ఐదు కాదు.. టాలీవుడ్ సినిమాకు మరో మూడు కావాలి
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:19 AM
తెలుగు సినిమా స్టామినా రోజురోజుకూ పెరుగుతోంది... టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా మూవీ ఐదు భాషల్లో రిలీజవుతోంది... అలా కాకుండా మరో మూడు భాషల్లోనూ తెలుగు సినిమా డబ్ అయితే మరిన్ని కోట్లు పోగవుతాయని ట్రేడ్ టాక్.
తెలుగు సినిమా స్టామినా రోజురోజుకూ పెరుగుతోంది... టాలీవుడ్ (Tollywood) నుంచి వచ్చే పాన్ ఇండియా (Pan India) మూవీ ఐదు భాషల్లో రిలీజవుతోంది... అలా కాకుండా మరో మూడు భాషల్లోనూ తెలుగు సినిమా డబ్ అయితే మరిన్ని కోట్లు పోగవుతాయని ట్రేడ్ టాక్... ఆ మూడు భాషలేవో తెలుసుకుందామా!
మన తెలుగు సినిమా 2015 నుంచీ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతోంది. ‘బాహుబలి- ద బిగినింగ్’ (Baahubali Part 1)తో ఆ కళ మొదలైంది. ఆ చిత్రం దక్షిణాదిలోనే కాదు హిందీలోనూ అనువాదమై ఉత్తరాదిన విజయవిహారం చేసింది. ఆ మూవీ ఘనవిజయంతోనే తెలుగువారి పాన్ ఇండియా మూవీస్‌కు క్రేజ్ మొదలైంది. ఆ తరువాత వచ్చిన ‘బాహుబలి-ద కంక్లూజన్’ (Baahubali 2) మూవీ మరింత ఆదరణ పొంది టాలీవుడ్‌కు ఎంతో క్రేజ్ సంపాదించి పెట్టింది. ఈ రెండు చిత్రాల విజయంతోనే తెలుగు సినిమాలపై ఉత్తరాదివారికి మోజు పెరిగింది. సౌత్ నుంచి తయారయ్యే పాన్ ఇండియా మూవీస్ అన్నీ దక్షిణాది నాలుగు భాషలతో పాటు ఉత్తరాదిన హిందీలో మాత్రమే అనువాదమవుతున్నాయి. అయితే మన తెలుగు పాన్ ఇండియా మూవీస్‌కు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఆదరణ లభిస్తోంది. అందువల్ల కేవలం హిందీలోనే కాకుండా మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లోనూ మన చిత్రాలు డబ్ అయి అక్కడ రిలీజయితే మరిన్ని కోట్లు లభిస్తాయని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.
పౌరాణికాలు తెరకెక్కించడంలో తెలుగువారి తరువాతే ఎవరైనా అన్న నానుడి ఉంది. అందుకు తగ్గట్టుగానే తెలుగునాట ఘనవిజయం సాధించిన ‘లవకుశ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీక్రిష్ణపాండవీయం’ వంటి చిత్రాలు హిందీలోనే కాకుండా బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ అనువాదమై అలరించాయి. ‘లవకుశ, పాండవ వనవాసం’ వంటి చిత్రాలు బెంగాల్‌లోనూ రజతోత్సవాలు జరుపుకోవడం గమనార్హం. ఆ తరువాత మళ్ళీ మన తెలుగు సినిమాలకు ఆ స్థాయి ఆదరణ లభించలేదు. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తరువాత నుంచే టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్‌కు నార్త్‌లోనూ మంచి క్రేజ్ నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్, పుష్ప-2, కల్కి 2898 ఏడి’ చిత్రాలు కూడా నార్త్‌లో మంచి వసూళ్ళు చూశాయి. ముంబై సర్క్యూట్ కిందకు ముంబై సిటీ, మిగిలిన మహారాష్ట్ర ప్రాంతం, కొంత గుజరాత్, మరికొంత గోవా ప్రాంతం వస్తాయి. పూర్తి మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లోనూ తెలుగు హిందీ అనువాదాలను ఆదరిస్తున్నారు. అలాగే భోజ్‌పురి మాతృభాషగా గల మధ్యప్రదేశ్ లోనూ హిందీ అనువాదాలే విజయం సాధిస్తున్నాయి. గుజరాత్‌లోని పలు జిల్లాల్లో, బెంగాల్ లోనూ పలు చోట్ల తెలుగు అనువాదాలకు మంచి ఆదరణ ఉంది. అందువల్ల కేవలం హిందీలోనే కాకుండా మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లోనూ మన తెలుగు పాన్ ఇండియా మూవీస్‌ను డబ్ చేస్తే మంచిదని, తద్వారా సినిమా బిజినెస్ మరింతగా విస్తరిస్తుందని పరిశీలకులు అంటున్నారు.
‘బాహుబలి, కల్కి’ చిత్రాలతో ప్రభాస్ (Prabhas)కు నార్త్‌లో అన్ని రాష్ట్రాల్లోనూ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అలాగే ‘ట్రిపుల్ ఆర్’తో జూనియర్ యన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan)కు కూడా అక్కడ ఆదరణ ఉంది. ‘పుష్ప-2’తో పలు రికార్డులు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ (Allu Arjun). ఈ నలుగురు హీరోలు నటించే చిత్రాలన్నీ పాన్ ఇండియా మూవీస్‌గానే వస్తున్నాయి. గ్లోబల్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొని తెరకెక్కుతోన్న ప్రభాస్ ‘స్పిరిట్, ఫౌజీ’, యన్టీఆర్ ‘డ్రాగన్’, అల్లు అర్జున్ ‘రాకా’, సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటించబోయే చిత్రాలు - హిందీతో పాటు మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లోనూ అనువాదమయితే మంచిదనే ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. వీటితో పాటు నార్త్‌లో ఎంతో క్రేజ్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి తాజా చిత్రం ‘వారణాసి’ కూడా హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, గుజరాత్ భాషల్లో రిలీజైతే బాగుంటుందనీ అక్కడి జనాలు ఆశిస్తున్నారు. ముందుగా వచ్చేది ‘వారణాసి’ (Varanasi) కాబట్టి ఆ సినిమా ఈ మూడు భాషల్లోనూ అనువాదమై అలరిస్తే, మిగిలిన వారికి ఉత్సాహం కలుగుతుందనీ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ‘వారణాసి’ పాన్ వరల్డ్ సినిమా అని టాక్ వినిపిస్తుంది కాబట్టి.. ఈ విషయమై ఇప్పటికే జక్కన్న ఓ స్టెప్ వేసినట్టే భావించాలి. చూద్దాం.. ఏం జరుగుతుందో?
ఇవి కూడా చదవండి:
యాక్షన్, హర్రర్ చిత్రాలకు ఏమాత్రం తేడా లేదు: దర్శకుడు
‘వారణాసి’ కోసం రంగంలోకి నార్వే వీఎఫ్ఎక్స్ దిగ్గజం.. జక్కన్నా, నీకో దండం సామి!
విక్టరీ వెంకటేశ్ అక్టోబర్ సెంటిమెంట్.. మరోసారి కలిసొస్తుందా?