సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Veerabharuni Rahasyam Review: ఆసక్తికరంగా 'వీరభద్రుని రహస్యం' వెబ్ సీరిస్

ABN, Publish Date - Jul 05 , 2026 | 07:02 PM

రఘు కుంచె, అనూరాధ, అనీ, అభినవ్, రఘు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సీరిస్ 'వీరభద్రుని రహస్యం'. ఈ డివోషనల్ మిస్టరీ వెబ్ సీరిస్ ను భీమగాని శ్రీవర్థన్ రెడ్డి డైరెక్ట్ చేశారు. జీ 5లో వారం వారం కొత్త ఎపిసోడ్స్ తో ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్‌ అవుతోంది.

Veerabhadruni Rahasyam

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ వినోదాన్ని పంచే విషయంలో కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. ఇప్పటి వరకూ వెబ్ సీరిస్ అంటే తొలి సీజన్ లో ఆరు నుంచి ఎనిమిది ఎపిసోడ్స్ లో కొత్త కథను చూపించి, ఆ తర్వాత మిగిలిన కథ కోసం సీజన్ 2కై ఎదురుచూడమని చెప్పేవి. కానీ ఇప్పుడు ఆ పద్థతి మారింది. యాభై నుండి వంద ఎపిసోడ్స్ వరకూ ప్లాన్ చేసుకుని, ప్రతివారం ఐదు, ఆరు ఎపిసోడ్స్ ను అందించడం ఓ రివాజుగా మారుతోంది. ఇతర భాషల్లో కొంత కాలంగా సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగులోనూ బాగానే నడుస్తోంది. అలా రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్ 'వీరభద్రుని రహస్యం'. ప్రస్తుతం జీ 5లో ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. మొత్తం 60 ఎపిసోడ్స్ ఉండే 'వీరభద్రుని రహస్యం' వారం వారం కొత్త ఎపిసోడ్స్ లో సాగబోతోంది.

ఇదో డివోషనల్ మిస్టరీ వెబ్ సీరిస్. కథ విషయానికి వస్తే.. తరతరాలుగా వీరభద్రపురం గ్రామ ప్రజలు తమ గ్రామ దైవం వీరభద్ర స్వామి అండలో జీవిస్తుంటారు. గ్రామాన్ని కాపాడే ఆ దేవుడు అదే గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడని గాఢంగా నమ్ముతుంటారు. ఆ ఆలయంలోని పవిత్ర గంట మోగినప్పుడల్లా ఆలయ పరిసరాల్లో ఓ మృతదేహం కనిపిస్తుంది. మూఢనమ్మకాలతో నిండిన వింత ప్ర‌పంచ‌లాంటి వీర‌భ‌ద్ర‌పురంకు సిటీ నుంచి ధైర్యమైన, విష‌యాన్ని తార్కికంగా ఆలోచించే డాక్టర్ వెన్నెల ( అనీ ) అడుగుపెడుతుంది. ఆమె వ‌చ్చిన స‌మ‌యంలో గ్రామంలో ఓ యువకుడు దారుణంగా హత్యకు గుర‌వుతాడు. అయితే అక్క‌డి ప్ర‌జ‌లు దాన్ని దైవ శిక్షగా భావిస్తారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి సైతం వెనకాడతారు. కానీ వెన్నెల మాత్రం వారి అంధ విశ్వాసాన్నిఒప్పుకోదు. నిజాన్ని వెలికితీయామని పోలీసులను కోరుతుంది. ఆమె సంకల్పం గ్రామాన్ని కుదిపేస్తుంది, శతాబ్దాలుగా ఉన్న నమ్మకాల్ని సవాలు చేస్తుంది, గతాన్ని దాచిపెట్టాలని చూసే శ‌క్తివంతులైన వ్య‌క్తుల‌తో ఆమె పోరాటాన్ని ప్రారంభిస్తుంది.


గ్రామ పెద్ద యోగానంద (రఘు కుంచె) ఇంటిలోనే అతిథిగా దిగిన వెన్నెల చేసే పనిని వారు కూడా హర్షించలేకపోతారు. దశాబ్దాలుగా గ్రామంలోని ఆచారాలను, నమ్మకాలను ఆమె ప్రశ్నిస్తే సహించలేకపోతారు. అయితే గ్రామ యువకుడి మరణం వెనుక వీరభద్రుడు లేడని, ఆ ఊరిని దోచుకున్న దోపిడీ ముఠా హస్తం ఉందని పోలీస్ ఎంక్వయిరీలో తెలుతుంది. దాంతో ఆ యువకుడిని గడ్డల గుట్టపైన అనాధ శవంలా పడేయకుండా దహన సంస్కారాలు చేస్తారు. వెన్నెల ఆగమనంతో వీరభద్రపురంలోని చీకట్లు నిదానంగా ఎలా తొలగిపోయాయనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడాల్సి ఉంది. అయితే చిన్నప్పుడే తమని విడిచి వెళ్ళిపోయిన తండ్రి వెతుక్కుంటూ వీరభద్రపురంకు వచ్చిన వెన్నెల ఆయన్ని కలుసుకోగలిగిందా? గ్రామ ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్థమనే యోగానంద గతం ఏమిటీ? వడ్డీ వ్యాపారంతో కోట్లు గడించిన అతని తల్లి నాంచారి ఎలా కన్నుమూసింది? ఆమె మనవడు కార్తికేయకు కనిపించిన వీరభద్రుడు అసలు ఎవరు? గ్రామస్తుల మరణాల వెనుక మిస్టరీ ఏమిటీ? అనేది తెలియాల్సి ఉంది. ఏకంగా అరవై ఎపిసోడ్స్ ను మేకర్స్ ప్లాన్ చేశారు కాబట్టి ఒక్కో నిజం నిదానంగా బయటపడే ఆస్కారం ఉంది. ప్రస్తుతానికైతే తర్వాత కథలో ఏం జరుగుతోందనే ఆసక్తిని మాత్రం కలిగించారు. అది అరవై ఎపిసోడ్స్ వరకూ నిలుపుకుంటారా? అనేది పెద్ద సందేహమే. అయితే... ప్రతి ఎపిసోడ్ లోనూ 1972లో జరిగిన కథను కొంత చూపించి, ఆ తర్వాత 1992లో జరిగిన కథను చూపుతున్నారు. అప్పుడు జరిగిన సంఘటనల పర్యవసానాన్ని ఇరవై ఏళ్ళ తర్వాత కథలో చూపడం బాగుంది.

దర్శకుడు భీమగాని శ్రీ వర్థన్ రెడ్డి నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి చక్కని నటన, పనితనం రాబట్టుకున్నాడు. బాల తారగా పలు చిత్రాలలో చక్కని నటన ప్రదర్శించిన అనీ ఇందులో వెన్నెల పాత్రకు పూర్తి న్యాయం చేస్తోంది. రఘు కుంచె, రఘు, అభినవ్, కమల్, శిరీష, అనురాధ, బిందు చంద్రమౌళి, 'బస్ స్టాప్' కోటేశ్వరరావు, 'ఛత్రపతి' శేఖర్, మాస్టర్ హార్విన్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఒకప్పటి నృత్యతార అనూరాధ ఇందులో తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రను పోషించింది. క్రియేటివ్‌ టీమ్‌లో ప్రధానం చెప్పుకోవాల్సింది సుభాష్‌ సినిమాటోగ్రఫీ గురించి. ప్రతి ఫ్రేమ్‌ను వీలైనంత భిన్నంగా చూపించే ప్రయత్నం ఆయన బృందం చేసింది. అలానే సుధా శ్రీనివాస్ నేపథ్య సంగీతం బాగుంది. కథ 1992 నాటిదే అయినా అంజన్ మేగోటి రాసిన సంభాషణలు బాగున్నాయి. అవకాశం ఉన్నచోటల్లా అలతి అలతి పదాలతో అర్థవంతమైన మాటలు రాశారు. జీ 5లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్ సీరిస్ ను కుటుంబంతో కలిసి ప్రతి వీకెండ్‌లో హాయిగా చూడొచ్చు. మూఢ భక్తిని అడ్డం పెట్టుకుని చేసే మోసాలను, వాస్తవాన్ని గ్రహించి మసులుకోవాల్సిన అవసరాలను ఈ వెబ్ సీరిస్ ద్వారా చూపుతున్న మేకర్స్ ను అభినందించాలి.

ఇవి కూడా చదవండి:

ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్

ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో ‘గాడ్ ఆఫ్ వార్’

ప్రభాస్‌తో ‘ధురంధర్’ దర్శకుడి మూవీ.. అధికారిక ప్రకటన ఆరోజేనా!

Updated Date - Jul 05 , 2026 | 07:03 PM