ఏమంటే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా కమర్షియల్‌గా మాత్రం తెలుగులో వర్కౌట్ కాలేదు. నిజానికి కార్తీ సినిమాలు చాలా సందర్భాలలో తమిళంలో ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నా... తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసుకుంటాయి. ఆ నమ్మకంతోనే అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా పంపిణీకి పది కోట్లతో అగ్రిమెంట్ చేసుకుందట. కానీ కేవలం మూడు కోట్లు మాత్రమే వసూలు కావడంతో దాదాపు ఏడు కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తాజాగా కార్తీ అన్నయ్య సూర్య నటించిన 'కరుప్పు' సినిమా విడుదలైంది. దీనిని తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో డబ్ చేశారు. ఆర్. జె. బాలాజీ దర్శకత్వం వహించిన ఆ ఫాంటసీ కోర్టు డ్రామా రిలీజ్‌కు ముందు కష్టాలు ఎదురయ్యాయి. సూర్య దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సినిమా బయటపడేలా చేశారు. సూర్య చొరవ చూపి, ఈ మూవీ తెలుగు పంపిణీ హక్కులను గతంలో 'సర్దార్' కారణంగా నష్టపోయిన అన్నపూర్ణ స్టూడియోస్‌కే ఉచితంగా ఇచ్చారట. 'వీరభద్రుడు' సినిమాకు గొప్ప టాక్ రాకపోయినా... మూవీ ఓపెనింగ్స్ మాత్రం బాగున్నాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో తమిళంలో ఈ స్థాయి పెద్ద సినిమా ఏదీ విడుదల కాకపోవడంతో జనం 'కరుప్పు'ను ఎగబడి చూస్తున్నారని తెలుస్తోంది. విడుదలైన దగ్గర నుండి ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ రూ. 140 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చెబుతున్నారు. అందులో పది కోట్ల గ్రాస్ తెలుగులోనూ వసూలు అయ్యిందట. దీంతో అప్పటి 'సర్దార్' లాస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ 'వీరభద్రుడు'లో కవర్ చేసుకుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. మొత్తానికి తమ్ముడు కార్తీ సినిమాతో వచ్చిన నష్టాన్ని సూర్య తన సినిమాతో భర్తీ చేశాడని చెబుతున్నారు. మరి ఈ విజయంతో అన్నపూర్ణ స్టూడియోస్ మరిన్ని చిత్రాలను పంపిణీ చేస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: జయం రవికి భార్య ఆర్తి కౌంటర్!
కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. ‘పెద్ది’ ట్రైలర్‌పై నాగవంశీ
మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!
Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!