ఎస్.జె. సూర్య ‘కిల్లర్’ షూటింగ్‌లో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి!
ABN , Publish Date - Jun 03 , 2026 | 10:38 AM
ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్.జె. సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కిల్లర్’ షూటింగ్ స్పాట్‌లో బుధవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్.జె. సూర్య (S J Suryah) నటిస్తున్న తాజా చిత్రం ‘కిల్లర్’ (Killer Movie) షూటింగ్ స్పాట్‌లో బుధవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నై పెరంబూర్‌లోని ప్రముఖ బిన్నీ మిల్ ప్రాంగణంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో షూటింగ్ అవసరాల కోసం అక్కడ ఉంచిన కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఆకస్మిక ప్రమాదం ధాటికి అక్కడికక్కడే 25 ఏళ్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ ఘోర ప్రమాదంతో సెట్స్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ సభ్యులు.. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అసలు ఈ సిలిండర్ పేలడానికి గల సాంకేతిక కారణాలు ఏంటి? ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కనురెప్పపాటులో జరిగిన ఈ ఘోర దుర్ఘటనతో ‘కిల్లర్’ చిత్ర యూనిట్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మల్టీ టాలెంటెడ్ ఎస్.జె. సూర్య మళ్లీ మెగాఫోన్ పట్టి, దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఆయనే హీరోగా నటిస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ (Sree Gokulam Movies), ఎస్.జె. సూర్య సొంత బ్యానర్ ఏంజెల్ స్టూడియోస్ (Angel Studios) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఇలాంటి విషాదం జరగడం ఇండస్ట్రీ వర్గాలను సైతం తీవ్రంగా కలచివేస్తోంది.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు
NBK 111: ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’.. సరికొత్త అవతారంలో బాలయ్య
Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ
Buchibabu Sana: పెద్ది.. ఎన్టీఆర్ కి చెప్పిన కథ కాదు