Moon Walk: 25 ఏళ్ల తర్వాత 'మూన్ వాక్' కోసం.. రిలీజ్ ఎప్పుడంటే..
ABN, Publish Date - Nov 21 , 2026 | 08:37 AM
ప్రభుదేవా, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘మూన్‌వాక్’ చిత్రాన్ని డిసెంబరు 24న విడుదల చేయనున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు
ప్రభుదేవా, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘మూన్‌వాక్’ చిత్రాన్ని డిసెంబరు 24న విడుదల చేయనున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుదేవా తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. ‘ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘మూన్‌వాక్’ సినిమాను క్రిస్మస్ సెలవుల్లో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి. నవ్వులతో నిండిన థియేటర్ వేడుకకు సిద్ధంగా ఉండండి’ అంటూ పేర్కొన్నారు.
కాగా, ఈ చిత్రంలో ప్రభుదేవా, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ, రాజేంద్రన్, లొల్లు సభ స్వామినాథన్, మలయాళ నటులు అజ్జు వర్గీస్, అర్జున్ అశోకన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులోని పాటలకు రెహ్మాన్ స్వరాలు సమకూర్చడంతో పాటు స్వయంగా నేపథ్య గానం చేయడం విశేషం. అంతేకాకుండా సినిమాలో ఓ సన్నివేశంలో కూడా ఆయన నటించారు. దీంతో ఈ సినిమాపై సంగీత ప్రియుల్లోనూ ఆసక్తి నెలకొంది.
90వ దశకంలో రెహ్మాన్–ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన ‘కాదలన్’, ‘మిస్టర్ రోమియో’, ‘లవ్ బర్డ్స్’ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కలయికలో చివరిసారిగా 1997లో ‘మిన్సార కనవు’ చిత్రం వచ్చింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత మరోసారి ‘మూన్‌వాక్’ కోసం ఈ ఇద్దరూ కలిసి పనిచేశారు. దీంతో పాత సంగీత మ్యాజిక్‌ను మరోసారి తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బిహైండ్‌వుడ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మల శ్రీధరన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను తొలుత దీపావళికి విడుదల చేయాలని భావించినప్పటికీ, కొన్ని కారణాలతో వాయిదా వేశారు. తాజాగా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.
ALSO READ:
Sukumar: సుకుమార్.. దుబాయిలో ఏం చేస్తున్నారంటే.
Moon Walk: 25 ఏళ్ల తర్వాత 'మూన్ వాక్' కోసం.. రిలీజ్ ఎప్పుడంటే..
ఎమ్మెల్యే పాడెమోసిన సీఎం విజయ్..