Sigma: నెలాఖరుకు విజయ్ కొడుకు చిత్రం!
ABN, Publish Date - Jul 02 , 2026 | 11:30 AM
ముందుగా ప్రకటించినట్టు ఈ నెల 31న 'సిగ్మా'ను విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రమ్ చేస్తున్న సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇదే నెల 31న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా డబ్బింగ్ పూర్తయ్యిందని, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ, 'సినిమా ఇప్పుడు ఫైనల్ షేప్ తీసుకుంటుండటం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. జేసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం మా కోసం ఎంతో ప్రత్యేకమైన అనుభవం. ఇది ఆయన తొలి చిత్రం అయినప్పటికీ, ప్రతి దశలో ఆయన చూపించిన స్పష్టత, నమ్మకం, క్రమశిక్షణ, అనుభవజ్ఞుడైన దర్శకుడిని తలపించాయి. సందీప్ కిషన్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందం అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు' అని అన్నారు.
దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ, 'డబ్బింగ్ పూర్తి కావడం మా ప్రయాణంలో ఎంతో సంతృప్తినిచ్చే మైలురాయి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు 'సిగ్మా'ను తీసుకురావడానికి మరో అడుగు దగ్గరయ్యాం. నా విజన్‌ను నమ్మి, పూర్తి సృజనాత్మక స్వేచ్ఛ ఇచ్చిన మా నిర్మాత సుభాస్కరన్ సర్, జి.కె.ఎం. తమిళ్ కుమరన్ సర్, లైకా ప్రొడక్షన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం వల్లనే నేను అనుకున్న విధంగా ఈ సినిమాను తెరకెక్కించగలిగాను. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేస్తాం' అని అన్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్, హరిహరసుధన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Kayadu Lohar: టెన్త్ క్లాస్‌లోనే అంత పని చేసిందా?
వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!