సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prakash Raj: సెప్టెంబర్ 4 నుంచి 'జగమే సంగీతం'

ABN, Publish Date - Aug 20 , 2026 | 01:12 PM

ఈ యేడాది 'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమాతో నిర్మాతగా చక్కని విజయాన్ని అందుకున్న సుస్మిత కొణిదెల తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం 'జగమే సంగీతం' వెబ్ సీరిస్ నిర్మించారు.

Jagame Sangeetham

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా మరో వెబ్ సీరిస్ రాబోతోంది. గతంలో ఆమె 'షూట్‌ అవుట్ ఎట్ ఆలేర్' వెబ్ సీరిస్ తోనే నిర్మాతగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత 'సేనాపతి' పేరుతో ఓ వెబ్ ఫిల్మ్ తీశారు. ఆపైన 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తన తండ్రి చిరంజీవి కథానాయకుడిగా ఈ యేడాది ఆమె నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'మన శంకర వర ప్రసాద్‌' అఖండ విజయాన్ని అందుకుంది. ఆ స్ఫూర్తితో ఇప్పుడు అమెజాన్ కోసం 'జగమే సంగీతం' వెబ్ సీరిస్ నిర్మించారు.


ప్రకాశ్‌ రాజ్‌, మధుబాల, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలు పోషించిన మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సీరిస్ 'బందిష్‌ బాండిట్స్' స్ఫూర్తితో తెలుగులో పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో దీనిని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించారు. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచించిన ఈ మ్యూజికల్ డ్రామాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆయన సంగీతం ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సీరిస్ గురించి దర్శకుడు సూర్యప్రతాప్ చెబుతూ, 'కర్ణాటక సంగీతపు గొప్ప ప్రపంచ నేపథ్యంలో సాగే కథతో 'జగమే సంగీతం' రాబోతోంది. తన తాత శాస్త్రి గారి ప్రఖ్యాత సంగీత వారసత్వానికి వారసుడైన బాలు, సంప్రదాయ భారం, విచ్ఛిన్నమైన కుటుంబ బంధాలు, చిరకాలంగా దాచిపెట్టిన రహస్యాలతో సతమతమవడాన్ని చూపిస్తుంది. పాత వైరుధ్యాలు మళ్లీ తలెత్తి, తరతరాల వారసత్వాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు, బాలు తన కుటుంబం నిర్మించిన దానిని కాపాడుకోవడానికీ, తన సొంత కళాత్మక స్వరాన్ని కనుగొనడానికీ మధ్య నలిగిపోతాడు. ఈ కథకు సంగీతమే ప్రాణం. శాస్త్రి తన జీవితాన్ని అంకితం చేసిన కర్ణాటక సంప్రదాయంలో పాతుకుపోయిన ఈ ధారావాహిక, బాలు సంప్రదాయపు సరిహద్దులకు అవతల ఉన్న ప్రపంచాన్ని కనుగొన్న కొద్దీ తన సంగీత పరిధిని క్రమంగా విస్తరిస్తుంది. ఇక్కడ పాట ఆ కుటుంబానికి రెండవ భాషగా మారుతుంది. కళ పట్ల వారిలో తపించే భక్తి, అసంతృప్తి, ఆరాటం, భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. కర్ణాటక సంగీత సంప్రదాయాలను సమకాలీన శబ్దంతో అందంగా మేళవించిన హృద్యమైన స్వరకల్పనల ద్వారా విశాల్ చంద్రశేఖర్ ఈ సిరీస్‌కి ప్రాణం పోశారు' అని అన్నారు.


నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ, 'సంగీతం కేవలం ప్రపంచంలో ఒక భాగం మాత్రమే కాకుండా ఓ కుటుంబం మాటల్లో చెప్పలేని ప్రేమ, సంఘర్షణ, ఆరాటం, గర్వం, ఆశ, చివరికి స్వస్థత వంటి భావాలను వ్యక్తపరిచే భావోద్వేగ భాషగా మారే కథను చెప్పడం మా ఉద్దేశం. ఈ సిరీస్ కర్ణాటక సంగీత ప్రపంచంలో లోతుగా పాతుకుపోయినప్పటికీ, వారసత్వం, అనుబంధం, మన స్వంత స్వరాన్ని కనుగొనడం వంటి విషయాలు ఇతివృత్తంగా సాగుతుంది. ఇంతటి అసాధారణమైన నటీనటులను, సృజనాత్మక బృందాన్ని ఒకచోట చేర్చడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను 'జగమే సంగీతం' ప్రపంచంలోకి అడుగుపెట్టి, ప్రైమ్ వీడియోలో స్వయంగా అనుభూతి చెందాలని మేం కోరుకుంటున్నాం' అని ఆకాంక్షించారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి, సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి కిరణ్, రూప లక్ష్మి తదితరులు పోషించారు.

ఇవి కూడా చదవండి:

మ్యాడ్ కాంబో.. కార్తీక్‌ సుబ్బరాజ్‌తో వరుణ్‌ తేజ్‌!

‘ఇరుముడి’కి.. చాలా అవార్డులు వస్తాయి

రెండో పెళ్లికి సిద్దమైన మొగలిరేకులు సీరియల్ నటి శిరీష..

Updated Date - Aug 20 , 2026 | 01:17 PM