మోహన్ రాజా సరికొత్త అవతారం.. ఈ ట్విస్ట్ ఏంటి
ABN, Publish Date - Jul 29 , 2026 | 02:09 PM
తమిళ సినీ పరిశ్రమలో ‘తనీ ఒరువన్, సంతోష్ సుబ్రమణియం, ఉనక్కుం ఎనక్కుం, జయం’ వంటి అద్భుతమైన సూపర్‌హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు మోహన్ రాజా ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తనున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో ‘తనీ ఒరువన్, సంతోష్ సుబ్రమణియం, ఉనక్కుం ఎనక్కుం, జయం’ వంటి అద్భుతమైన సూపర్‌హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తనున్నారు. గత కొన్ని నెలలుగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న ఆయన, ఇప్పుడు ఊహించని విధంగా విలన్ (Villain)గా వెండితెరపై కనిపించబోతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖ దర్శకులు నటులుగా, ముఖ్యంగా ప్రతి నాయక పాత్రల్లో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మోహన్ రాజా కూడా నటుడిగా మారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యారు.
కెప్టెన్ సినీ క్రియేషన్స్ పతాకంపై ‘సమర్, నాన్ సిగప్పు మనిదన్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తిరు (Thiru) ఈ నయా ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. దివంగత ప్రముఖ నటుడు, ‘కెప్టెన్’ విజయకాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా, శివానీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన విలన్ పాత్ర కోసం మోహన్ రాజాని ఎంపిక చేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు ఇలా పూర్తిస్థాయి నెగెటివ్ రోల్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగానూ, ఆసక్తికరంగానూ మారింది.
ఈ సినిమాలో మోహన్ రాజా పాత్ర అత్యంత పవర్‌ఫుల్‌గా, మైండ్ గేమ్‌లతో సాగనుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. మోహన్ రాజా స్వయంగా తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘తనీ ఒరువన్’లో అరవింద్ స్వామి పోషించిన స్టైలిష్ విలన్ పాత్ర తరహాలోనే.. ఈ రోల్‌ను దర్శకుడు తిరు చాలా కొత్తగా డిజైన్ చేశారని తెలుస్తోంది. పాత్రలోని వైవిధ్యం, ఇంటెన్సిటీ బాగా నచ్చడంతోనే మోహన్ రాజా ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పారనేలా టాక్ నడుస్తోంది. ఓ దిగ్గజ దర్శకుడు విలన్‌గా మారి తెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది ప్రస్తుతం సినీ ప్రియుల్లో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి:
‘మా’ ఆధ్వర్యంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు
రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్‌సింగ్’ టీమ్ స్పందనిదే
PelliChoopulu: విజయ్ దేవరకొండ విజయ విహారానికి పదేళ్ళు!