ట్యూన్స్‌తో జీవీ కనికట్టు

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:27 PM

టాలీవుడ్‌లో మ్యూజిక్ వార్ నడుస్తోంది. దేవిశ్రీ , తమన్, అనిరుధ్ కు షాక్ ఇస్తూ వరుస అవకాశాలను అందుకున్నారు జీవీ ప్రకాశ్. నటనలోనూ బిజీగా ఉన్న జీవీ సంగీతంతోనూ అదరహో అనిపిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్, తమన్ తెలుగువారైనా తమిళంలోనూ తమ బాణీలతో భళా అనిపిస్తున్నారు. ఇక తమిళులైన జీవీ ప్రకాశ్ కుమార్, అనిరుధ్ రవిచందర్ తెలుగులోనూ బిజీగా సాగుతున్నారు. ఈ నలుగురు బాణీలతోనే కాదు తమ నటన, డాన్సులతోనూ మురిపిస్తూ ఉంటారు. వీరిలో అనిరుధ్ రవిచందర్ ఆల్ ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న మ్యూజిక్ డైరెక్టర్ గా సాగుతున్నారు. ఈయన తన డాన్స్ తోనే కొత్త పాటలను రిలీజ్ చేసి అలరిస్తూ ఉంటారు. ఇక తెలుగునాట టాపు రేపుతున్న తమన్ ఒకప్పుడు నటునిగానే సాగారు. ఇప్పుడు 'యెల్లమ్మ' సినిమాతో దేవిశ్రీ హీరో అవుతున్నారు. అయితే ఈ నలుగురిలో అందరికన్నా మిన్నగా జీవీ ప్రకాశ్ కుమార్ పయనిస్తున్నారని చెప్పవచ్చు. ఒకవైపు నటునిగా, నిర్మాతగా బిజీగా ఉంటూనే మరోవైపు ట్యూన్స్ తో సందడి చేస్తున్నారు జీవీ ప్రకాశ్ కుమార్. ఇప్పుడు తెలుగునాట ఎక్కడ చూసినా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం వినిపిస్తూ ఉండడంతో అందరూ ఆయన వైపే చూస్తున్నారు. నటశేఖర కృష్ణ మనవడు, మహేశ్ బాబు అన్న రమేశ్ తనయుడు జయకృష్ణ హీరోగా రూపొందిన 'శ్రీనివాస మంగాపురం'కు జీవీ కట్టిన బాణీలు జనాన్ని కట్టిపడేస్తున్నాయి. అలా జీవీ ట్యూన్స్ తెలుగునాట సందడి చేస్తున్నాయి. ఈ చిత్రం జూలై 9వ తేదీన విడుదల కానుంది.


నిజానికి జీవీ ప్రకాశ్ కుమార్ చేతిలో నాలుగు తెలుగు చిత్రాలు, నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. తమన్ ఆరు తెలుగు చిత్రాలు, రెండు తమిళ సినిమాలతో సాగుతున్నారు. సంగీతంలో జీవీకే, తమన్ సమానంగా ఉన్నారన్నమాట. తెలుగులో తమన్ కు దీటుగా సాగుతున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ యేడాది కేవలం రెండు సినిమాలకే స్వరకల్పన చేశారు. అవి 'ఉస్తాద్ భగత్ సింగ్', 'సింగ్ గీతం' - ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా అలరించలేక పోయాయి. ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతంతో తెరకెక్కిన 'జననాయగన్' రిలీజ్ కావలసి ఉంది. అనిరుధ్ అంగీకరించిన చిత్రాలన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. రజనీకాంత్ 'జైలర్-2'కు, కమల్ హాసన్, రజనీకాంత్ కలసి నటించబోయే చిత్రానికి కూడా అనిరుధ్ బాణీలు కడుతున్నారు. తెలుగులో అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ కు, నాని 'ద ప్యారడైజ్'కు కూడా అనిరుధ్ స్వరకల్పన చేయనున్నారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే 'మ్యాజిక్' సినిమా సైతం అనిరుధ్ ట్యూన్స్ తోనే తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రాలలో ఏవి ఎప్పుడు ప్రేక్షకులను పలకరిస్తాయో తెలియడం లేదు.

జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకల్పనలో రూపొందుతోన్న దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార', సూర్య హీరోగా సూర్యదేవర నాగవంశీ తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్', రవితేజ హీరోగా రూపొందుతోన్న 'ఇరుముడి' చిత్రాలు రానున్నాయి. ఇవన్నీ ఈ యేడాదే వెలుగు చూస్తాయని తెలుస్తోంది. వీటన్నిటి కన్నా ముందు 'శ్రీనివాస మంగాపురం' విడుదల కానుంది. అలా ఈ యేడాదే నాలుగు చిత్రాలతో జీవీ ప్రకాశ్ తెలుగునాట సందడి చేయనున్నారు. ఇక వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే సినిమాకు కూడా జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకల్పన చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే సంక్రాంతి సంబరాల్లో పాల్గొననుంది. ఓ వైపు నటనిర్మాతగా బిజీగా ఉన్నా, మ్యూజిక్ తోనూ మురిపిస్తున్నారు జీవీ. అందువల్ల దేవిశ్రీ, తమన్, అనిరుధ్ కన్నా మిన్నగా టాలీవుడ్ జనాలు జీవీ ట్యూన్స్ ను కీర్తిస్తున్నారు. ఈ మూవీస్ లో ఏది సక్సెస్ సాధించినా మళ్ళీ జీవీ బాణీల కోసం తెలుగు జనం పరుగులు తీసే అవకాశం ఉంది. ఏమవుతుందో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

నా భర్త నుంచి ప్రాణహాని: నటుడి మొదటి భార్య

NBK111: కళ్లజోడు పెట్టిన కాజల్.. బాలయ్య మూవీలో లుక్ వచ్చేసింది

‘మకుటం’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. అందుకే ఆలస్యమైంది!

Updated Date - Jun 19 , 2026 | 05:28 PM