హాలీవుడ్ రీమేక్.. ఫ్రీగా చేస్తానన్న స్టార్ హీరో
ABN, Publish Date - Sep 20 , 2026 | 08:13 PM
తమిళ చిత్రసీమ నుంచి వచ్చి పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అరుదైన చిత్రాల్లో మహారాజ ఒకటి. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన ఈ రివెంజ్ థ్రిల్లర్, థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ సరికొత్త రికార్డులను సృష్టించింది.
తమిళ చిత్రసీమ నుంచి వచ్చి పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అరుదైన చిత్రాల్లో మహారాజ (Maharaja) ఒకటి. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కథానాయకుడిగా నటించిన ఈ రివెంజ్ థ్రిల్లర్, థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక సాధారణ కథను అసాధారణమైన స్క్రీన్ ప్లేతో చెప్పి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఒక అరుదైన మైలురాయిని దాటింది.
మహారాజ చిత్రం హాలీవుడ్‌లో రీమేక్ కాబోతున్న విషయం తెల్సిందే. ఈ ప్రతిష్టాత్మక హాలీవుడ్ వెర్షన్‌లో ఆస్కార్ విజేత, ప్రముఖ నటుడు మాథ్యూ మెక్‌కెనగీ (Matthew McConaughey) ప్రధాన పాత్రలో నటించనుండటం విశేషం. ఈ విషయాన్ని సినిమా నిర్మాత సుధన్‌తో పాటు విజయ్ సేతుపతి కూడా అధికారికంగా స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు.
ఇక ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. తన సినిమా హాలీవుడ్‌లో రీమేక్ అవ్వడం ఎంతో గర్వకారణమని.. తనకు ఎప్పటి నుంచో హాలీవుడ్ లో నటించాలని కోరిక ఉండేదని తెలిపాడు. ఈ హాలీవుడ్ రీమేక్ లో తనకు హీరోగా కాకపోయినా ఏదైనా ఒక చిన్న పాత్ర ఇచ్చినా చేస్తానని, దానికి పారితోషికం కూడా తీసుకొనని చెప్పుకొచ్చాడు. దీనితో పాటు మహారాజ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతోందని కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు. నిథిలన్ స్వామినాథన్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మరోసారి ఆయనతో పనిచేయాలని ఉందని తెలిపాడు. ఇక మహారాజ సీక్వెల్ ని విజయ్ సేతుపతి ప్రకటించడంతో ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మొదటి పార్ట్ మించి రెండోపార్ట్ లో ఊచకోత ఖాయమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.