Z 5: మల్టీ లాంగ్వేజ్‌ కంటెంట్‌ లైనప్‌ ప్రకటించిన జీ5

ABN , Publish Date - Jul 29 , 2026 | 01:49 PM

నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్‌ రామ్, వెంకటేశ్‌, నాగచైతన్య చిత్రాలు త్వరలో జీ5లో దర్శనమివ్వబోతున్నాయి. అలానే వివిధ భాషల్లో ప్రసారం చేయనున్న వెబ్ సీరిస్, మూవీస్ గురించిన వివరాలనూ జీ5 తెలియచేసింది.

Z5 Movies and web series

అన్ని వర్గాల ప్రేక్షకులకు భిన్నమైన కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తున్న స్వదేశీ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ జీ5. ట్రెండ్ ఫాలో కావడం కాదు, ట్రెండ్‌ క్రియేట్‌ చేయడంలో మాకు మేమే సాటి అని ఆ బృందం చెబుతోంది. తాజాగా ఈ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మక మల్టీ లాంగ్వేజ్‌ కంటెంట్‌ లైనప్‌ను ప్రకటించింది. ఇందులో నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంతో పాటు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మరో సినిమా వెంకటేశ్‌, కళ్యాణ్‌ రామ్, అనిల్ రావిపూడి మూవీ కూడా జీ5లోనే స్ట్రీమింగ్‌ కానుంది. అలానే నాగచైతన్య తాజా చిత్రం 'వృషకర్మ' కూడా ఇందులోనే రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మరాఠీ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషలను కవర్ చేస్తూ పలు వెబ్ సీరిస్‌, మూవీస్‌, లైవ్ స్పోర్ట్స్, యానిమేషన్‌, ఏ.ఐ. బేస్డ్ స్టోరీస్‌ ను జీ5 వీక్షకులకు అందించబోతోంది. అలానే జగపతిబాబు నిర్వహించిన జయమ్ము నిశ్చయమ్మురా సీజన్‌ 2ను కూడా జీ5 త్వరలోనే ప్రారంభించనుంది.


హిందీ చిత్రాలను గ‌మ‌నిస్తే.. థియేట్రికల్ రిలీజ్‌లైన త‌ర్వాత స్ట్రీమింగ్ కాబోయే సినిమాల‌తో పాటు డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్‌ కాంబో కూడా కనిపిస్తోంది. హై జ‌వానీతో ఇష్క్ హోనా హై (వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మౌని రాయ్), బండార్ (బాబీ డియోల్, సాన్యా మల్హోత్రా), భార‌త్ భాగ్య విధాత (కంగనా రనౌత్), పూజా మేరీ జాన్ (మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషీ), స‌ర్వ్‌గుణ్ సంప‌న్న్‌ (వాణీ కపూర్), ఘ‌మాసాన్ (అర్షద్ వార్సీ, తిగ్మాంశు ధూలియా, ప్రతీక్ గాంధీ), ఇక్రూప్‌ (మిథిలా పాల్కర్, గౌహర్ ఖాన్), ద‌లింప్‌ (జితేంద్ర కుమార్, ప్రియా బాపట్) వంటి ప్రాజెక్స్ వీక్షకుల ముందుకు రానున్నాయి.

తమిళంలో 'కూసే మునిసామి వీర‌ప్పన్', 'త‌డ‌యమ్ 2' మ‌ళ్లీ వ‌స్తుండ‌గా కొత్త ఒరిజినల్స్‌గా 'అనంత‌కాల‌మ్‌, మొదటి ఇండిపెండెంట్ రాప్ బ్యాటిల్ షోగా 'తీ కుర‌ల్' రానున్నాయి. సినిమాల విష‌యానికి వ‌స్తే 'డీ మాంటే కాల‌నీ3, హాయ్‌ (న‌య‌న‌తార‌, క‌విన్‌), రావాడి' వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. అలానే కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ పలు వెబ్ సీరిస్, సినిమాలు జీ5లో సందడి చేయనున్నాయి.


ఈ సంద‌ర్భంగా జీ5 ఇండియా బిజినెస్ హెడ్ తేజ్‌కరన్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ, 'మేం చెప్పే ప్రతి కథ ఒక సింపుల్ ఫిలాసఫీపై ఆధారపడి ఉంటుంది. విభిన్నమైన ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడం, ప్రేక్షకులు ఎక్కడా చూడని అనుభవాలను సృష్టించాలనే ఆలోచ‌న‌తో ముందుకు సాగుతున్నాం. ఈ కంటెంట్ లైనప్ మా ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద స్టేట్‌మెంట్. ఇందులో భారతదేశంలోని అగ్ర దర్శకులు, నిర్మాణ సంస్థలు, నటీనటులు కలిసి సినిమాలు, సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, ఎ.ఐ. ఆధారిత కథనాలు, అనిమేషన్, పిల్లల కంటెంట్‌ను ఏడు భాషల్లో అందిస్తున్నారు. అయితే ఇది మా మార్పులో ఒక భాగమే. కంటెంట్‌ను బలోపేతం చేయడమే కాకుండా, మరింత స్మార్ట్ టెక్నాలజీ, మెరుగైన ప్రొడక్ట్‌తో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా మేం నిర్మిస్తున్నాం. భారతీయ ప్రేక్షకుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా సేవలందించడం మా లక్ష్యం. ఈ లైనప్ కేవలం టైటిల్స్ జాబితా మాత్రమే కాదు. ఇది భారతదేశంలోనే అత్యంత ఇష్టపడే స్వదేశీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌గా ఎదగాలనే మా ల‌క్ష్యానికి ప్రతిబింబం' అని తెలిపారు.

జీ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్సూర్ మాట్లాడుతూ, 'మా దృష్టిలో గొప్ప కంటెంట్ అంటే ఎక్కువ సంఖ్యలో ఉండటం కాదు, ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అయ్యే కథలను ముందుకు తీసుకు రావటమే. ఈరోజుల్లో భారతీయ ప్రేక్షకులు భాష, జోనర్, ఫార్మెట్స్‌ను చూడ‌కుండా వైవిధ్యమైన కంటెంట్‌ను చూడ‌టానికి ఇష్టప‌డుతున్నారు. ఆ మార్పును దృష్టిలో పెట్టుకుని మా కంటెంట్ స్ట్రాటజీ రూపొందించబడింది. మేం సృష్టించే, ఎంపిక చేసే ప్రతి కంటెంట్‌లో ప్రేక్షకుల విభిన్న అవసరాలను తీర్చే కథలను ఈ లైనప్‌లో కలిపాం. డిఫ‌రెంట్‌గా, తమ స్వరాన్ని ధైర్యంగా వ్యక్తపరిచే, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి ఉన్న కథలను ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. అదే జీ5 గుర్తింపుగా నిలవాలని మేం కోరుకుంటున్నాం' అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్‌సింగ్’ టీమ్ స్పందనిదే

PelliChoopulu: విజయ్ దేవరకొండ విజయ విహారానికి పదేళ్ళు!

‘ఆదర్శ కుటుంబం’.. సంపూర్ణగా యువినా పార్థవి

Updated Date - Jul 29 , 2026 | 02:03 PM