సీఎం విజయ్ పాలనపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ పోస్ట్..
ABN, Publish Date - Jul 16 , 2026 | 06:42 PM
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) జోసెఫ్ విజయ్ (C Joseph Vijay)పై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. తాజాగా తన భర్తతో కలిసి విజయ్‌ను కలిసిన ఆమె, ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ పోస్ట్ గురించి ఏం చెప్పాలా అని చాలా ఆలోచించాను, కానీ ఇప్పటికే ఆయన గురించి చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. అందుకే ఇప్పుడు నేను ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. జనాలు వంద రకాలుగా వంద మాటలు మాట్లాడుకోవచ్చు. కానీ, చివరికి వచ్చేసరికి జోసెఫ్ విజయ్ మన ముఖ్యమంత్రి. ఆయన ఇక్కడే ఉంటారు, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు’’ అంటూ వరలక్ష్మి తన ట్వీట్‌లో విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని, ఆయనకున్న ప్రజాదరణను గట్టిగా సమర్థించారు.
రాజకీయాల్లో విజయ్ సాధించిన అపూర్వ విజయాన్ని ప్రశంసిస్తూ వరలక్ష్మి విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎవరినైనా విమర్శించడం చాలా సులభమని, కానీ రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ప్రయత్నంలోనే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం సామాన్యమైన విషయం కాదని ఆమె పేర్కొన్నారు. దానికి అపారమైన ధైర్యం, బలమైన సంకల్పం, తమిళనాడు ప్రజలు చూపించే ప్రేమ ఎంతో అవసరమని రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఈ అధికార స్థానాన్ని మనమందరం గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. మాటల కంటే చేతలే ఎప్పుడూ గట్టిగా మాట్లాడతాయని, నిరంతరం తప్పులు వెతికే విమర్శకులకు రాబోయే కాలమే నిజమేంటో చూపిస్తుందని హింట్ ఇచ్చారు. అంతవరకు కాస్త ఓపికతో, గౌరవంతో ఉంటూ, ఆయన ప్రజల కోసం ఏం సాధించబోతున్నారో చూడాలని, ఆయనకు మన మద్దతు, ప్రోత్సాహం అందించాలని వరలక్ష్మి కోరారు.
ఇంకా ముఖ్యమంత్రి విజయ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ.. ‘‘ఐ లవ్ యూ సార్.. నేను ఎప్పటికీ, ఎప్పటికీ మీకు అభిమానిగానే ఉంటాను’’ అంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తమ కోసం ఎంతో సమయాన్ని కేటాయించినందుకు విజయ్‌కు ధన్యవాదాలు అంటూ.. గతంలో తామిద్దరం కలిసి నటించిన ‘సర్కార్’ సినిమా సెట్స్‌లో తాను విజయ్‌తో అన్న మాటలను గుర్తుచేసుకుని ఇద్దరం కలిసి నవ్వుకున్నామన్నారు. ఆయన భవిష్యత్తు ప్రయాణం ఇటువైపే ఉంటుందని తనకు ఆ రోజుల్లోనే తెలుసని వరలక్ష్మి వెల్లడించారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ విజయ్ ఎంతో ఆప్యాయంగా, వినయంగా ఉన్నారని కొనియాడారు. ఈ భేటీలో తమిళనాడులోని మహిళా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా చర్చించామని, విజయ్ నాయకత్వంలో తమిళనాడు ప్రజల జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని, రాష్ట్రం మరింత సుభిక్షంగా మారుతుందని ఆశిస్తున్నట్లు వరలక్ష్మి శరత్‌కుమార్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి:
నితిన్ ‘హ్యాట్రిక్’ సినిమాలు.. ఈసారైనా హిట్ దక్కేనా
‘వారణాసి’.. జక్కన్నకు కొత్త టెన్షన్!
బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..