Scam: సన్నీ లియోన్ సహా కష్టాల్లో కన్నడ తారలు!
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:01 PM
కర్ణాటకకు చెందిన శివం అసోసియేట్స్ రెండు వేల కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు సీఐడీ అధికారులు పసిగట్టారు. ఈ మొత్తంలో కొంత భాగాన్ని సినిమా నిర్మాణానికి, సినిమా తారలకు వినియోగించినట్టు తెలియడంతో నటీనటులకు నోటీసులు పంపే పనిలో అధికారులు ఉన్నారట.
సినిమా స్టార్స్‌కు ఎప్పుడు ఏ వైపు నుంచి ఉపద్రవం వస్తుందో ఊహించడం కష్టం. వెలుగు జిలుగుల్లో నిత్యం గడిపే స్టార్స్ ఒక్కోసారి ఊహించని విధంగా చిక్కుల్లో పడతారు. ఒకప్పటి పోర్న్ స్టార్, ప్రస్తుత ఇండియన్ పాపులర్ యాక్ట్రస్ సన్నీ లియోన్‌తో పాటు మరికొందరు శాండిల్‌వుడ్ ప్రముఖులు ఓ నిర్మాణ సంస్థ కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు.
కర్ణాటకకు చెందిన శివం అసోసియేట్స్ అధినేత శివానంద నీలణ్ణవర్ చేసిన ఆర్థిక మోసాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 2, 400 రూపాయల భారీ స్కామ్ ఈ సంస్థ చేసిందని నేరపరిశోధన విభాగం అంచనా వేస్తోంది. అయితే ఈ స్కామ్‌లో తమకు తెలియకుండానే కన్నడ నటీనటులు చిక్కుకున్నారు. ఈ స్కామ్ గురించి సీఐడీ డీఐజీ భీమా శంకర్ గుళేద్ మీడియాకు వివరిస్తూ, 'శివం అసోసియేట్స్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏకంగా 40, 700 మంది ఖాతాదారుల నుంచి రెండు వేల కోట్లకు పైగా భారీ మొత్తాన్ని వసూలు చేసింద'ని తెలిపారు. అత్యధిక వడ్డీ ఆశ చూపించి, మదుపరుల నుంచి భారీ మొత్తాన్ని సేకరించి, అందులో అధిక భాగాన్ని షేర్ మార్కెట్ లో ఈ సంస్థ పెట్టిందని చెప్పారు. షేర్ మార్కెట్ లో రూ. 540 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, రూ. 170 కోట్ల నష్టం వచ్చిందని ప్రాధమిక అంచనా వేశారు అధికారులు. అలానే ఈ సంస్థ అధినేత శివానంద యాభై కోట్లకు పైగా మొత్తాన్ని తన సొంత ఖాతాలోకి మళ్ళించారట. ఈ సంస్థ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో సీఐడీ అధికారులు సంస్థ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. వాటిల్లో రూ. 330 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 660 కోట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదని అంటున్నారు.
శివం అసోసియేట్స్ సంస్థ మూడేళ్ళ క్రితం 'ఛాంపియన్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించింది. అందులో నటించిన వారికి భారీ పారితోషికాలు అందించింది. చిత్రం ఏమంటే... ఓ ప్రత్యేక గీతంలో నటించిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌కు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం లభించడంతో ఆమెకు అధికారులు నోటీసులు పంపించారట. అంతే కాకుండా గత డిసెంబర్‌లో ఈ సంస్థ కన్నడ సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించింది. దానిలో పాల్గొన్న పలువురు సినిమా తారలకు కూడా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. 'డాలీ' ధనుంజయ్, వశిష్ఠ సింహా, సప్తమీ గౌడ, రాగిణీ ద్వివేదీ వంటి వారికీ అధికారులు నోటీసులు జారీ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ఎంత పారితోషికం తీసుకున్నారు, ఏ రూపంలో రెమ్యూనరేషన్ అందుకున్నారు? అనే అంశాలపై ఆరా తీయబోతున్నారట. నిరుపేదలకు అధిక వడ్డీ ఆశ చూపించి వసూలు చేసిన డబ్బులను ఇలా విలాసాలకు శివం అసోసియేట్స్ ఖర్చు చేయడం దారుణమని కొందరంటున్నారు. మొత్తం మీద శివం అసోసియేట్స్ చేసిన ఈ స్కామ్ తో శాండిల్‌వుడ్ తారలు ఉలిక్కిపడుతున్నారు. ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో తెలియక తేలు కుట్టిన దొంగల మాదిరి వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Jaya bachchan: అంతా అయిపోయాక మాట్లాడి ప్రయోజనం ఏంటి?
Taapsee: వయసు పెరిగేది మాకేనా.. హీరోలకు పెరగదా?
Puri Jagannadh: నా తొలి.. తమిళ సినిమా స్లమ్‌డాగ్