అనిరుధ్ రిసెప్షన్ కైనా ధనుష్ కు ఆహ్వానం అందుతుందా!?

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:19 PM

‘3’ సినిమాతో అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ధనుష్‌కు ఆయన పెళ్లికి ఆహ్వానం అందలేదనే వార్త ఆసక్తి రేపుతోంది. ఐశ్వర్యతో విడాకుల తర్వాత ధనుష్, అనిరుధ్ మధ్య సంబంధాలు ఎలా మారాయి? నవంబర్ 21న జరిగే వెడ్డింగ్ రిసెప్షన్‌కు ధనుష్‌ను పిలుస్తారా?

Dhanush - Anirudh

తమిళ స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుథ్‌ రవిచందర్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన వ్యక్తి యంగ్ స్టార్ హీరో ధనుష్‌. అతను, శ్రుతి హాసన్‌ జంటగా నటించిన '3' సినిమాతోనే సంగీత దర్శకుడిగా అనురుధ్‌ కెరీర్‌ మొదలైంది. ఆ సినిమాను అప్పటి రజనీకాంత్‌ కూతురు, ధనుష్‌ భార్య ఐశ్వర్య డైరెక్ట్ చేసింది. ధనుష్‌ నిర్మాతగానూ వ్యవహరించాడు. దాదాపు పదిహేనేళ్ళు గడిచినా... ఈ సినిమా కోసం ధనుష్‌ పాడిన 'వై దిస్ కొలవరి కొలవరి డీ' పాట ఇప్పటికీ సంగీత ప్రియుల నాలుకపై నర్తిస్తూనే ఉంటుంది. అనిరుధ్‌ ను ఓవర్ నైట్ స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్ ను చేసిన సినిమా అది. కానీ ఇటీవల గ్రీస్ లో జరిగిన అనిరుధ్‌ - కావ్య వివాహానికి ధనుష్‌కు ఆహ్వానం అందకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్యకు ధనుష్‌ విడాకులు ఇచ్చినా... వారేమీ ఎడముఖం పెడముఖంగా లేరు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని, ఒకరి వ్యక్తిగత జీవితాన్ని మరొకరు గౌరవిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇద్దరూ తిరిగి కలిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని సన్నిహితులు చెబుతుంటారు. మరి ఈ నేపథ్యంలో ఐశ్వర్య మాజీ భర్తగా కాకపోయినా... ధనుష్‌ను తన తొలి చిత్ర కథానాయకుడిగా ధనుష్‌ పిలిచి ఉండాల్సిందన్నది కొందరి వాదన. అయితే... రజనీకాంత్‌ కు మేనల్లుడి వరస అయ్యే అనిరుథ్‌ పెద్దాయన, కూతురు ఐశ్వర్యతో కలిసి ఈ పెళ్ళికి వచ్చిన సందర్భంలో వారికి ఇబ్బంది కలగకూడదనే ధనుష్‌ను పెళ్ళికి ఆహ్వానించలేదని కొందరంటున్నారు. ఎప్పుడైతే ఐశ్వర్యకు ధనుష్‌ విడాకులు ఇచ్చాడో అప్పుడే అతనితో అనిరుధ్‌ తెగదెంపులు చేసుకున్నాడని ఇంకొందరు చెబుతున్నారు.


ధనుష్‌ను ఎంతో అభిమానించే అనిరుధ్‌, అలానే అనిరుధ్‌ టాలెంట్‌ను ప్రపంచానికి తెలియచేసిన ధనుష్‌ ఇద్దరూ కలిసి చేసిన చివరి సినిమా 'తిరుచిత్రాంబలం'. ఇది తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఇది 2022లో విడుదలైంది. అదే సంవత్సరం ధనుష్‌ - ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ధనుష్‌ చిత్రాలకు ఎ.ఆర్. రెహమాన్, యువన్ శంకర్ రాజా, జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందించారు. అలానే త్వరలో విడుదల కాబోతున్న 'ఓం'కు సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తున్నాడు. కాబట్టి... వీరిద్దరూ నాలుగేళ్ళ క్రితమే ఎవరి దారులు వారు చూసుకుంటున్నారని, కాబట్టి ధనుష్‌ను అనిరుధ్‌ తన పెళ్ళికి పిలవలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమా రంగంలో పెళ్ళి చేసుకోవడం, స్నేహపూర్వకంగా విడాకులు తీసుకోవడం కామన్‌ కాబట్టి, మరి ఐశ్వర్యకు విడాకులు ఇచ్చాడనే కారణంగా ధనుష్‌ను దూరం పెట్టకుండా, అనిరుధ్‌ నవంబర్‌ 21న జరిగే వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు పిలుస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మోక్షజ్ఞ కంటే ముందే.. నందమూరి కుటుంబం నుంచి మరో సినీ ఎంట్రీ!

పుకార్లకు ఫుల్ స్టాప్.. గాడ్ ఆఫ్ వార్ ఆగలేదు

‘SI యుగంధర్’ దర్శకుడితో.. సుధాకర్ కోమాకుల కొత్త ప్రయోగం

Updated Date - Nov 13 , 2026 | 05:21 PM