మౌనం వద్దు.. గళం విప్పండి: నటి మంచు లక్ష్మి
ABN , Publish Date - Jul 22 , 2026 | 07:59 PM
దేశంలో జరుగుతున్న పరిణామాలపై, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతీ ఒక్కరూ స్పందించాలని, మనకెందుకులే అని ఊరుకోకుండా గళమెత్తాలని ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి పిలుపునిచ్చారు.
దేశంలో జరుగుతున్న పరిణామాలపై, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతీ ఒక్కరూ స్పందించాలని, మనకెందుకులే అని ఊరుకోకుండా గళమెత్తాలని ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి (Manchu Lakshmi) పిలుపునిచ్చారు. రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆందోళనలపై మంచు లక్ష్మి స్పందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ, పౌరుల బాధ్యతను గుర్తుచేశారు.
దేశంలో కీలకమైన అంశాలు, ప్రజా సమస్యలు జరుగుతున్నప్పుడు సాధారణంగా చాలామంది.. ‘‘మనకెందుకులే, మన తలనొప్పి కాదు కదా’’ అని ఉపేక్షిస్తుంటారని, కానీ అలా ఉండటం సరికాదని లక్ష్మి అభిప్రాయపడ్డారు. సోనమ్ వాంగ్‌చుక్ వంటి వ్యక్తులకు రావలసిన న్యాయం జరగాలని ఆమె ఆకాంక్షించారు. ఆయన ఆశయాలను, ఆవేదనను తాను పూర్తిస్థాయిలో విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. అందరూ పనులన్నీ మానుకుని ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనలేకపోయినా, కనీసం సమస్యల గురించి మాట్లాడటం, చర్చించడం, సోషల్ మీడియా ద్వారా గళం విప్పడం చేయడం ప్రతి పౌరుడి బాధ్యతని స్పష్టం చేశారు.
పార్లమెంట్‌లో ఉన్న ప్రజాప్రతినిధులపై, రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం కంటే, ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం గళం విప్పడమే ముఖ్యమని మంచు లక్ష్మి స్పష్టం చేశారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఊరుకోవడం ఎంతో వేదన కలిగిస్తోందని, సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపాలని ఆమె కోరారు. మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భావి తరాల కోసం, న్యాయమైన పోరాటాల కోసం స్వరం వినిపించాలని ఆమె ఇచ్చిన పిలుపుకు నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. మరోవైపు, విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28వ తేదీనుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీలో ఆందోళనకారులపై, విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడానికి.. దేశంలోని ప్రముఖులెందరో ఖండిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
సేవే మా సంకల్పం: నందమూరి జానకిరామ్ భార్య దీపిక
బ్రేకింగ్ న్యూస్: ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్
‘AA23’ హీరోయిన్ ఫిక్స్? వద్దు బాబోయ్ అంటోన్న ఫ్యాన్స్!