ఇంటర్నేషనల్ ఎమ్మీ వేదికపై విజయ్ సేతుపతి..
ABN, Publish Date - Nov 24 , 2026 | 03:24 PM
అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా ప్రతిష్టను మరోసారి ఘనంగా చాటాడు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. న్యూయార్క్‌లోని హిల్టన్ మిడ్‌టౌన్‌లో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో ఆయన ప్రజెంటర్‌గా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు..
అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా ప్రతిష్టను మరోసారి ఘనంగా చాటాడు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). న్యూయార్క్‌లోని హిల్టన్ మిడ్‌టౌన్‌లో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ (54th International Emmy Awards) వేడుకలో ఆయన ప్రజెంటర్‌గా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మైఖేల్ యూరీ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులతో కలిసి విజయ్ సేతుపతి వేదికను పంచుకున్నాడు .ఇక విజయ్ సేతుపతి ఇంటర్నేషనల్ ఎమ్మీస్‌లో అవార్డు ప్రదానం చేసిన తొలి భారతీయుడిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, గతంలో ఆష్కా గోరాడియా (2009), సిమోన్ సింగ్ (2010), ప్రేరణ వాన్వారీ వంటి భారతీయ నటీమణులు కూడా ఈ వేదికపై ప్రజెంటర్లుగా వ్యవహరించారు.
ఇంకోపక్క ఈ వేడుక రెడ్ కార్పెట్‌పై విజయ్ సేతుపతి లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. బంగారు రంగు ఎంబ్రాయిడరీ డిటైలింగ్‌తో కూడిన క్లాసిక్ బ్లాక్ సూట్, మెరిసే నల్లని షూస్, నీట్‌గా సైడ్-పార్ట్ చేసిన హెయిర్‌స్టైల్‌తో ఆయన ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. ఆయనతో పాటు ఆయన కుమారుడు సూర్య విజయ్ సేతుపతికూడా ఈ వేడుకలోసందడి చేశాడు. మహారాజా చిత్రంతో దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన విజయ్ సేతుపతి, ఇంటర్నేషనల్ ఎమ్మీస్ వేదికపై కనిపించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
ఒకవైపు తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో, మరోవైపు అంతర్జాతీయ వేదికపై భారతీయ నటుడి ఉనికిని చాటుతూ విజయ్ సేతుపతి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో భారత్ నుంచి వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ వంటి ప్రాజెక్టులు నామినేట్ కాగా, ప్రజెంటర్‌గా విజయ్ సేతుపతి చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈమధ్యనే బత్తా సినిమాతో హిట్ అందుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఇంజి వెల్లం సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి ఈ చిత్రంతో ఈ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.