‘RC17’ మ్యూజిక్ డైరెక్టర్.. అనిరుధ్ కూడా కాదా!

ABN , Publish Date - Sep 18 , 2026 | 09:39 PM

సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్, వైబ్ వేరుగా ఉంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తోందంటే చాలు.. థియేటర్ల దగ్గర రచ్చ మామూలుగా ఉండదు. అలాంటి మైండ్ బ్లోయింగ్ కలయికే సుక్కు, చరణ్.

RC17 Music Director Update

సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్, వైబ్ వేరుగా ఉంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తోందంటే చాలు.. థియేటర్ల దగ్గర రచ్చ మామూలుగా ఉండదు. అలాంటి మైండ్ బ్లోయింగ్ కలయికే.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan). గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించిందో, ఎలాంటి రికార్డులను తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘RC17’ ప్రాజెక్ట్ కోసం మెగా అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే, ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త ఎక్కువగా వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం లేదట.

సుకుమార్ సినిమా అంటే అక్కడ డీఎస్పీ ఉండాల్సిందే.. అది ఒక అన్‌రిటెన్ రూల్. సుకుమార్ మొదటి సినిమా ‘ఆర్య’ నుంచి నిన్నటి ‘పుష్ప-2’ వరకు ప్రతీ సినిమాకి దేవిశ్రీనే సంగీతం అందించారు. సుకుమార్ విజన్‌కి తగ్గట్టుగా డీఎస్పీ ఇచ్చే ఆల్బమ్స్, సీన్లను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతటి కీలక పాత్ర పోషించాయో తెలియంది కాదు. వీరిది తిరుగులేని సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అందుకే చరణ్ ‘RC17’కి కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తారని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూస్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.


అయితే, డీఎస్పీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ బిజీ షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా ఉన్నారు. ఒకవైపు ‘బలగం’ ఫేమ్ వేణు యల్దండి దర్శకత్వంలో వస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంతో డీఎస్పీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తూ, నటుడిగా శరవేగంగా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు అక్కినేని నాగార్జున మైల్‌స్టోన్ మూవీ ‘కింగ్ 100’కి కూడా డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్. ఇలా వరుస ప్రాజెక్ట్‌లు, హీరోగా కొత్త బాధ్యతల వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతోనే RC17 నుంచి దేవి వైదొలిగినట్లు తెలుస్తోంది.


ఇక RC17కి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరుతో పాటు మరికొందరి పేర్లు వినిపించినప్పటికీ.. ఇప్పుడు రేసులో అందరికంటే ముందున్నారు ‘ధురంధర్’ ఫేమ్ శాశ్వత్ సచ్‌దేవ్ (Shashwat Sachdev). శాశ్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్‌కు ఆకర్షితుడైన సుకుమార్, ప్రస్తుతం ఆయనతో చివరి దశ చర్చలు జరుపుతున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్‌ని పక్కాగా లాక్ చేసి, నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారట. అటు ఈ చిత్రాన్ని రాబోయే దసరా కానుకగా అత్యంత ఘనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, క్యారెక్టరైజేషన్ ఎవరూ ఊహించని విధంగా, ఒక సరికొత్త మేకోవర్‌తో ఉండబోతోందట. మరి ‘రంగస్థలం’తో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ కొట్టిన సుకుమార్ - రామ్ చరణ్ కాంబో, ఈ కొత్త మ్యూజిక్ కాంబినేషన్‌తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Sigma Trailer: ‘సిగ్మా’ ట్రైలర్.. విజయ్ కొడుకు హిట్టుకొట్టేలానే ఉన్నాడే!

డూప్ లేకుండా.. శోభిత ధూళిపాళ్ల డెడికేషన్‌కు పా. రంజిత్ ఫిదా

ఆస్కార్ రేసులో చరణ్ ‘పెద్ది’కి మిస్సైన ఛాన్స్.. ఫైనల్‌గా ఆ చిత్రం ఎంపిక!

Updated Date - Sep 18 , 2026 | 09:39 PM