ఏడు నెలల పోరాటం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ‘జననాయగన్’ ఫీవర్
ABN , Publish Date - Jul 23 , 2026 | 09:56 AM
కోలీవుడ్ అగ్రహీరో, టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’.. 7 నెలల పోరాటం తర్వాత నేడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి వచ్చింది.
కోలీవుడ్ అగ్రహీరో, టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ (CM Vijay) నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan).. 7 నెలల పోరాటం తర్వాత నేడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి వచ్చింది. దాదాపు 3500కు పైగా స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఒక్క తమిళనాడులోనే 950-1000 థియేటర్లలో విడుదలవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వెంకట్ కె.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకుడు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న విడుదలకావాల్సిన ఈ మూవీ సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ వివాదం, న్యాయ పోరాటం, రాజకీయ అడ్డంకులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, సినిమాలోని కీలక సన్నివేశాల లీక్ వంటి పలు అడ్డంకులను అధిగమించి.. ఈనెల 23న గురువారం విడుదలవుతోంది. ‘ఎ’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర జర్నీని పరిశీలిస్తే...
‘ది గోట్’ మూవీ తర్వాత..
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గోట్’ చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన తర్వాత విజయ్ తన 69వ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించారు. ఈ చిత్రాన్ని 2024 సెప్టెంబరు 24న అధికారికంగా ప్రకటించారు. వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి-69’గా పెట్టి 2024 అక్టోబరులో సెట్స్‌పైకి తీసుకెళ్లారు. పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. 2025 జనవరిలో ఈ చిత్రానికి ‘జననాయగన్’ నామకరణం చేసి, 2026 జనవరి 9న సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో 2026 అక్టోబరులో చిత్రీకరణ పూర్తి చేసుకోగా, డిసెంబరులో సెన్సార్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మలేషియాలో ఆడియో రిలీజ్...
పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత 2025 డిసెంబరులో మలేషియా వేదికగా లక్షమందికి పైగా అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయ్ చివరి చిత్రం కావడంతో వేడుకకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో అత్యధిక మంది హాజరైన ఆడియో రిలీజ్ వేడుకగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ‘సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ఈ వేడుకలో విజయ్ ప్రకటించారు. ఇది విజయ్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులను కదిలించింది.
సెన్సార్ వివాదంలో చిక్కుకుని...
సంక్రాంతికి విడుదల చేయాలన్న లక్ష్యంతో 2025 డిసెంబరు 18న సెన్సార్ బోర్డుకు పంపించారు. అయితే, చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై సీబీఎఫ్‌సీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సర్టిఫికేట్‌ను జారీ చేయలేదు. దీంతో 2026 జనవరి 6వ తేదీన నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ‘యూఏ’ సర్టిఫికేట్ మంజూరు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనిపై సీబీఎఫ్‌సీ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేయడంతో సింగిల్ జడ్జి ఆదేశాలపై మధ్యంతర స్టే విధించారు. దీంతో జనవరి 9న విడుదలకు నోచుకోలేదు. అదే సమయంలో నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ సానుకూలంగా తీర్పురాలేదు. దీంతో ఫిబ్రవరి 10న పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.
అడ్డొచ్చిన ఎన్నికల నియమావళి...
ఈ నేపథ్యంలో 2026 మార్చిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో సినిమా విడుదలలో కొత్త సమస్య తలెత్తింది. టీవీకే అధ్యక్షుడిగా విజయ్ ఉండటంతో సినిమా విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని సెన్సార్ బోర్డు కొత్త షరతు విధించింది. దీంతో సినిమా విడుదలకు పూర్తిస్థాయిలో బ్రేక్‌పడింది.
సోషల్ మీడియాలో సినిమా లీక్....
ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 9వ తేదీన సినిమా లీక్ అయింది. ఇది చిత్ర బృందాన్ని మరింతగా షాక్‌కు గురిచేసింది. దీనిపై నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో ‘జన నాయగన్’ మూవీని చట్ట వ్యతిరేకంగా డౌన్‌లోడ్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు ఆదేశించింది.
ఎన్నికల్లో టీవీకే ఘన విజయం...
మే నెలలో వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే విజయం సాధించగా, ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈ నెలలో ముగియగా, సీబీఎఫ్‌సీ ‘ఏ’ సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత సినిమా విడుదల తేదీపై కూడా తర్జనభర్జనలు జరిగాయి. తొలుత ఈ నెల 17న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. చివరకు జూలై 23వ తేదీని ఖరారు చేసి విడుదల చేస్తున్నారు. అలాగే, సినిమా టైటిల్ కార్డులో కూడా ‘గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్’ అనే పేరును వేశారు. ఇలా ఏడు నెలల పోరాటం తర్వాత భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల అవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ‘జన నాయగన్’ ఫీవర్
తమ అభిమాన హీరో చిత్రం విడుదలవుతున్న తరుణంలో టీవీకే శ్రేణులతో పాటు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయా యి. ఒక రకంగా తమిళ నాడు రాష్ట్రాన్ని ‘జన నాయగన్’ ఫీవర్ పట్టుకుంది. థియేటర్లకు విద్యుత్ దీపాలతో అలంకరించడం, కటౌట్లు, బ్యానర్లు కట్టడం వంటి పనుల్లో నిమగ్నమైవున్నారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలైతే ఏకంగా సెలవు పెట్టి విజయ్ చిత్రం ఫస్ట్ షో చూసేందుకు వెళ్తుండగా, మరికొందరు టీవీకే నేతలు సినిమా ప్రదర్శన ఏర్పాట్లు చేపడుతున్నారు. అధికార పార్టీ నేతలు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో స్వయంగా కొందరు ఎమ్మెల్యేలు బ్యానర్లు, కటౌట్లను స్వయంగా కట్టడం గమనార్హం. అంతేకాకుండా, ఈ చిత్రం తొలి ఆటను ఉదయం 9 గంటలకు ప్రదర్శించనున్నారు. దీంతో చిత్రంలో నటించిన కొందరు నటీనటులు స్థానిక రోహిణి థియేటర్లలో తిలకించనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి:
రామ్ చరణ్ నటన అంటే చాలా ఇష్టం: జయకృష్ణ ఘట్టమనేని
మౌనం వద్దు.. గళం విప్పండి: నటి మంచు లక్ష్మి
సేవే మా సంకల్పం: నందమూరి జానకిరామ్ భార్య దీపిక