రజనీకాంత్ సినిమాను తిరస్కరిస్తోన్న స్టార్స్.. లిస్ట్‌లోకి మరో హీరో?
ABN, Publish Date - May 29 , 2026 | 11:42 PM
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జైలర్’. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), క్రేజీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జైలర్’ (Jailer). 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన విషయం విదితమే. దీంతో ఈ సినిమా సీక్వెల్ ‘జైలర్-2’ (Jailer 2) కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలు పోషించిన క్యామియో రోల్స్ కథకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో కూడా ఆ ఇద్దరి పాత్రలను కొనసాగిస్తూనే, అంతకు మించిన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యామియో పాత్రను నెల్సన్ ప్లాన్ చేశారు. అయితే ఈ స్పెషల్ క్యారెక్టర్ కోసం మేకర్స్ సంప్రదించిన పలువురు స్టార్ హీరోలు ‘నో’ చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పవర్‌ఫుల్ ఏపీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ మొదట గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను సంప్రదించారు. రజనీకాంత్‌తో ఉన్న పాత అనుబంధంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చిత్రయూనిట్ భావించింది. కానీ, ప్రస్తుతం ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ క్రేజీ కాంబో సెట్ కాలేదని ఫిలిం నగర్ టాక్. బాలకృష్ణ లాంటి మాస్ హీరో ఈ పాత్రలో కనిపిస్తే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని భావించిన అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశ కలిగించిందనే చెప్పాలి. బాలయ్య నో చెప్పిన తర్వాత చిత్ర బృందం బాలీవుడ్ ‘బాద్‌షా’ షారూఖ్ ఖాన్‌ను సంప్రదించింది. ‘జైలర్’ చిత్రానికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా షారూఖ్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై సానుకూలంగానే స్పందిస్తారని భావించారు. కానీ షారూఖ్ ఖాన్ తన రాబోయే చిత్రం ‘కింగ్’ షూటింగ్ షెడ్యూల్స్‌తో ఎంతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఆ సినిమా కోసం ఆయన ప్రత్యేకమైన లుక్ మార్పులు చేయాల్సి రావడం వల్ల, ఈ ఆఫర్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేకపోయారని సమాచారం.
బాలయ్య, షారూఖ్ ఖాన్‌లతో పాటు తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా ఈ పాత్ర కోసం పరిశీలించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న మాస్ ఇమేజ్ ఈ పోలీస్ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని మేకర్స్ భావించారు. కాకపోతే ఆయన ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రజాసేవ, రాజకీయ సమీక్షల వల్ల ఆయనకు సినిమాల కోసం సమయం కేటాయించడం అస్సలు కుదరలేదు. అలా ముగ్గురు అగ్ర హీరోలు ఈ భారీ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో, ఈ క్రేజీ క్యామియో కోసం మేకర్స్ ప్రస్తుతం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ను సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయట. ఒకవేళ హృతిక్ ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేస్తే దాదాపు 40 ఏళ్ల తర్వాత రజనీకాంత్, హృతిక్ రోషన్ ఒకే స్క్రీన్‌పై కనిపించినట్లవుతుంది. గతంలో 1986లో వచ్చిన ‘భగవాన్ దాదా’ చిత్రంలో రజనీకాంత్‌కు కొడుకుగా బాలనటుడి పాత్రలో హృతిక్ నటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారీ స్థాయిలో విడుదల కానున్న ‘జైలర్ 2’లో హృతిక్ ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్
అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!
NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?