Jailer 2: ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఫస్టాఫ్ ప్రీక్వెల్, సెకండాఫ్ సీక్వెల్!
ABN, Publish Date - May 15 , 2026 | 09:31 PM
‘జైలర్’ మొదటి భాగంలో రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ తనదైన నటనతో అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌కు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఇప్పటివరకూ 171 సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే తన కెరీర్‌లో ‘బాషా, నరసింహ, చంద్రముఖి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సీక్వెల్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ, తలైవా వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. రజనీకాంత్ శైలిలో ఫ్రాంచైజీలు చేయడం అన్నది అరుదైన విషయం అని చాలామందికి ఎరుకే. అయితే, ఈ ఆనవాయితీని బ్రేక్ చేస్తూ 2010లో వచ్చిన ‘రోబో’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘2.0’లో ఆయన మొదటిసారి నటించారు. ఇప్పుడు తన కెరీర్‌లో రెండో సీక్వెల్‌గా ‘జైలర్’ (Jailer) చిత్రానికి సిద్ధమవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ వినిపించిన అద్భుతమైన కథే రజనీకాంత్‌ను ఈ ప్రాజెక్టు వైపు అడుగులు వేయించిందని సమాచారం.
‘జైలర్’ మొదటి భాగంలో రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ తనదైన నటనతో అలరించారు. ఒక సాధారణ తాతలా కనిపిస్తూనే, తన కుటుంబం కోసం ఒక భయంకరమైన మాఫియా సామ్రాజ్యాన్ని ముత్తువేల్ ఎలా గడగడలాడించాడనే అంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘రోబో’ తర్వాత రజనీ నటిస్తున్న రెండో ఫ్రాంచైజీ కావడంతో ‘జైలర్ 2’ (Jailer 2) పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండో భాగం స్క్రిప్ట్‌ను నెల్సన్ కుమార్ చాలా విభిన్నంగా సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో యాక్షన్, ఎమోషన్ ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ చిత్రంలో కథా గమనం చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది. ముత్తువేల్ పాండియన్ రిటైర్ కాకముందు, ఆయన జీవితం ఎలా ఉండేదనే కోణాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు. సినిమా ప్రథమార్థమంతా ఆన్ డ్యూటీ జైలర్‌గా రజనీకాంత్ కనిపిస్తారట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ‘జైలర్’కు ప్రీక్వెల్‌గా సాగుతుంది. ఇక ద్వితీయార్థం మాత్రం కథ మళ్ళీ ప్రస్తుత కాలానికి వచ్చి సీక్వెల్‌గా మారుతుంది. గతంలో ‘2.0’ చిత్రంలో టెక్నాలజీతో మ్యాజిక్ చేసిన రజనీ, ఇప్పుడు ముత్తువేల్ పాండియన్ గతాన్ని తన మార్క్ మేనరిజమ్స్‌తో ఎలా పండిస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రను మలిచిన తీరు, ఆయనపై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 4న ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, మిథున్ చక్రవర్తితో పాటు విజయ్ సేతుపతి వంటి హేమాహేమీలు ప్రత్యేక పాత్రల్లో కనిపించి అలరించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మరోసారి రజనీ మేనియాను పీక్స్‌కు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ‘రోబో’ తర్వాత రజనీకాంత్ చేస్తున్న ఈ రెండో సీక్వెల్ ప్రయత్నం ఏ మేరకు సంచలనం సృష్టిస్తుందో అని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇవి కూడా చదవండి:
మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!
Varanasi: ‘వారణాసి’ కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్!
Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!
నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!