సీఎం విజయ్ పై విజయ్ సేతుపతి సంచలన వ్యాఖ్యలు.. అంత మాట అన్నాడేంటి
ABN, Publish Date - Sep 15 , 2026 | 07:19 PM
బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన బిగ్ బాస్ తమిళ్ రియాలిటీ షో వేదికగా హోస్ట్, నటుడు విజయ్ సేతుపతి చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి.
బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన బిగ్ బాస్ (Bigg Boss) తమిళ్ రియాలిటీ షో వేదికగా హోస్ట్, నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. షోలో ఒక కంటెస్టెంట్‌కు నాయకత్వ లక్షణాల గురించి క్లాస్ పీకే క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. నాయకత్వం అంటే సాధ్యంకాని హామీలు ఇవ్వడం, సమస్యలు రాగానే ఎదుటివారిపై నెట్టేసి పారిపోవడం కాదని ఆయన వ్యాఖ్యానించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం విజయ్ ని పట్టుకొని అంత మాట అంటాడాఅంటూ దళపతి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇక ఈ వ్యాఖ్యలు నేరుగా రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన విమర్శలేనంటూ విజయ్ మద్దతుదారులు, టీవీకే వర్గాలు మండిపడ్డాయి. సేతుపతి కేవలం పొలిటికల్ అజెండాతోనే ఈ కామెంట్స్ చేశాడంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటం, విమర్శలు పీక్స్‌కు చేరడంతో విజయ్ టీవీ వెంటనే రంగంలోకి దిగక తప్పలేదు.
గత రెండు రోజులుగా ఏర్పడిన ఈ గందరగోళానికి చెక్ పెడుతూ విజయ్ టీవీ యజమాన్యం అధికారికంగా ఒక స్పష్టతనిచ్చింది. బిగ్ బాస్ అనేది పూర్తిగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ మాత్రమేనని, అందులో హోస్ట్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఆ హౌస్‌లోని పరిస్థితులు, కంటెస్టెంట్ల టాస్క్‌లకు మాత్రమే పరిమితమైనవని స్పష్టం చేసింది. షోలో మాట్లాడే ఏ విషయాన్ని బయట ఉన్న వ్యక్తులతో, రాజకీయ పార్టీలతో లేదా సిద్ధాంతాలతో ముడిపెట్టి చూడకూడదని ఛానెల్ తేల్చిచెప్పింది. ఎవరినీ మద్దతు ఇవ్వడం లేదా విమర్శించడం తమ షో ఉద్దేశం కాదని వెల్లడించింది.
హోస్ట్ విజయ్ సేతుపతి హౌస్‌లో ఒక సిచ్యువేషన్ బేస్డ్ అంశంపై స్పందించారని, దానికి పొలిటికల్ రంగు పులిమి వివాదం చేయడం సరికాదని నెటిజన్స్ కూడా చెప్పుకొస్తున్నారు. విజయ్ టీవీ ఇచ్చిన వివరణతో ఈ నెట్టింటి వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండటానికి షో యాజమాన్యం మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని టాక్. ఇక విజయ్ - విజయ్ సేతుపతి కలిసి మాస్టర్ సినిమాలో నటించారు.