Breaking: దర్శకుడు భారతీరాజా కన్నుమూత
ABN , Publish Date - Jun 10 , 2026 | 08:02 AM
ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (Bharathi Raja ) కన్నుమూశారు.
ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (Bharathi Raja ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సడన్‌గా జరిగిన ఈ ఘటనతో తమిళ, సినీ పరిశ్రమ షాక్‌లోకి వెళ్లిపోయింది. ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
అయితే గతేడాది కుమారుడు మనోజ్ హఠాన్మరణం చెందడం భారతీరాజాను తీవ్రంగా కలిచి వేసింది. ఆపై రెండు మూడు నెలల్లోనే ఆ ఆవేదనతో అనారోగ్యం బారిన పడిన ఆయన హాస్పిటల్‌లో నెల రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని మూడు నెలల క్రితమే ఇంటికి వచ్చి అక్కడే చికిత్స పొందుతున్నారు. సడన్‌గా ఈ రోజు ఉదయం సమస్య తీవ్రం కావడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇదిలా ఉంటే.. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన భారతీరాజా అధికంగా తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించగా తెలుగులో చాలావరకు రీమేక్ అయ్యాయి. అంతేగాక కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని చిత్రాలు స్ట్రెయిట్‌గా తెలుగులో తీసి ఇక్కడా అదే ఆదరణ దక్కించుకున్నారు. ఆయన శిష్యులు అనేకమంది దర్శకులుగా మారారు. వారిలో తెలుగు నుంచి సీనియర్ వంశీ వంటి వారు ఉన్నారు. రాధ, రాధిక, రేవతి, ముచ్చర్ల అరుణ, కార్తీక్ వంటి నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. నాటి వర్ణ వివక్షను ఎదురొడ్డి చిత్రసీమలో నిలిచిన భారతీరాజా అనతి కాలంలోనే దేశం గర్వించే దర్శకుడిగా ఎదిగారు. కొన్నాళ్ల క్రితం దర్శకత్వానికి రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆయన పలు చిత్రాల్లోనూ నటించారు. చివరగా మోహన్ లాల్ ‘తుడరుమ్’ చిత్రంలో నటించారు.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు