మోదీ, ట్రంప్, పుతిన్ సరసన సీఎం విజయ్.. ఊటీలో మైనపు విగ్రహం
ABN, Publish Date - Nov 25 , 2026 | 04:39 PM
ఊటీ బోట్హౌస్లోని అంతర్జాతీయ మైనపు బొమ్మల మ్యూజియంలో సీఎం విజయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే.. తాజాగా ఇప్పుడు ఊటీ మ్యూజియం (Ooty Wax Museum) లో ఏర్పాటు చేసిన ఆయన మైనపు విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తోంది. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మైనపు బొమ్మల మ్యూజియంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Tamil Nadu CM Vijay) విగ్రహాన్ని తాజాగా ప్రదర్శనకు ఉంచారు. కోట్, సూట్ ధరించి ఠీవీగా నిల్చున్నట్లు రూపొందించిన ఈ విగ్రహం సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా విజయ్ అభిమానులు, పర్యాటకులు ఆయన విగ్రహం పక్కన నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లాలోని ఊటీ బోట్‌హౌస్ (Ooty Boat House) ప్రాంగణంలో పర్యాటక శాఖ, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ మైనపు బొమ్మల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖుల విగ్రహాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలు, సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల రూపాలను ఒకేచోట చూసే అవకాశం పర్యాటకులకు కల్పిస్తున్నారు.
అయితే.. ఈ మ్యూజియంలో ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మదర్ థెరిసా వంటి ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. సినీ రంగం నుంచి రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి నటులు, క్రికెట్ ప్రముఖులతో పాటు 20 మందికి పైగా ప్రముఖుల విగ్రహాలు ప్రస్తుతం ఇక్కడ సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి విజయ్ మైనపు విగ్రహాన్ని కూడా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఆయన సాధారణంగా కనిపించే రాజకీయ నాయకుడి రూపానికి భిన్నంగా, కోట్-సూట్ ధరించి నిల్చున్నట్లుగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. విజయ్ ముఖకవళికలు, శరీరాకృతిని పోలి ఉండేలా తీర్చిదిద్దిన ఈ రూపం సందర్శకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
మ్యూజియాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఇతర ప్రముఖుల విగ్రహాలతో పాటు విజయ్ మైనపు బొమ్మను కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆయన అభిమానులు విగ్రహం పక్కన నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఊటీకి వెళ్లే పర్యాటకులకు బోట్హౌస్లోని ఈ మైనపు బొమ్మల మ్యూజియం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.