సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తమిళ స్టార్స్ కొత్త పార్టీలు.. ఇక‌ మిగిలింది వారే!

ABN, Publish Date - Oct 11 , 2026 | 09:04 PM

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ విజయంతో సినీ తారల రాజకీయ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. ధనుష్, శివకార్తికేయన్ రాజకీయాలపై వస్తున్న వార్తలు, ఎంజీఆర్ నుంచి విజయ్ వరకు సినీ ప్రముఖుల రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

vijay dhanush siva

తమిళనాట బై-ఎలక్షన్ జరిగిన రెండు చోట్ల విజయ్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దాంతో సినీ స్టార్స్ పాలిటిక్స్ పై తమిళ జనం మళ్ళీ విశేషంగా డిస్కస్ చేసుకుంటున్నారు. ధనుష్, శివకార్తికేయన్ కూడా పొలిటికల్ పార్టీస్ పెడుతున్నారని టాక్. అసలు తమిళ నేలపై సినీజనం పాలిటిక్స్ సందడి ఎలా సాగిందో చూద్దాం.

చిగురించిన ఆశలు.

భూప్రపంచంలో మనదేశంలోనే కాదు అమెరికా, ఈస్టరన్ యూరప్ దేశాల్లోనూ సినిమా యాక్టర్స్ పాలిటిక్స్ లో రాణించారు. అయితే సంఖ్యాపరంగా తీసుకుంటే మన దేశంలోనే అత్యధికులు సినిమా రంగం నుండి రాజకీయాల్లో ప్రవేశించారు. అందునా తమిళనాడులో పలువురు స్టార్స్ సొంత పార్టీలు పెట్టి మరీ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. దాదాపు అరవై ఏళ్ళ నుంచీ తమిళనాడులో (Tamil Politics) అధికారం చెలాయిస్తున్నది సినిమా జనానికి సంబంధించిన పార్టీలే కావడం గమనార్హం.

తాజాగా స్టార్ హీరో విజయ్ (Vijay) ఈ యేడాదే తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. విజయ్ కి పూర్తి మెజారిటీ లేకపోయినా, గెలుపొందిన పార్టీల్లో అత్యధిక సీట్లు సంపాదించిన కారణంగా ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. దాంతో ఇతర తమిళ స్టార్స్ లోనూ రాజకీయరంగంపై ఆశలు చిగురించాయని తెలుస్తోంది. ధనుష్ (Dhanush), శివకార్తికేయన్ (Sivakarthikeyan) వంటి వారు కూడా సొంత పార్టీలు పెట్టబోతున్నారని సమాచారం.

అయితే.. ఇదంతా చూస్తుంటూ విక్ర‌మ్‌, విజ‌య్ సేతుప‌తి, సూర్య‌, కార్తీలు మాత్ర‌మే ఇక పార్టీలు పెట్ట‌డంలో బ్యాలెన్స్ ఉన్నట్లు మ‌న‌కు ఇట్టే అర్థ‌మ‌వుతుంది. రానున్న కాలంలో వారు కూడా పార్టీలు పెడితే అధికారంలోకి రాక పోయినా స్టార్ హీరోలు అంద‌రికీ త‌మ‌కంటూ సొంత పార్టీలు ఉన్న‌ట్లు అవుతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

అభిమానుల భావన..

ధనుష్, శివకార్తికేయన్ తమ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇంకా స్పష్టం చేయలేదు. అయితే వారి అభిమానులు మాత్రం తప్పకుండా వారు రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు. అంతేకాదు, ధనుష్, శివకార్తికేయన్ పాలిటిక్స్ లోకి రావలసిందేననీ వారి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ధనుష్ 'తమిళగ ఎళుచి కళగమ్' అనే పార్టీని స్థాపించబోతున్నారని వినిపిస్తోంది. అందులో వాస్తవం లేదని ధనుష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ధనుష్ స్వయంగా తన పార్టీ గురించి పెదవి విప్పక పోయినా, ఆయన తన అభిమాన సంఘాలను జిల్లాల వారిగా సామాజిక సేవాసంఘాలుగా మార్చడం గమనార్హం. ఇక ఈ మధ్యే శివకార్తికేయన్ జనానికి చేతనైన సాయం చేయాలి అన్న సంకల్పంతో 'శివకార్తికేయన్ నర్పణి ఇయక్కమ్' అనే సంక్షేమ సంస్థను నెలకొల్పారు. ఈ సమావేశానికి జనం అధికసంఖ్యలో హాజరయ్యారు. దాంతో శివ కార్తికేయన్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సినీజనం పార్టీలదే అధికారం...

తమిళనాడులో సినిమావాళ్ళు అధికారం చేపట్టడం అనేది 1967లో మొదలయింది.. ప్రముఖ సినిమా స్టోరీ రైటర్ అన్నాదురై 1967లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అన్నాదురై, కరుణానిధి, ఎమ్జీఆర్ (MGR) 'డీయమ్కే పార్టీ'ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్ళారు. అన్నాదురై మరణానంతరం ప్రముఖ సినీ రైటర్ కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. డీయమ్కే నుండి విడిపోయి 'అన్నా డి.యమ్.కె. పార్టీ' పెట్టి ఎమ్జీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఎమ్జీఆర్ మరణం తరువాత ఆయన భార్య జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె కూడా ఒకప్పటి నటి కావడం విశేషం.

ఆపై 'అన్నా డి.యమ్.కె. పార్టీ' పగ్గాలను అందాల తార జయలలిత చేపట్టారు. నాలుగు సార్లు తమిళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారామె. అదే తీరున కరుణానిధి కూడా సాగారు. జయలలిత తరువాత ఆమె సహచరులు ముఖ్యమంత్రులు అయినా, వారిదీ అన్నా డియమ్కే పార్టీనే. మొన్నటి దాకా కరుణానిధి తనయుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం'ను ఈ యేడాదే సక్సెస్ రూటులో సాగేలా చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా అరవై ఏళ్ళ నుంచీ తమిళనాట సినీజనానికి సంబంధించిన పార్టీలే రాజ్యమేలుతున్నాయి.

తమిళస్టార్స్ తీరే వేరు...

తెలుగునాట నటరత్న యన్టీఆర్, ఆయన తనయుడు హరికృష్ణ, తరువాత చిరంజీవి, ఆ పై ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వంటి వారు మాత్రమే సొంత పార్టీలు పెట్టారు... వీరిలో ఒకే ఒక యన్టీఆర్ 'తెలుగుదేశం పార్టీ' ఏర్పాటు చేసిన తొమ్మిది నెలలకే ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. మిగిలినవారు ఏదో ఒక విధంగా అధికారం అనుభవించారు. అయితే తమిళనాట అలా కాదు ఎమ్జీఆర్ తో బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డ శివాజీగణేశన్ తరువాతి రోజుల్లో 'తమిళగ మున్నేట్ర మున్నాని' అనే పార్టీని పెట్టారు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు.

తరువాతి రోజుల్లో సూపర్ స్టార్ గా రాణించిన రజనీకాంత్ (Rajinikanth) ఫ్యాన్స్ ఆయనను రాజకీయాల్లో చూడాలని ఆశించారు. అందుకోసం 'రజనీ మక్కల్ మండ్రమ్' అనే పార్టీ పేరునూ ప్రకటించారు. రజనీకాంత్ కూడా అదుగో ఇదుగో అంటూనే ఊరిస్తూ చివరకు తన ఆరోగ్యం సహకరించడం లేదని తప్పుకున్నారు. రజనీతో ఢీ కొట్టిన కమల్ హాసన్ (Kamal Haasan) మాత్రం ధైర్యంగా 'మక్కల్ నీది మయమ్' అనే పార్టీని పెట్టి పోటీకి దిగారు. ఆయన కూడా తన అభిమాననటుడు శివాజీగణేశన్ లాగే ఒక్క సీటూ గెలవలేకపోయారు. ప్రస్తుతం డి.యమ్.కె. సిఫారసుపై రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

పాలిటిక్స్ లో మరికొందరు...

రజనీకాంత్, కమల్ హాసన్ కంటే ముందు విజయ్ కాంత్ 'దేశీయ మార్పోక్కు ద్రవిడ కళగం' పార్టీని పెట్టి తాను గెలిచారు. ఆ పై అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగానూ సాగారు. తరువాత శరత్ కుమార్ 'ఆల్ ఇండియా సమదువ మక్కళ్ కచ్చి' అనే పార్టీని స్థాపించారు. శరత్ కుమార్ కూడా ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత డి.యమ్.కె. మద్దతుతో రాజ్యసభకూ వెళ్ళారు. చిత్రసీమలో పలు శాఖల్లో రాణించి అలరించిన టి.రాజేందర్ 'ఆల్ ఇండియా లచ్చియ ద్రవిడ మున్నేట్ర కళగమ్' పార్టీని పెట్టారు. ఆ పార్టీ సక్సెస్ సాధించలేకపోయింది. తమిళనటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా పలుమార్లు పార్టీలు పెట్టారు కానీ, ఏ నాడూ విజయం సాధించలేకపోయారు...

వాళ్ళిద్దరిలా.. ఎవరు?

హీరో కార్తిక్ 'అహిల ఇండియా నాదలుమ్ మక్కల్ కచ్చి' అనే పార్టీని పెట్టారు. కె.భాగ్యరాజా 'ఎమ్జీఆర్ మక్కల్ మున్నేట్ర కళగమ్' అనే పార్టీతో వచ్చారు. తమిళ సినీ ప్రముఖులు సీమాన్ 'నామ్ తమిళర్ కచ్చి', కరుణాస్ 'ముక్కులదోర్ పులిప్పడై' పార్టీలతో వచ్చారు. కానీ ఎవరూ సొంత పార్టీలతో విజయాలు చూడలేకపోయారు. ఇలా తమిళనాడులో సినీజనం అందరికన్నా మిన్నగా రాజకీయాల్లో రాణించాలని తహతహలాడుతూ కనిపించారు. ఈ యేడాది పాలిటిక్స్ లో విజయ్ కొత్త అధ్యాయం లిఖించగానే పలువురు తమిళ స్టార్ హీరోస్ లో రాజకీయాలపై ఆసక్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఎమ్జీఆర్, విజయ్ లాగా ఎవరు సొంత పార్టీలతో పాలిటిక్స్ లో రాణిస్తారో చూడాలి.

Updated Date - Oct 11 , 2026 | 10:09 PM