‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం.. అక్టోబర్‌లోనూ డౌటే!
ABN, Publish Date - Oct 03 , 2026 | 12:03 PM
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా.. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సందడి చేసిన భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఓటీటీ రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు.
‘కెజియఫ్ 2’తో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash).. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సందడి చేసిన భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale for Grown-Ups). గీతూ మోహన్‌దాస్ (Geethu Mohandas) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం నటించింది. అయితే థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (Toxic OTT) కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్టోబర్ లిస్ట్‌లోనూ లేదు!
వాస్తవానికి థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే ‘టాక్సిక్’ ఓటీటీలోకి వచ్చేస్తుందని అంతా భావించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు, సెప్టెంబర్ చివరి వారంలోనే స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని జోరుగా ప్రచారం జరిగింది. తీరా చూస్తే సెప్టెంబర్‌లో ఈ సినిమా రాలేదు. తాజాగా విడుదలైన జీ5 అక్టోబర్ స్ట్రీమింగ్ క్యాలెండర్‌లోనూ ‘టాక్సిక్’ పేరు కనిపించకపోవడం గమనార్హం. దసరా, దీపావళి పండుగల సీజన్‌లో అయినా ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇస్తుందేమోనని ఆశపడ్డ సినీ లవర్స్‌కు నిరాశ తప్పడం లేదు. ప్రస్తుతానికి ఈ చిత్ర ఓటీటీ విడుదలపై అటు మేకర్స్ నుంచి గానీ, ఇటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
‘టాక్సిక్’ ఆలస్యానికి కారణమేంటి?
క్రైమ్, యాక్షన్, డార్క్ గ్యాంగ్‌స్టర్ అంశాలతో రవి బస్రూర్ సంగీతం, భారీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఎందుకు బ్రేకులు పడ్డాయనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇతర భాషల డబ్బింగ్ హక్కుల సర్దుబాట్లు, ఓటీటీ సంస్థతో నెలకొన్న సాంకేతిక చర్చలు లేదా ఫెస్టివల్ వీక్ స్పెషల్‌గా.. సడెన్‌గా ఏదైనా కొత్త తేదీని ప్రకటించే ఆలోచనలో ఉన్నారా! అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో మిస్సయిన వారు ఇంట్లోనే హోమ్ థియేటర్లలో ఈ యాక్షన్ డ్రామాను వీక్షించేందుకు తహతహలాడుతుండగా.. రాకింగ్ స్టార్ ఫ్యాన్స్‌కు మాత్రం అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ వెయిటింగ్ తప్పేలా లేదు.
ఇవి కూడా చదవండి:
స్మిత్ మచ్చార్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం: చిరంజీవి
పబ్లిగ్గా బుగ్గగిల్లిన ఆకతాయి.. షాకైన హీరోయిన్.. వీడియో వైరల్
8 వారాల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా: డిస్ట్రిబ్యూటర్ల తీర్మానం