సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం విజయ్ అన్నే: అట్లీ

ABN, Publish Date - Sep 19 , 2026 | 01:02 PM

భారతీయ చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని సెన్సేషనల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అట్లీ. ఆ గుర్తింపుకు కారణం దళపతి విజయ్ అంటూ అట్లీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Atlee and Vijay

భారతీయ చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని సెన్సేషనల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అట్లీ (Atlee). ‘రాజా రాణి’తో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత దళపతి విజయ్‌ (Thalapathy Vijay)తో ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్ అందించిన ఆయన.. షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ తీసి ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka)ను తెరకెక్కిస్తున్న అట్లీ.. తాజాగా పాల్గొన్న ఓ వేడుకలో తన కెరీర్, విజయ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధంపై ఎమోషనల్‌గా స్పందించారు.

ఆయన లేకపోతే ఈ స్థాయి అసాధ్యం

విజయ్ తనకు చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘ఈ రోజు నేను వేసుకున్న షర్ట్, ప్యాంట్, చేతికి పెట్టుకున్న వాచ్‌.. ఇవన్నీ నా కష్టార్జితమే అని నమ్ముతాను. కానీ వీటన్నింటి వెనుక, నా ఈ ఎదుగుదల వెనుక నా దళపతి విజయ్ అన్నే ఉన్నారు. ఆయన లేకపోతే నేను ఈ స్థాయికి రావడం అసాధ్యం. ‘రాజా రాణి’ సినిమాతో నాకు ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది. దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీస్సులు, నా భార్య సహకారంతో నా ప్రయాణం సాగింది. అయితే, ఆ సమయంలో విజయ్ అన్న నాకు వరుసగా మూడు అవకాశాలు ఇచ్చి నా జీవితాన్నే పూర్తిగా మార్చేశారు’’ అని అట్లీ చెప్పుకొచ్చారు.


‘జవాన్’ వెనుక విజయ్ ప్రోత్సాహం

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసే విషయంలో విజయ్ తనలో నింపిన ధైర్యాన్ని అట్లీ పంచుకున్నారు. ‘‘షారుఖ్ ఖాన్ సర్ నా ఆఫీస్‌కు వచ్చి నాతో మాట్లాడినప్పుడు.. ఈ విషయాన్ని విజయ్ అన్నతో డిస్కస్ చేశాను. అప్పుడు విజయ్ అన్న నాతో.. ‘రేయ్, నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలియదు. నా కాళ్ల చుట్టూ తిరగడం ఆపి, ఆ సినిమా మాత్రం దయచేసి చేయి.. నీ జీవితమే మారిపోతుంది’ అని చెప్పారు. ఆయన అన్నట్లుగానే ఆ సినిమా నా జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. విజయ్ అన్నకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు.


ఇకపై సినిమా చేసే అవకాశం లేకపోవచ్చు

తాను ప్రతి వేదికపైనా విజయ్ పేరును ప్రస్తావించడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. ‘‘నేను పదే పదే విజయ్ అన్న పేరును ప్రస్తావిస్తున్నానంటే, ఆయనతో మరో సినిమా చేయాలనే స్వార్థంతో చేస్తున్నానని కొందరు అనుకోవచ్చు. కానీ ఇకపై ఆయనతో నాకు మరో సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లి ‘సీఎం విజయ్’గా మారారు. సినిమా ప్రాజెక్ట్‌లతో సంబంధం లేకుండా ఆయన ఎప్పటికీ నా అన్ననే’’ అని అట్లీ స్పష్టం చేశారు. విజయ్‌పై అట్లీ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

ఐదు కాదు.. టాలీవుడ్ సినిమాకు మరో మూడు కావాలి

యాక్షన్‌, హర్రర్‌ చిత్రాలకు ఏమాత్రం తేడా లేదు: దర్శకుడు

‘వారణాసి’ కోసం రంగంలోకి నార్వే వీఎఫ్ఎక్స్ దిగ్గజం.. జక్కన్నా, నీకో దండం సామి!

Updated Date - Sep 19 , 2026 | 01:02 PM