మైత్రీ మూవీ మేకర్స్ పంట పండింది!
ABN , Publish Date - Aug 21 , 2026 | 03:25 PM
మైత్రీ మూవీ మేకర్స్ కు శ్రావణ శుక్రవారం భలే కలిసొచ్చింది. ఈ రోజున ఆ సంస్థ నుంచి విడుదలైన రెండు సినిమాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో 'ఇరుముడి' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే, 'ఇరుముడి కట్టు' పేరుతో తమిళంలో ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీమేకర్స్ తీసిన మరో సినిమా 'మొద రాత్రి' కూడా విడుదలై యూత్ ను ఆకట్టుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్‌కు 'పుష్ప 2' సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయం దక్కలేదు. అయితే వరుస పరాజయాలతో సాగుతున్న ఈ నిర్మాణ సంస్థ ఒకే రోజున రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అది ఒకటి రవితేజ నటించిన 'ఇరుముడి' కాగా, మరొకటి తమిళంలో విడుదలైన 'మొద రాత్రి'. అయితే ఇందులో 'ఇరుముడి' సినిమా తమిళంలోనూ 'ఇరుముడి కట్టు' పేరుతో విడుదలైంది. సహజంగా తెలుగు నుంచి తమిళంలోకి అనువాదమైన సినిమాలు అక్కడ పెద్దంత విజయాన్ని అందుకున్న దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. కానీ రవితేజ టైమ్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ టైమ్ కూడా బాగుంది. 'ఇరుముడి కట్టు' సినిమాకు తమిళనాడులో మంచిస్పందన లభిస్తోంది. తెలుగులో ఈ సినిమా ఇప్పటికే బిగ్ హిట్ అనే టాక్ సంపాదించుకొంది. తమిళంలోనూ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 'ఇరుముడి కట్టు'కు మంచి ఓపెనింగ్స్ లభించాయి. విశేషం ఏమంటే. తమిళనాట మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలు రెండు ఒకదానికి ఒకటి పోటీ ఇచ్చినట్టుగా అయ్యింది. ఈ సంస్థ కొత్త తారలతో నిర్మించిన 'మొద రాత్రి' సైతం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ లైట్ హార్టెడ్ వెడ్డింగ్ కామెడీ సినిమాను జన్ జీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. రిషికాంత్, అనిష్మ అనిల్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను చేతన్, భగవతి పెరుమాళ్, అబ్దుల్ లీ తదితరులు పోషించారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ఓ అమ్మాయి, అబ్బాయి జీవితంలో మొదటి రాత్రి వెలుగు చూసిన రహస్యాలతో సాగే ఈ సినిమా ఆద్యంతం వినోద ప్రదానంగా సాగి యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాను రాజా కురుప్పుసామి తెరకెక్కించాడు. ఇక 'ఇరుముడి కట్టు' సినిమాలో రవితేజ సరసన నటించిన ప్రియ భవాని శంకర్ తమిళంలో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్. అలానే దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయ్యింది. దాంతో ఇటు 'ఇరుముడి కట్టు', అటు 'మొద రాత్రి'తో ఒకే రోజును రెండు విజయాలను ఈ సంస్థ తన ఖాతాలో వేసుకున్నట్టు అయ్యింది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన రెండు సినిమాలు ఇక ఒకేవారం విడుదలై ఘన విజయం సాధించడం ఇది మొదటిసారి కాదు. 2023 జనవరిలో 12న బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' విడుదల కాగా, ఆ మర్నాడే ఇదే సంస్థ చిరంజీవితో నిర్మించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా విడుదలైంది. సంక్రాంతి సీజన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. దాంతో ఒకేసారి విడుదలైన సినిమాలు బాగుంటే జనం చూస్తారనే నమ్మకం వీరికి కలిగింది. ఆ నమ్మకంతోనే కావచ్చు... 'ఇరుముడి కట్టు', 'మొద రాత్రి' చిత్రాలను తమిళనాట ఒకే రోజు విడుదల చేసి, మరోసారి డబుల్ ధమాకాను ఈ సంస్థ అందుకుంది.
ఇవి కూడా చదవండి:
మెగా బ్లాస్ట్‌కు సిద్ధమవ్వండి.. డైరెక్టర్ బాబీ పోస్ట్ వైరల్
‘మాన్‌స్టర్’గా సల్మాన్ ఖాన్.. వంశీ పైడిపల్లి స్కెచ్ ఏంటో