సినిమా రివ్యూ: అమీర్ లోగ్

ABN , Publish Date - Aug 21 , 2026 | 02:04 PM

పాత బస్తీ నేపథ్యంలో తెరకెక్కిన అమీర్ లోగ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో  చూద్దాం 

Ameer Log Movie Review

సినిమా రివ్యూ: అమీర్ లోగ్ (Ameer log movie Review)
విడుదల తేది: 21-8-2026


ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ సాయి యోగి, విశ్వేందర్ రెడ్డి కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అమీర్ లోగ్'. మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బస్తీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్తవారు చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని  మెప్పించిందో? లేదో? చూద్దాం.

కథ:


హైదరాబాద్ పాత బస్తీ నేపథ్యంలో తెరకెక్కిన కథ ఇది.  బస్తీలో శ్రీను (ఎంసీ హరి), ఫరూక్ (మనోజ్), మల్లేష్ (శశిధర్) మంచి స్నేహితులు. ఏ పనిపాట, లక్ష్యం లేకుండా తిని తిరుగుతుంటారు. భవిష్యత్తు గురించి ఆలోచించమని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా.. ఈ చెవిన విని.. ఆ చెవిన వదిలేస్తుంటారు. ఓ రోజు బస్తీలో క్రికెట్ విషయంలో నజీర్ (సాయి యోగి)తో గొడవ పడటంతో సమస్య పెద్దదవుతుంది. ఈ ముగ్గురిని సోదరుల్లా భావించే బస్తీవాసి, సాఫ్వేర్ ఉద్యోగి గీత (వేద జలంధర్) ఆ గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, శ్రీనుని తన కంపెనీలో బాయ్గా పనిలో పెడుతుంది. అక్కడి నుంచి అతనిలో మార్పు వస్తుంది. ఆ సందర్భంలోనే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయిస్ తో క్రికెట్ బెట్ కడతాడు  శ్రీను. ఆటలో ఓడిపోవడంతో దావత్ ఇస్తానని మాటిచ్చి బస్తీ అంతా పెద్దగా భావించే ఛాఛా (విశ్వేందర్ రెడ్డి) చేసిన బిర్యానీ దావత్ ఇస్తాడు. అప్పుడే గీత లవర్ రవి (రావణ్ నిట్టూరు) ఎంట్రీ ఇస్తాడు. అతని రాకతో ఈ ముగ్గురు జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది? లైఫ్ లో సెటిల్ అయ్యారా? లేదా? అన్నది కథ.  


విశ్లేషణ:
పాత బస్తీలో ముగ్గురు యువకుల మధ్య జరిగే కథ ఇది. ప్రథమార్ధం అంతా బస్తీ యువత అల్లరి చిల్లరి పనులతో సోసోగా సాగుతుంది. వారి గొడవలు, కామెడీ సీన్స్ తో ఓ అరగంట వరకు కథ పెద్దగా ముందుకు సాగదు. ఇంటర్వెల్ టైమ్ కి కథలో కాస్త కదలిక వస్తుంది. వారిలో మార్పు కోసం తపన మొదలవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆఫీస్ టీమ్ వర్సెస్ బస్తీ టీమ్ క్రికెట్ మ్యాచ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచేలా చేసింది. మ్యాచ్ తర్వాత బిర్యానీ చుట్టూ కథ తిరగడం కథకు కొత్త ఫ్లేవర్ వచ్చినట్టు అయింది. కాసేపటికి అది కూడా బోర్ కలిగిస్తుంది. సెకెండాఫ్లో స్నేహం, భావోద్వేగ సన్నివేశాలు కాసింత మెప్పిస్తాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ జీవనశైలిని, అక్కడి వాతావరణాన్ని తెరపై చూపించడంపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టారు. ముగ్గురు పనిలేని యువకులు తమ జీవితాలను మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం అనే లైన్ కొత్తదేమీ కాదు.. ‘మేం ఫేమస్’, ఈ మధ్యనే వచ్చిన ‘దీవానా’ చిత్రాలు ఈ తరహా కథతోనే వచ్చాయి. కాకుంటే దర్శకుడు రమణా రెడ్డి పాతబస్తీ నేటివిటీని చూపించే ప్రయత్నం చేశారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
శ్రీను పాత్రలో బస్తీ యువకుడిగా ఎంసీ హరి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. మనోజ్, శశిధర్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్య స్నేహం, కామెడీ ట్రాక్ సినిమాకు ప్లస్ పాయింట్. తిమ్మరాజు పల్లి టీవీలో హీరోయిన్ గా నటించి మెప్పించిన వేద జలంధర్ ఇందులో గీతగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కనిపించింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. ఛాఛా పాత్రలో విశ్వేందర్ రెడ్డి చక్కని భావోద్వేగాలు పంచారు. ఇందులో నటించిన ఆర్టిస్ట్లంతా పాత బస్తీ లోకల్ వారే. నేటివిటీకి తగ్గట్లు ఎస్వీకే కెమెరా పనితనం బావుంది. స్మరణ్ సాయి  సంగీతం పర్వాలేదనిపించింది. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల సీన్స్ ను  బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ కాస్త క్రిస్ప్గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు కూడా ఓకే.
గతంలో డెక్కన్ సినిమా పేరుతో కొన్ని లోకల్ సినిమాలు వస్తుండేవి. ఇది కూడా ఆ తరహా సినిమానే. ఓల్డ్ సిటీ నేపథ్యం ఓకే అయినా బాష విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. సగానికి పైగా ఓల్డ్ సిటీ ఉర్దూతోనే సినిమా నడిచింది. హిందీతో పరిచయం లేని వారికి ఈ సినిమా ఏమాత్రం అర్థం కాదు. సబ్ టైటిల్స్ వేసినా బావుండేది. తెలుగు ఆడియన్స్కి అయితే అంతగా అర్థం కాకపోవచ్చు. దీనికి పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. లాస్ట్ సీన్ లో ఓ చిన్న డైలాగ్ తో  ‘అమీర్ లోగ్’ టైటిల్కు జస్టిఫికేషన్ ఇవ్వటం కొసమెరుపు.

ట్యాగ్ లైన్:
అక్కడక్కడా నవ్వించే ‘అమీర్ లోగ్’
రేటింగ్:
2.25/5

Updated Date - Aug 21 , 2026 | 02:38 PM